ETV Bharat / sports

ఫాలోఆన్​లో పోరాడుతున్న వెస్టిండీస్- డే 3 కంప్లీట్

భారత్​ x వెస్టిండీస్ రెండో టెస్టు- పోరాడుతున్న విండీస్

Ind vs WI Test 2025
Ind vs WI Test 2025 (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : October 12, 2025 at 5:06 PM IST

2 Min Read
Choose ETV Bharat

Ind vs WI 2nd Test : దిల్లీ టెస్టు రెండో ఇన్నింగ్స్​లో వెస్టిండీస్ గట్టిగానే పోరాడుతోంది. దీంతో వన్​సైడ్​గా జరుగుతున్న మ్యాచ్​ కాస్త ఆసక్తికరంగా మారింది. 270 పరుగులు వెనుకబడి ఫాలో ఆన్​ ఆడుతున్న విండీస్ ​మూడో రోజు ఆట ముగిసేసరికి 173-2 స్కోర్​తో నిలిచింది. ఇంకా 97 పరుగులు వెనుకంజలో ఉంది. ప్రస్తుతం క్రీజులో షయ్ హోప్ (66 పరుగులు), జాన్ చాంప్​బెల్ (87 పరుగులు) ఉన్నారు. మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్​కు చెరో 1 వికెట్ దక్కింది.

తొలి ఇన్నింగ్స్​లో విండీస్ 248 రన్స్​కు ఆలౌట్ అవ్వడంతో, ప్రత్యర్థిని భారత్ ఫాలో ఆన్‌కు దింపింది. అయితే ప్రారంభంలోనే భారత్ మళ్లీ విజృంభించింది. ఓపెనర్ చందర్ పాల్ (10 పరుగులు), అలిక్ అథనజె (7 పరుగులు)ను స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేర్చింది. జట్టు స్కోర్ 17 వద్ద చందర్​పాల్​ను సిరాజ్ ఔట్ చేయగా, ఆ తర్వాత కాసేపటికే అథనజెను సుందర్ క్లీన్ బౌల్డ్ చేసి విండీస్​ను దెబ్బ కొట్టాడు. దీంతో విండీస్ 35/2 స్కోరుతో టీ బ్రేక్​కు వెళ్లింది.

ఇక టీమ్ఇండియా మిగిలిన 8 వికెట్లు కూడా త్వరగానే కూలుస్తుందని అనుకున్నారంతా. కానీ ఆఖరి సెషన్​లో విండీస్ బ్యాటర్లు అద్భుతంగా పోరాడారు. హోప్, చాంప్​బెల్ చెరో హాఫ్ సెంచరీతో జట్టును ఓటమి నుంచి గట్టెక్కించి, భారత్​కు లక్ష్యం నిర్దేశించేలా పోరాడుతున్నారు. ఈ ఇద్దరూ మూడో వికెట్​కు 207 బంతుల్లోనే అజేయంగా 138 పరుగులు చేశారు. దీంతో విండీస్ 173-2 స్కోర్​తో కాస్త బలంగా కనిపిస్తుంది. ఫాలోఆన్​లో విండీస్ ఇంకా 97 పరుగులు వెనుకంజలో ఉంది. ఈ 97 రన్స్​ బాదిన తర్వాత వెస్టిండీస్ సాధించే స్కోర్ టీమ్ఇండియా టార్గెట్ అవుతుంది.

కాగా, అంతకుముందు తొలి ఇన్నింగ్స్​లో వెస్టిండీస్ 248 పరుగులకు ఆలౌటైంది. కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో రఫ్పాడించాడు. 3 వికెట్లతో రవీంద్ర జడేజా సత్తా చాటాడు. సిరాజ్, బుమ్రా తలో 1 వికెట్ దక్కించుకున్నారు. దీంతో విండీస్​ను భారత్​ ఫాలోఆన్​లోకి నెట్టింది. ఇక భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ను 518/5 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది.

సంక్షిప్త స్కోర్లు

  • భారత్ : 518-5 డిక్లేర్డ్ (తొలి ఇన్నింగ్స్)
  • వెస్డిండీస్ : 248-10 (తొలి ఇన్నింగ్స్)
  • వెస్డిండీస్ : 173- 2* ఫాలోఆన్ (రెండో ఇన్నింగ్స్)

కాగా, తొలి ఇన్నింగ్స్​లో 5 వికెట్ల ప్రదర్శనతో కుల్దీప్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 5 వికెట్ల ప్రదర్శన చేయడం అతడికి ఇది ఐదోసారి కావలం విశేషం. ఈ క్రమంలోనే టెస్టుల్లో అత్యధికసార్లు ఈ ప్రదర్శన చేసిన లెఫ్ట్ హాండ్ రిస్ట్ స్పిన్నర్​గా కుల్దీప్ జాని వార్డేను సమం చేశాడు. అయితే జానీ ఈ ఘనత 29 టెస్టుల్లో అందుకోగా, కుల్దీప్ 15 మ్యాచ్​ల్లోనే ఇది సాధించడం విశేషం.

టెస్టుల్లో అత్యధికసార్లు 5 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన ఎడమ చేతి మణికట్టు స్పిన్నర్లు

  • కుల్దీప్ - 5 సార్లు- 15 టెస్టులు
  • జాని వార్దే- 5 సార్లు- 29 టెస్టులు
  • పాల్ ఆడమ్- 4 సార్లు- 45 టెస్టులు

తిప్పేసిన యాదవ్ కుల్దీప్- 'ఫాలో ఆన్​లో'కి విండీస్

రాణించిన జడేజా, గిల్- విండీస్ టెస్టు డే 2 కంప్లీట్