100 Bed Hospital Foundation Stone in Mangalagiri: భారతదేశంలోనే మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో అత్యాధునిక వసతులతో నిర్మించే 100 పడకల ఆసుపత్రికి మంత్రి నారా లోకేశ్ మరో మంత్రి కందుల దుర్గేష్తో కలిసి భూమి పూజ చేశారు. ఆస్పత్రి నిర్మాణ నమూనాలను మంత్రులు పరిశీలించారు. గత ఎన్నికల సమయంలో మంగళగిరి వాసులకు అత్యాధునిక ఆసుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చానని దానిని నెరవేర్చబోతున్నందుకు సంతోషంగా ఉందని మంత్రి చెప్పారు. అన్ని రంగాలలో మంగళగిరి నియోజకవర్గాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలిపేంతవరకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
అప్పుడు తాత - ఇప్పుడు మనవడు: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మంగళగిరి ప్రజలకు చిరకాల స్వప్నమైన 100 పడకల ఆస్పత్రికి మంత్రి లోకేశ్ నేడు భూమి పూజ చేశారు. అత్యాధునిక వసతులతో ఆస్పత్రిని కేవలం ఏడాది కాలంలోనే పూర్తిచేయనున్నారు. సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఇదే నెలలో టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు మంగళగిరిలో 30 పడకల ఆస్పత్రికి భూమి పూజ చేశారు. మళ్లీ 40 ఏళ్ల తర్వాత ఆయన మనవడు లోకేశ్ 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం మంగళగిరి టిడ్కో నివాసాల వద్ద దివిస్ లేబరేటరీ ఏర్పాటు చేసిన సురక్షిత తాగునీటి పథకాన్ని లోకేశ్ ప్రారంభించారు.
ఇళ్ల పట్టాల రూపంలో వెయ్యి కోట్ల ఆస్తి పంపిణీ: మరోవైపు మంత్రి నారా లోకేశ్ మంగళగిరిలో చేపట్టిన 'మన ఇల్లు - మన లోకేశ్' తొలిదశ కార్యక్రమం నేటితో పూర్తవుతుంది. దాదాపు 3 వేల మంది పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ తొలిదశ కార్యక్రమాన్ని నేటితో పూర్తి చేయనున్నారు. ఇవాళ మొత్తంగా 832 మంది లబ్దిదారులు నారా లోకేశ్ చేతుల మీదుగా శాశ్వత ఇంటి పట్టాలు అందుకోనున్నారు. నేటితో మొత్తం 3000 మంది లబ్ధిదారులకు ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిచేయనున్నారు. లబ్ధిదారులకు లోకేశ్ తన సొంత ఖర్చులతో బట్టలు, పసుపు కుంకుమ పెట్టి, భోజనాలు ఏర్పాటు చేసి ఉచితంగా పట్టాలు అందచేస్తున్నారు.
అధికారం చేపట్టిన ఏడాదిలోపే రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూసేలా వెయ్యి కోట్ల ఆస్తిని ఇళ్ల పట్టాల రూపంలో పేదలకు పంపిణీ చేశామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మంగళగిరి ప్రజలు తనకిచ్చిన మెజారిటీతో విమర్శకులకు సౌండ్ లేకుండా పోయిందని దుయ్యబట్టారు. ఎప్పుడూ మంగళగిరేనా రాష్ట్రం మొత్తం తిరగాలని చంద్రబాబు సూచించారని వెల్లడించారు. మంగళగిరిలో తన పరువు కాపాడి గౌరవం పెంచిన వారికే తన తొలి ప్రాధాన్యమని నాన్నకు చెప్పానన్నారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, నారాయణలతో గొడవడి మరీ మంగళగిరిలో పనులు చేయిస్తున్నానంటే అది ప్రజలు తనకిచ్చిన మెజారిటీనే కారణమని చెప్పారు. రాజధాని అభివృద్ధిలో భాగంగా మంగళగిరికి అద్భుత అవకాశాలు ఉన్నాయని వివరించారు. దశాబ్దాల కల 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన చేయటాన్ని పవిత్రమైన రోజుగా భావిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణ నిర్ణయం మంగళగిరి నుంచి ప్రారంభం కానుందని చెప్పారు.
అనగానిపై లోకేశ్ ప్రశంసలు: రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఓ భోళా శంకరుడని, మంగళగిరిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి అనగాని చిత్తశుద్ధితో కృషి చేశారని కొనియాడారు. మంత్రి నారాయణ సౌజన్యంతో జూన్ నుంచి మంగళగిరిలో భూగర్భ డ్రైనేజీ, విద్యుత్, గ్యాస్ సౌకర్యానికి శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు.
చంద్రబాబు, లోకేశ్ పోటీపడుతున్నారు: పేదలకు ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ మంగళగిరిలో ప్రారంభమైన ఈ ప్రక్రియ రాష్ట్రమంతటా అమలు కానుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. తనను గెలిపించిన ప్రజలకు చిత్తశుద్ధితో పనిచేయాలనే తపనకు లోకేశ్ నిదర్శనమన్నారు. జీవో వచ్చిన తర్వాత కూడా బెత్తం పట్టుకున్న మాస్టర్ మాదిరి వెంటపడి మరీ కార్యక్రమం నిర్వహణకు శ్రీకారం చుట్టారని చెప్పారు. కుప్పం వర్సెస్ మంగళగిరి అన్నట్లుగా చంద్రబాబు, లోకేేశ్ తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం పోటీ పడుతున్నారని ప్రశంసించారు.
మంగళగిరిలో 100 పడకలతో ఆసుపత్రి - డిజైన్లు విడుదల
ఆ నిర్ణయం నా జీవితాన్నే మార్చేసింది - మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుంటా: నారా లోకేశ్