IPL 2025 RR vs KKR : ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధించింది. జట్టు 8 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ను చిత్తు చేసింది. రాజస్థాన్ విధించిన 152 లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా సునాయాసంగా టార్గెట్‌ను ఛేదించింది. క్వింటన్ డికాక్ (97 నాటౌట్; 61 బంతుల్లో 8×4, 6×6) సూపర్ ఇన్నింగ్స్‌తో లక్ష్యాన్ని 17.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కాగా రాజస్థాన్‌కు వరుసగా ఇది రెండో ఓటమి.
Caught the big fish! 🎣 💜 pic.twitter.com/f62u66nIka
— KolkataKnightRiders (@KKRiders) March 26, 2025
విజృంభించిన డికాక్
రాయల్స్ ఇన్నింగ్స్ సాగిన తీరు చూస్తే ఛేదనలో కోల్‌కతా కూడా కష్టపడుతుంది అని అనిపించింది. కానీ డికాక్ రాజస్థాన్‌కు ఆ అవకాశం ఇవ్వలేదు. సునీల్ నరైన్ అనారోగ్యం బారిన పడడం వల్ల ఈ మ్యాచ్‌లో ఆడిన మొయిన్ అలీ ఓపెనింగ్‌లో డికాక్‌తో జట్టు కట్టాడు. కానీ ఈ ఇంగ్లిష్ ఆల్‌రౌండర్ నరైన్‌లా బ్యాట్ ఝళిపించలేకపోయాడు. తీవ్రంగా తడబడ్డ మొయిన్ (5) రనౌటై వెనుదిరిగాడు. రహానె (18) సైతం ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. అయినా నైట్‌రైడర్స్‌కు ఏమాత్రం ఇబ్బంది కలగలేదు. మ్యాచ్‌లో మిగతా బ్యాటర్లు ఇబ్బంది పడ్డ పిచ్‌పై డికాక్ అలవోకగా భారీ షాట్లు బాదాడు. పేసర్లు, స్పిన్నర్లు అని తేడా లేకుండా అందరి బౌలింగ్‌లో ఫోర్లు, సిక్సర్లు కొట్టాడు. 35 బంతుల్లో అర్ధశతకం సాధించిన డికాక్ తర్వాత ఇంకా దూకుడుగా ఆడాడు. నాలుగో స్థానంలో 'ఇంపాక్ట్ ప్లేయర్'గా వచ్చిన రఘువంశీ (22 నాటౌట్) నుంచి డికాక్‌కు చక్కటి సహకారం అందడం వల్ల కోల్‌కతా ఛేదన సాఫీగా సాగిపోయింది. ఈ జోడీ మూడో వికెట్‌కు 83 పరుగులు జోడించింది.
Caught the big fish! 🎣 💜 pic.twitter.com/f62u66nIka
— KolkataKnightRiders (@KKRiders) March 26, 2025
బ్యాటింగ్ సాగిందిలా!
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ 28 బంతుల్లో +5 ఫోర్లతో 33 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (29; 24 బంతుల్లో 2x4, 2x6), సంజు శాంసన్ (13; 11 బంతుల్లో 2x4) పరుగులు చేశారు. కెప్టెన్ రియాన్ పరాగ్ (25; 15 బంతుల్లో 3x6) దూకుడుగా ఆడినప్పటికీ క్రీజులో ఎక్కువ సేపు నిలదొక్కుకోలేకపోయాడు. నితీశ్ రాణా (8), వానిందు హసరంగ (4), శుభమ్ దూబె (9) పరుగులు మాత్రమే చేశారు. జోఫ్రా ఆర్చర్ (16; 7 బంతుల్లో 2x6) పోరాటంతో స్కోర్ 150 దాటింది. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా తలో రెండు వికెట్లు పడగొట్టారు. స్పెన్సర్ జాన్సన్‌కు ఒక వికెట్ దక్కింది.