Robberies at the Telangana, AP Border : తెలంగాణ, ఏపీ బార్డర్ మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని శివారు గ్రామాల్లో వరుస చోరీలు జరుగుతున్నాయి. ద్విచక్రవాహనాలపై ప్రయాణిస్తున్న మహిళల మెడల్లోంచి బంగారు గొలుసులను దుండగులు దొంగతనం చేస్తున్నారు. ఇటీవల ఈ చోరీలు ఎక్కువగా చోటుచేసుకుంటుండటంతో మధిర పోలీసులు నిఘా పెంచారు. తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో గస్తీ చేపడుతూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తున్నారు.
- ఏపీలోని ఎన్‌టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన జొన్నబోయిన జమలయ్య, వెంకటరమణ అనే దంపతులు ద్విచక్రవాహనంపై ఫిబ్రవరి 12న ఎర్రుపాలెం మండలం నారాయణపురం మీదుగా జమలాపురం వైపు వెళ్తున్న సమయంలో మరో ద్విచక్రవాహనంపై ఇద్దరు వ్యక్తులు వారిని వెంబడించారు. నారాయణపురం సమీపంలో వెంకటరమణ మెడలోని 68 గ్రాముల బంగారు నాన్తాడు, నల్లపూసల గొలుసు లాక్కొని నరసింహాపురం వైపు వెళ్లారు. ఈ ఘటనపై స్థానిక ఎస్సై వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
- సిరిపురం శివాలయంలో అమ్మవారి కిరీటాన్ని మార్చి 27వ తేదీన గుర్తుతెలియని దుండగులు దొంగలించారు. ఆలయ హుండీని సైతం పగులగొట్టి నగదు దోచుకెళ్లారు. ఆలయంలో అమర్చిన సీసీ కెమెరాలను కూడా వదలకుండా ఎత్తుకెళ్లారు.
సులువుగా తప్పించుకోవచ్చుననే : తెలుగు రాష్ట్రాలకు మధిర నియోజకవర్గం సరిహద్దు ప్రాంతంగా ఉంది. చోరీలు చేసి సులువుగా తప్పించుకుని పక్కనున్న ఏపీ రాష్ట్రానికి చేరుకోవచ్చనే ధీమాతో దుండగులు రెచ్చిపోతున్నారు. కొంతకాలంగా పట్టపగలు కార్లలో భయం లేకుండా వచ్చి తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు.
కనీసం దేవాలయాలనూ వదలటం లేదు. రాత్రిపూట హుండీలు పగులగొట్టి భక్తుల సమర్పించిన కానుకలను ఎత్తుకెళ్తున్నారు. దేవతావర్తుల విగ్రహాలకు అలంకరించిన ఆభరణాలను మాయం చేస్తున్నారు. జల్సాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్నారనే వాదనలు స్థానికల నుంచి వ్యక్తమవుతున్నాయి.
నిఘా పెంచిన పోలీసులు : మధిర పోలీసు సర్కిల్ పరిధిలో నేరాలను నియంత్రించడానికి పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దులో అనుమానాస్పదంగా తిరిగే వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మధిర పట్టణంలోని ప్రధాన కూడళ్లు, జనసంచార ప్రాంతాల్లో ఏకంగా 30 సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు.
వీటిని పోలీస్ స్టేషన్కు అనుసంధానించి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తాజాగా మరో 40చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. 2024 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు మధిర సర్కిల్ పరిధిలో మొత్తంగా 63 కేసులు నమోదయ్యాయి. 36 కేసుల్లో నిందితులను పట్టుకుని వారి నుంచి దొంగతనం చేసిన నగదు రూ.27 లక్షలను పోలీసులు స్వాధీనపరచుకున్నారు.
"దొంగతనాల నియంత్రణకు సరిహద్దు ప్రాంతాల్లో, మధిర పట్టణంలోనూ పటిష్ఠమైన ఏర్పాట్లు చేశాం. పెట్రోలింగ్ పెంచాం. వేసవి సెలవుల్లో ఊళ్లకు వెళ్లేవారు ముందస్తుగా సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలి. కాలనీల్లో అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలి" -డి. మధు, మధిర సీఐ