Virat Kohli About Gautam Gambhir : శ్రీలంక సిరీస్‌కు కౌంట్‌డౌన్ మొదలైన నేపథ్యంలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆడుతాడా లేడా అన్న విషయంలో సందేహాలు మొదలైంది. ముఖ్యంగా గౌతమ్ గంభీర్‌ను ప్రధాన కోచ్‌గా ప్రకటించాక చాలామంది క్రికెట్ అభిమానుల నోట వచ్చిన తొలి కామెంట్ ఇదే. ఐపీఎల్ సమయంలో వీరిద్దరి మధ్య జరిగిన సంఘటనలే దీనికి కారణం. అయితే, అవన్నీ గతమని, తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవంటూ తాజాగా ఈ ఇద్దరూ బీసీసీఐతో చెప్పుకున్నారట.
"గంభీర్‌తో గతంలో జరిగిన ఘటనలు మా బంధంపై ప్రభావం చూపించవు. భారత్ జట్టు కోసం కలిసి ఆడతాం. టీమ్‌ఇండియాను ముందుకుతీసుకెళ్లడమే మా ఇద్దరి లక్ష్యం. ఈ విషయంలో బోర్డు ఎలాంటి అపోహలకు వెళ్లాల్సిన అవసరం లేదు" అంటూ కోహ్లీ బీసీసీఐకి భరోసా ఇచ్చినట్లు సమాచారం.
ఐపీఎల్లో గొడవలు - గంభీర్ సూపర్ రియాక్షన్
లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్ మెంటార్‌గా ఉన్న సమయంలో గంభీర్ కాస్త దురుసుగా ప్రవర్తించారు. తమ జట్టు సభ్యులను డిఫెండ్ చేసేందుకు అభిమానులు అలాగే విరాట్ కోహ్లీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఈసారి మాత్రం కోహ్లీతో కలిసి ఆప్యాయంగా ముచ్చటించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఇక గంభీర్ కూడా తమ అనుబంధంపై ఆ తర్వాత కొన్ని ఇంటర్వ్యూల్లోనూ మాట్లాడాడు.
"వాస్తవికతకు, అంచనాకు చాలా తేడా ఉంటుంది. విరాట్ కోహ్లీతో నా అనుబంధం గురించి దేశం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తన భావాలను వ్యక్తపరిచే హక్కు అతడికి ఎలాగో ఉంది. అలాగే మన జట్టు విజయం సాధించాలని కోరుకోవడంలోనూ తప్పేం లేదు. మా రిలేషన్ ప్రేక్షకులకు మసాలా వంటి న్యూస్‌లు ఇవ్వడానికి కాదు" అని గంభీర్ అన్నాడు.