Ind vs Eng 1st Test : అండర్సన్- తెందుల్కర్ టెస్టు సిరీస్‌ను భారత్ ఓటమితో ఆరంభించింది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా హెడింగ్లీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో పోరాడినప్పటికీ భారత్‌కు ఓటమి ఎదురైంది. ఈ క్రమంలోనే భారత్ ఓ చెత్త రికార్డ్ మూటగట్టుకుంది. అదేంటంటే?
ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 471, రెండో ఇన్నింగ్స్‌లో 364 పరుగులు చేసింది. ఇందులో తొలి ఇన్నింగ్స్‌లో మూడు (జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్) సెంచరీలు బాదగా, రెండో ఇన్నింగ్స్‌లో (పంత్, కేఎల్ రాహుల్) రెండు శతకాలతో రాణించారు. అంటే ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా నుంచి రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఐదు సెంచరీలు నమోదయ్యాయి. అయినప్పటికీ భారత్ ఓటమి చవిచూసింది.
అయితే ఒక జట్టులో ఐదు సెంచరీలు నమోదైనప్పటికీ ఆ టీమ్ ఓడిపోవడం 148 ఏళ్ల టెస్టు చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇదివరకు ఈ చెత్త రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. 1928- 29లో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఓ మ్యాచ్‌లో ఆసీస్ ప్లేయర్లు 4 సెంచరీలు చేసినప్పటికీ కంగారూ జట్టు ఓడిపోయింది. దిగ్గజ క్రికెటర్ డాన్ బ్రాడ్‌మాన్ ఆ మ్యాచ్‌లోనే తన తొలి శతకం పూర్తి చేశాడు.
England win the opening Test by 5 wickets in Headingley#TeamIndia will aim to bounce back in the 2nd Test
— BCCI (@BCCI) June 24, 2025
Scorecard ▶️ https://t.co/CuzAEnBkyu#ENGvIND pic.twitter.com/9YcrXACbHn
ఇలా అయితే ఎలా?
ఈ మ్యాచ్‌ను టీమ్ఇండియా ఎంత గొప్పగా ఆరంభించింది. ఏకంగా ఐదు సెంచరీలు నమోదయ్యాయి. కానీ, ఏం ప్రయోజనం? మిడిలార్డర్లో బ్యాటర్లు ఉదాసీనంగా ఆడి వికెట్లు ఇచ్చేసి, కీలక క్యాచ్‌లు వదిలేసి, ఒత్తిడి పెంచాల్సిన సందర్భాల్లో బౌలర్లు పట్టు విడవడం భారత్ ఓటమికి కారణాలు. ఇలా చేస్తే ఏ జట్టునైనా విజయం ఎలా వరిస్తుంది?
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 550- 600 స్కోరు చేసేలా కనిపించినా, 41 పరుగుల వ్యవధిలోనే ఆఖరి 7 వికెట్లు కోల్పోయి 471 స్కోర్‌కే ఆలౌటైంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే రిపీట్ అయ్యింది. ఈసారి 31 పరుగుల తేడాలో 6 వికెట్లు కోల్పోయింది. ఇలా రెండు ఇన్నింగ్స్‌ల్లో భారీ స్కోర్లు నమోదు చేసే అవకాశం వచ్చినా, మిడిలార్డర్, టెయిలెండర్లు చేతులెత్తేయడం వల్ల చేయాల్సిన దానికంటే తక్కువ స్కోర్లకే ఆలౌట్ అయ్యింది.
ముగ్గురు సెంచరీలు చేసి ఏం లాభం?- గిల్ కెప్టెన్సీలో భారత్ చెత్త రికార్డ్!