IPL 2025 Saliva Rule Change : ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానుంది. ఈ క్రమంలో ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకుంది. బంతికి ఉమ్మి రాయడంపై ఉన్న నిషేధాన్ని తొలగించింది. గురువారం ముంబయిలో ఐపీఎల్ కెప్టెన్ల సమావేశం జరిగింది. మెజారిటీ కెప్టెన్‌లు బంతికి లాలజలం రాయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలనే ప్రతిపాదనకు అంగీకరించారు. దీంతో బీసీసీఐ తాజా నిర్ణయం తీసుకుంది.
బంతిని రివర్స్ స్వింగ్ చేసే క్రమంలో పేసర్లు ఉమ్మిని బంతికి రాస్తుంటారు. ప్రధానంగా టెస్టు క్రికెట్లో దీని ప్రభావం ఎక్కువ. కానీ, కరోనా సమయంలో ఐసీసీ బంతిపై ఉమ్మి రాయడాన్ని నిషేధించింది. తర్వాత ఐపీఎల్‌లోనూ దీన్ని అమలు చేశారు. భారత స్టార్ పేసర్ మహ్మద్ షమి, టిమ్ సౌథీతో పాటు చాలా మంది పేసర్లు ఈ మధ్య ఉమ్మిపై నిషేధాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఐపీఎల్‌లో నిషేధం ఎత్తివేయడం వల్ల ఐసీసీ కూడా ఆ దిశగా చర్యలు తీసుకోక తప్పకపోవచ్చు.
10 ఓవర్ల తర్వాత బంతి మార్పు
సలైవా నిషేధంతో పాటు బీసీసీఐ మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఐపీఎల్‌లో మ్యాచ్‌ల్లో రెండో ఇన్నింగ్స్‌లో రెండు బంతులను వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. సాయంత్రం వేళ జరిగే మ్యాచ్‌ల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మంచు కురిసి బంతి తడవడం వల్ల బాల్‌పై బౌలర్లకు పట్టు దొరకదు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ సమయంలో బౌలర్లకు ఇది ఇబ్బందికరంగా మారింది. దీంతో ఇక నుంచి ఐపీఎల్‌లో సాయంత్రం వేళ జరిగే మ్యాచ్‌ల్లో రెండు బంతులను వినియోగించుకునేలా కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రూల్స్ ప్రకారం రెండో ఇన్నింగ్స్‌లో పదో ఓవర్ తర్వాత బంతిని మార్చమని అడిగే హక్కు కెప్టెన్లకు ఉంటుంది. అయితే, ఔట్‌ఫీల్డ్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అంపైర్ తన విచక్షణతో నిర్ణయం తీసుకుంటాడు. అంతేకాకుండా రీప్లేస్‌మెంట్ కోసం కొత్త బంతిని ఇవ్వరు. మార్చాలని కోరుతున్న బంతి ఎలా ఉందో దాదాపు అలానే ఉన్న మరో బంతిని ఇస్తారు.