Yoga Andhra Program In Vizianagaram District: జూన్ 21న విశాఖపట్టణంలో గిన్నిస్ రికార్డ్ నెలకొల్పేలా యోగా డేను నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాకుండా నెల రోజులపాటు రాష్ట్రమంతా దీనిపై అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో మంత్రులు, నేతలు, ప్రభుత్వాధికారులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.
పర్యాటక ప్రదేశాల్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు విజయనగరం జిల్లాలోని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో యోగాంధ్ర వేడుక జరిగింది. ఈ క్షేత్రంలో కొలువుదీరిన రామనారాయణుని పాదాల చెంత రామధనుస్సు ఆకృతిలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ అంబేద్కర్, సంయుక్త కలెక్టర్ సేతుమాధవన్ సహా సుమారు 1500 మంది ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, పరిసర గ్రామాల ప్రజలు భక్తి ప్రపత్తులతో యోగాసనాలు వేశారు.
ఉదయం ఏడు గంటలకు పెద్ద ఎత్తున ప్రజలు, యోగ పట్ల ఆసక్తి గల వారంతా తెల్లని దుస్తులు ధరించి యోగాంధ్ర కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు ప్రదర్శించారు. ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో యోగా గురువులు ఆరిశెట్టి ఇందుమతి, సుందర శివరావు, పలు యోగాసనాలు వేయించారు. యోగాసనాల ప్రదర్శన అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ రామనారాయణ దర్శనాన్ని కల్పించడంతో పాటు తీర్ధ ప్రసాదాలను ఎన్.సి.ఎస్. ట్రస్టు ఆధ్వర్యంలో అందజేశారు.
పూర్వీకులు ఇచ్చిన గొప్ప ఆస్తి యోగా: ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యోగా ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసే ఉద్దేశ్యంతో ఈ నెలను యోగ మాసంగా ప్రకటించి అన్ని ప్రాంతాల్లో యోగ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. యోగా మన పూర్వీకులు అందించిన గొప్ప ఆస్తి అని పేర్కొంటూ, దీనిని సాధన చేయడం ద్వారా మన శరీరాన్ని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంతో పాటు ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించడమే దీని లక్ష్యమన్నారు.
ఉరవకొండలో: అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని షిర్డీసాయి బాబా ఆలయ కళ్యాణ మండపంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి, పాఠశాల విద్యార్థులకు యోగాపై అవగాహన కల్పించారు. అనంతరం యోగాసనాలు వేశారు.
యోగా డే వేడుకల్లో పాల్గొంటారా? - ఇలా నమోదు చేసుకోండి
ఘనంగా యోగాంధ్ర కార్యక్రమాలు- భారీ ర్యాలీలు చేపట్టిన అధికారులు