అయ్యో దేవుడా! : తండ్రి చూస్తే అలా, కుమారుడు చూస్తే ఇలా - తండ్రీకుమారులను ఆదుకోరూ
వెన్నెముక లోపంతో పుట్టిన బాలుడు - తలకు దెబ్బతగిలి మానసికంగా దెబ్బతిన్న తండ్రి - వారి పరిస్థితి చూసి పుట్టింటికి వెళ్లిపోయిన భార్య - కుమారుడికి, మనవడికి సపర్యలు చేస్తున్న వృద్ధ దంపతులు

Published : May 7, 2025 at 9:09 AM IST
Grandparents Wait Help : కడుపున పుట్టిన కుమారుడు ఆరోగ్యంగా ఉండాలని, వృద్ధాప్యంలో తమకు అండగా నిలబడాలని తల్లిదండ్రులు కోరుకోవడం సహజమే. కానీ ఆసరాగా ఉండాల్సిన కుమారుడికి మతి తప్పితే, మనవడు కనీసం లేవలేని స్ధితిలో మంచం పడితే, ఆ పండుటాకుల వ్యథ అంతా ఇంతా కాదు. కనీసం మందుల ఖర్చులకైనా డబ్బులు లేక ఆ వృద్ధ దంపతులిద్దరు కన్నీటి పర్యంతమౌతున్నారు. ఆసరాగా ఉంటుందని ఇద్దరికీ దివ్యాంగుల ఫించన్ ఇప్పించాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వైద్యం కోసం ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు.
మంచంపై పడుకుని అమాయకంగా కనిపిస్తూ చిరునవ్వులు చిందిస్తున్న ఈ బాలుడి పేరు సిద్దిరాల కార్తికేయ. ఈ బాబుది హనుమకొండ జిల్లా కాజీపేట రహమత్ నగర్. ఇతని వయస్సు పిల్లలందరూ చదువుకుంటూ తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటుంటే ఈ బాలుడు మాత్రం కాలు కదపలేడు. పుట్టుకతోనే వెన్నెముక లోపంతో జన్మించడంతో మంచానికే పరిమితమయ్యాడు. ఎన్ని ఆసుపత్రుల్లో చూపించినా డబ్బు ఖర్చైందే తప్పా నయం కాలేదు.
భర్త, కుమారుడి పరిస్థితి చూసి పుట్టింటికి వెళ్లిన భార్య రాలేదు : ఇదే విషాదమనుకుంటే ఈ బాలుడి తండ్రి అనిల్ కుమార్‌కు సైతం ప్రమాదవశాత్తు తలకు బలమైన గాయం కావడంతో మానసికంగా దెబ్బతిని మతిస్థిమితం కోల్పోయాడు. ఇవన్నీ చూసి బాలుడి తల్లి, అనిల్ భార్య పుట్టింటికి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. ఫలితంగా కార్తికేయ, అనిల్ బాగోగులు వృద్ధులైన తాత, నాయనమ్మల పైన పడింది. నాయనమ్మే పిల్లాడికి వేళకి భోజనం తినిపించడం, మిగతా పనులు చేస్తూ కంటికి రెప్పలా చూసుకుంటోంది. తండ్రి అనిల్‌కు కుమారుడు గుర్తొచ్చినప్పుడల్లా అడపాదడపా చేరదీసి బుజ్జగిస్తాడు.
ఇద్దరికి వైద్యానికి దాదాపు రూ.6 లక్షలు ఖర్చు పెట్టామని, ఇప్పుడు మందులకు రూ.వేలల్లో ఖర్చవుతుందని వృద్ధ దంపతులన్నారు. తండ్రీకుమారులిద్దరికీ దివ్యాంగుల ధ్రువీకరణ పత్రం ఉన్నా, ఫించన్ రావడం లేదన్నారు. అధికారులు స్పందించి ఆసరా ఫించన్ వచ్చేలా చూడాలని, ఎవరైనా దాతలు ఆదుకోవాలని వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని, తమ పిల్లల వైద్యానికి దాతలు ఎవరైనా సాయం చేసి ఆదుకోవాలని కార్తికేయ నాయనమ్మ, తాతయ్య వేడుకుంటున్నారు.
"చాలా ఆసుపత్రులు తిరిగాము. ఇంచుమించు రూ.5 నుంచి రూ.6 లక్షల వరకు ఖర్చు చేశాము. కానీ ఎవరూ బాగు చేయలేమని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే వారు అసలు విషయం చెప్పారు. వైద్యం చేసినా బాగవ్వదని, ఎక్కడికీ తిప్పకుండా ఇంట్లోనే సంతోషంగా చూసుకోమని చెప్పారు. భోజనం, టిఫిన్, రాత్రి భోజనం సమయానికి పెడతాను." - కళావతి, కార్తికేయ నాయనమ్మ
"మనవడు వెన్నుముక లేకుండానే పుట్టాడు. దివ్యాంగ ఫించన్‌కు దరఖాస్తు చేస్తే ఇప్పటి వరకు రాలేదు. సదరం సర్టిఫికెట్ మాత్రం వచ్చింది. కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరిగినా ఫించన్ వస్తదని చెబుతున్నారు తప్ప, ఎప్పుడు వస్తుందో చెప్పడం లేదు. నా మనవడికి దివ్యాంగుల ఫించన్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నాను." - పరమేశ్వరరావు, కార్తికేయ తాత
బిడ్డలకు రూ.కోట్ల ఆస్తిని పంచి - అనాథులుగా రేకుల షెడ్డులో అమ్మానాన్న!

