Bumrah On Criticize : ఇంగ్లాండ్‌తో లీడ్స్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కీలక కామెంట్స్ చేశారు. గాయాల నుంచి కొలుకొని తిరిగి వచ్చిన తరువాత తనపై విమర్శలు చేసిన వారిపై ఘాటుగా స్పందించాడు. విమర్శలను తాను పట్టించుకోనని, దేవుడు రాసినంతకాలం క్రికెట్ ఆడతానని చెప్పాడు. పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బూమ్రా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
'వాళ్లు(విమర్శకులు) నా గురించి ఏం అంటారు, ఏం రాస్తారు అనే దానిపై నేను దృష్టి పెట్టను. నా లక్ష్యం ముఖ్యం. వాళ్లు నా పేరుని ఉపయోగించి హెడ్ లైన్స్ వేస్తారనే విషయం నాకు తెలుసు. కానీ అవి నా మైండ్‌లోకి రాకుండా చూసుకుంటాను. నాకు అలాంటి ఒత్తిళ్లు అవసరం లేదు. ప్రతిరోజూ నిద్రకు వెళ్లేముందు నేను నన్ను నేను ఓసారి ప్రశ్నించుకుంటాను. నేను నా వంద శాతం కష్టపడ్డానా? అన్న ప్రశ్నకు అవునని సమాధానం వస్తే చాలు. నిశ్శబ్దంగా నిద్రపోతాను. ఇతరులు ఎలా ఆడమంటారో కాదు, నేను నమ్మిన విధంగానే ఆడతాను. నా ప్రిపరేషన్, నా ఆలోచనలు ఎప్పుడూ భారత్ కోసం ఆడాలనే తపనతోనే ఉంటాయి' అని బూమ్రా తెలిపారు.
"గాయం అయిన ప్రతిసారి, 'ఇంకా బుమ్రా ఆడడు', 'ఇంకా ఆటకి దూరం' అంటూ ఊహాగానాలు వచ్చాయి. అయినా గడిచిన దశాబ్దంగా నేను అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతూనే ఉన్నాను. 'ఇప్పుడు కూడా బుమ్రా రిటైర్ అవుతాడు' అని ఇంకా కొంతమంది అంటున్నారు. ఎదురు చూస్తూ ఉండండి. నేను నా పని చేస్తూనే ఉంటాను. దేవుడు రాసినంతకాలం ఆట కొనసాగిస్తాను," అని బుమ్రా స్పష్టం చేశాడు.
లీడ్స్‌లో బుమ్రా రికార్డులు
లీడ్స్‌లో ఐదు వికెట్లను సాధించడం ద్వారా బుమ్రా రత దిగ్గజం కపిల్ దేవ్ సరసన చేరాడు. విదేశీ గడ్డపై ఆయన 12వ సారి 5వికెట్లు పడగొట్టడం ద్వారా ఈ ఘనత సాధించారు. అంతేకాకుండా సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో 150 టెస్టు వికెట్లు తీసిన మొదటి ఆసియా బౌలర్‌గా బుమ్రా రికార్డు సృష్టించాడు.
ఇదిలా ఉండగా, లీడ్స్ లో మూడో రోజు భారత జట్టు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 90/2 వద్ద నిలిచింది. కేఎల్ రాహుల్ (47*) అజేయంగా నిలిచాడు. శుభ్‌మన్ గిల్ (6*) అతనితో పాటు క్రీజులో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 471 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులు చేసింది.
భారత రెండో ఇన్నింగ్స్ సాగిందిలా
- యశస్వి జైస్వాల్ 4 పరుగులకే అవుట్
- సాయి సుదర్శన్ 30 పరుగులు (48 బంతుల్లో 4 ఫోర్లు)
- రాహుల్, గిల్ నిలకడగా ఆడుతున్నారు.
- వర్షం కారణంగా ఫైనల్ సెషన్ ఆగిపోయింది.