Orange Cap IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 టైటిల్ వేట రసవత్తరంగా సాగుతోంది. చాలా మ్యాచుల్లో లాస్ట్ ఓవర్ వరకు గెలుపు దోబూచులాడుతోంది. ప్రతి టీమ్‌లో నిమిషాల్లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగల హిట్టర్లు ఉండటంతో చివరి వరకు ఎవరు గెలుస్తారో అంచనా వేయలేని పరిస్థితి. అయితే కొందరు ప్లేయర్‌లు స్థిరంగా పరుగులు చేస్తూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ప్రతి సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ అవార్డు ప్రత్యేకం. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఆరెంజ్ క్యాప్ ఇస్తారు. ఇప్పటికే ఈ రేసులో చాలా మంది ఉన్నారు. టోర్నీ ముగిసే సరికి పోటీ అమాంతం పెరుగుతుంది. మరి ఇంత పోటీ ఉండే అవార్డును వరుసగా రెండు సీజన్లలో గెలుచుకోవడం అంటే సాధారణ విషయమా? అవును ఐపీఎల్ చరిత్రలో ఏకైక ప్లేయర్ ఈ ఘనత దక్కింది.
వరుసగా రెండు ఆరెంజ్ క్యాప్‌లు
ఐపీఎల్ హిస్టరీలో వరుసగా రెండు సీజన్లు ఆరెండ్ క్యాప్ గెలుచుకున్న రికార్డ్ వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ వరుసగా రెండు సంవత్సరాలు 2011, 2012లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. 2011లో ఆర్సీబీ తరఫున 608 రన్స్ కొట్టాడు. ఈ సీజన్‌లో బెంగళూరు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ, చెన్నై చేతిలో ఫైనల్ ఓడిపోయింది. అలానే 2012 ఆర్సీబీలో గేల్ 733 పరుగులు చేశాడు. దురదృష్టవశాత్తు ఈ సారి బెంగళూరు ప్లేఆఫ్స్‌కి కూడా చేరలేదు.

ఇతర రికార్డులు
- 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఆరెంజ్ క్యాప్ ఉంది. మొదటి విజేత ఆస్ట్రేలియాకు చెందిన షాన్ మార్ష్. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున 616 పరుగులు చేశాడు
- కోహ్లీకి 2016 సీజన్‌లో RCB తరఫున 973 పరుగులు చేశాడు. అందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. ఇవే ఇప్పటికీ ఒక సీజన్‌లో సాధించిన అత్యధిక పరుగులు కావడం గమనార్హం. 2024లో కూడా విరాట్ కోహ్లీ 741 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సాధించాడు
- డేవిడ్ వార్నర్ అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. 2015, 2017 2019లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున అత్యధిక పరుగులు చేశాడు
- ఒకే సంవత్సరంలో ఆరెంజ్ క్యాప్, ఐపీఎల్ ట్రోఫీని ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే గెలుచుకున్నారు. 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున రాబిన్ ఉతప్ప, 2021లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రుతురాజ్ గైక్వాడ్ ఈ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు
IPL పర్పుల్ క్యాప్ హీరోస్- బంతి పట్టారంటే వికెట్ పడాల్సిందే!