Virat Kohli On BCCI Family Restriction Rule : టీమ్ఇండియా పర్యటనల్లో క్రికెటర్లతో పాటు వాళ్ల కుటుంబాలు ఉంటే మంచిదని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అన్నాడు. గ్రౌండ్ కష్టంగా గడిచిన రోజుల్లో ఒంటరిగా గదిలో ఇబ్బంది పడే బదులు కుటుంబ సభ్యులతో ఉండడానికే తాను ఇష్టపడతానని చెప్పాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో 1-3 ఓటమి తర్వాత కుటుంబ సభ్యులతో భారత క్రికెటర్లు ఉండే సమయాన్ని బీసీసీఐ తగ్గించింది. ఈ నేపథ్యంలోనే కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు.
బీసీసీఐ జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం 45 రోజులకు మించిన పర్యటనలో కుటుంబ సభ్యులు క్రికెటర్లతో రెండు వారాలకు మించి ఉండడానికి వీలు లేదు. ఇక చిన్న పర్యటనల్లో మాత్రం వారం వరకు ఉండొచ్చు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా కోహ్లి, జడేజా, షమి - వారి కుటుంబ సభ్యులతో ఉన్నారు. కానీ వాళ్లు జట్టు హోటల్లో లేకుండా వాళ్ల ఖర్చులను క్రికెటర్లే భరించారు.
''కుటుంబ సభ్యుల పాత్ర ఎలాంటిదో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టం. మైదానంలో తీవ్ర పోటీ తర్వాత వాళ్లతో గడిపితే ప్రశాంతంగా ఉంటుంది. అలా చేయడం వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో ప్రజలకు తెలుసని నేను అనుకోను. నా రూమ్‌కు వెళ్లి ఒంటరిగా చిరాకుగా కూర్చుకోవాలనుకోను. సాధారణంగా ఉండాలనుకుంటాను. కుటుంబంతో ఉంటేనే అది సాధ్యం అవుతుంది. కుటుంబ సభ్యులతో ఉంటే సంతోషంగా ఉంటుంది. వాళ్లతో ఉండడానికి వీలు కల్పించే ఏ చిన్న అవకాశాన్ని కూడా నేను వదిలిపెట్టను'' అని కోహ్లీ చెప్పాడు.
అంతేకాకుండా క్రికెటర్లకు సంబంధించిన ఈ విషయాలతో సంబంధం లేని వ్యక్తులు అనవసర చర్చలు చేయడం, కుటుంబాలు దూరంగా ఉండాలనడం నిరాశ కలిగిస్తోందని కోహ్లీ చెప్పాడు. ప్రతి ఆటగాడు కుటుంబం తనకు దగ్గరగా ఉండాలని కోరుకుంటాడని అన్నాడు.
'రిటైర్మెంట్ తర్వాత ట్రావెలింగ్ చేస్తా'
రిటైర్ అయ్యాక తాను ఎక్కువగా ప్రయాణం చేసే అవకాశముందని విరాట్ చెప్పాడు. ''ఏమో, రిటైర్ అయ్యాక ఏం చేస్తానో తెలియదు. ఇటీవల జట్టు సహచరుడిని ఇదే ప్రశ్న అడిగా. అతడూ ఇదే జవాబిచ్చాడు. కానీ ఎక్కువగా ప్రయాణం చేస్తానేమో'' అని తెలిపాడు. రిటైర్ అయ్యాక కొంతకాలం తాను ఎవరికీ కనపడనని కోహ్లి గతంలో చెప్పడం గమనార్హం.
అమ్మ అలా అంటుంది
తన ఫిట్‌నెస్ గురించి తల్లిని ఒప్పించడం చాలా కష్టమని విరాట్ అన్నాడు. ''నా ఫిట్‌నెస్ విషయంలో మా అమ్మని ఒప్పించడం చాలా కష్టం. నేను పరాటాలు తినట్లేదని అమ్మ బాధపడుతోంది. గ్రౌండ్లో చాలా బలహీనంగా కనిపిస్తున్నానని అంటుంది. ఇంత ఫిట్‌గా ఎలా ఉంటావని ఇతర దేశాల క్రికెటర్లు కూడా నన్ను అడుగుతుంటారని చెబుతుంటా. నేను బాగానే ఉన్నానని, అనారోగ్యంగా లేనని ఆమెను ఒప్పించాల్సి వస్తోంది. అది కష్టమైన పని'' అని కోహ్లీ తెలిపాడు.