ICC Champions Trophy Golden Bat Winners : క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఈ రోజు మొదలైంది. ఎనిమిదేళ్ల తర్వాత జరుగుతున్న టోర్నీ మొదటి మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్థాన్, న్యూజిలాండ్ ఢీకొంటున్నాయి. రెండుసార్లు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్ జర్నీ, ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ మ్యాచ్‌తో మొదలు కానుంది. బలమైన జట్టుతో బరిలో దిగుతున్న టీమ్‌ఇండియా మూడో కప్పుపై కన్నేసింది. అయితే ఇప్పటి వరకు భారత్ పాల్గొన్న ఛాంపియన్స్ ట్రోఫీల్లో మరెవ్వరికీ దక్కని ఓ సీనియర్ క్రికెటర్ సొంతం చేసుకున్నాడు. ఆ రికార్డు ఏంటో తెలుసా?
వరుసగా రెండు సార్లు రికార్డు
ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో కొందరు భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. 2000లో సౌరవ్ గంగూలీ అత్యధిక పరుగులు (348) చేశాడు. 2002లో వీరేంద్ర సెహ్వాగ్ (271) పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. అయితే శిఖర్ ధావన్ మాత్రం వరుసగా రెండు సార్లు ఈ రికార్డు అందుకున్నాడు. మరే ప్లేయర్‌కి ఈ ఘనత దక్కలేదు. 2013, 2017 ఛాంపియన్స్ ట్రోఫీల్లో ప్రతిష్టాత్మకమైన 'గోల్డెన్ బ్యాట్' అవార్డును ధావన్ అందుకున్నాడు.
2013 ఛాంపియన్స్ ట్రోఫీలో సౌతాఫ్రికా, వెస్టిండీస్‌పై ధావన్ సెంచరీలు చేశాడు. మొత్తంగా 363 పరుగులు చేశాడు. భారత్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో మరోసారి సత్తా చాటాడు. ఐదు ఇన్నింగ్స్‌లలో 338 పరుగులు చేశాడు. ధావన్ సహకారంతో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. రెండు సీజన్లలో కలిపి 10 ఇన్నింగ్స్‌లలో మొత్తం 701 పరుగులు చేశాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ గోల్డెన్ బ్యాట్ విజేతలు
1998 – ఫిలో వాలెస్ (వెస్టిండీస్)
2000 – సౌరవ్ గంగూలీ (ఇండియా)
2002 – వీరేంద్ర సెహ్వాగ్ (ఇండియా)
2004 – మార్కస్ ట్రెస్కోథిక్ (ఇంగ్లండ్)
2006 – క్రిస్ గేల్ (వెస్టిండీస్)
2009 – రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)
2013 – శిఖర్ ధావన్ (ఇండియా)
2017 - శిఖర్ ధావన్ (ఇండియా)
ఛాంపియన్స్ ట్రోఫీ : 8-8-8 ఫార్ములా- ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?