Neeraj Chopra Lieutenant Colonel Rank : భారత స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ గౌరవ హోదాను ప్రదానం చేసింది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇది 2025 ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది.
1948 టెరిటోరియల్ ఆర్మీ రెగ్యులేషన్స్‌లోని పేరా 31 ప్రకారం నీరజ్ చోప్రాకు ఈ హోదాను ప్రదానం చేయడానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారని ప్రకటనలో తెలిపింది. ఇక 2016 నుంచి నీరజ్ చోప్రా భారత సైన్యంలో సుబేదార్‌గా వ్యవహరించారు. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ స్వర్ణ పతకం సాధించి రికార్డ సృష్టించారు. అనంతరం నిరజ్ చోప్రాను కేంద్ర ప్రభుత్వం 'పరమ విశిష్ట సేవా పతకం'తో సత్కరించింది. 2021లో భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన 'మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న', 2022లో 'పదశ్రీ అవార్డు'ను అందుకున్నారు. గతేడాది జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సొంతం చేసుకున్నారు. కాగా, మే 16న దోహా డైమండ్ లీగ్‌లో, జూన్ 24న ఒస్ట్రావా గోల్డెన్ స్పైక్ 2025 అథ్లెటిక్స్ మీట్‌లో నీరజ్ పోటీపడునున్నారు.
దేశానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత సైన్యం ప్రత్యేక హోదాతో సత్కరిస్తోంది. ఈ గౌరవ హోదాను పొందిన వారిలో నీరజ్ చోప్రా కంటే ముందు స్టార్ నటుడు మోహన్ లాల్, భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, సచిన్ పైలట్, కపిల్ దేవ్, అనురాగ్ ఠాకూర్, అభినవ్ బింద్రా ఉన్నారు.
ఇటీవల JSW స్పోర్ట్స్‌తో కలిసి, భారతదేశంలో మొట్టమొదటి అంతర్జాతీయ జావెలిన్ పోటీ "నీరజ్ చోప్రా క్లాసిక్ 2025"ను ప్రారంభించనున్నట్లు ప్రకటించాడు నీరజ్. ఈ చారిత్రాత్మక ఈవెంట్‌కు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AFI) అనుమతి ఇచ్చింది. అయితే, నీరజ్ చోప్రా క్లాసిక్ 2025" జావెలన్ త్రో ఈవెంట్‌కు పాకిస్థాన్ జావెలిన్ త్రో స్టార్ అర్షద్ నదీమ్‌ను ఆహ్వానించడంపై విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.