IPL 2024 PBKS VS KKR : ఐపీఎల్ 2025లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 16 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. 111 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని మరపురాని విజయాన్ని సొంతం చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 15.3 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. ఈ స్వల్ప లక్ష్యఛేదనలో కోల్‌కతా ఘోరంగా తడబడి 15.1 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది. కేకేఆర్ బ్యాటర్లలో అంగ్‌క్రిష్ రఘువంశీ (37) టాప్ స్కోరర్. రహనె (17), ఆండ్రీ రస్సెల్ (17) పరుగులు చేశారు. సునాయసంగా విజయం సాధించేలా కనిపించిన కోల్‌కతాను యుజ్వేంద్ర చాహల్ (4/28) దెబ్బకొట్టాడు. మార్కో యాన్సెన్ (3/17) కూడా బంతితో మెరిశాడు. మ్యాక్స్‌వెల్, అర్ష్‌దీప్, బార్ట్‌లెట్ తలో వికెట్ పడగొట్టారు. ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోరు కాపాడుకున్న జట్టుగా పంజాబ్ రికార్డు సృష్టించింది. చాహల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. సునీల్ నరైన్ (5)ని యాన్సెన్ బౌల్డ్ చేశాడు. డికాక్ (2)ని బార్ట్‌లెట్ వెనక్కి పంపాడు. తర్వాత రహానె, రఘువంశీ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. బార్ట్‌లెట్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో రహానె ఒక సిక్స్ కొట్టగా రఘువంశీ సిక్స్, ఫోర్ బాదాడు. ఈ క్రమంలో కోల్‌కతా 7 ఓవర్లు ముగిసేసరికి 60/2తో నిలిచి సునాయసంగా గెలిచేలా కనిపించింది. కానీ, యుజ్వేంద్ర చాహల్ బంతి అందుకోవడంతో కోల్‌కతా ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. క్రీజులో కుదురుకున్న రహానె, రఘువంశీని వరుస ఓవర్లలో పెవిలియన్‌కు పంపాడు. రహానె వికెట్ల ముందు దొరికిపోగా.. రఘువంశీ బార్ట్‌లెట్‌కు చిక్కాడు. తర్వాత వచ్చిన వెంకటేశ్ అయ్యర్ (7) మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అనంతరం చాహల్ వరుస బంతుల్లో రింకు సింగ్ (2), రమణ్‌దీప్ సింగ్ (0)ని ఔట్ చేశాడు. రింకు స్టంపౌట్ కాగా.. రమణ్‌దీప్ స్లిప్‌లో శ్రేయస్‌కు చిక్కాడు. కాసేపటికే హర్షిత్ రాణా (3)ను యాన్సెన్ వెనక్కి పంపాడు. దీంతో కోల్‌కతా 13 ఓవర్లకు 79/8తో నిలిచింది.
అయితే, రస్సెల్ క్రీజులో ఉండటంతో కోల్‌కతా శిబిరంలో గెలుపు ఆశలు సజీవంగా ఉన్నాయి. చాహల్ వేసిన 14 ఓవర్‌లో రస్సెల్ రెండు సిక్స్‌లు, ఫోర్ కొట్టాడు. అర్ష్‌దీప్ వేసిన 15 ఓవర్‌లో తొలి ఐదు బంతులకు పరుగులు చేయలేకపోయిన వైభవ్ అరోరా (0).. చివరి బంతికి జోష్ ఇంగ్లిస్‌కు క్యాచ్ ఇవ్వడంతో కోల్‌కతా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో రస్సెల్ చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. బ్యాట్‌కు తగిలిన బంతి ఇన్‌సైడ్ ఎడ్జ్ అయి స్టంప్స్‌ను తాకడంతో పంజాబ్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగితేలారు.
పంజాబ్ బ్యాటర్లలో కూడా ఎవరూ పెద్దగా చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (22), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (30) మాత్రమే ఫర్వాలేదనిపించారు. ఈ జోడీ 3.2 ఓవర్లకే 39 పరుగులు జోడించింది. తర్వాత కోల్‌కతా బౌలర్లు పుంజుకుని వరుసగా వికెట్లు పడగొట్టారు. హర్షిత్ రాణా ఒకే ఓవర్‌లో ప్రియాంశ్, శ్రేయస్ అయ్యర్ (0)ని ఔట్ చేశాడు. వీరిద్దరూ రమణ్‌దీప్ సింగ్‌కే క్యాచ్ ఇచ్చారు. జోష్ ఇంగ్లిస్ (2) వరుణ్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. హర్షిత్ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్ రమణ్‌దీప్‌కు చిక్కాడు. నేహల్ వధేరా (10)ని నోకియా ఔట్ చేశాడు. మ్యాక్స్‌వెల్ (7)ని వరుణ్ వెనక్కి పంపాడు. సుర్యాంశ్ (4), యాన్సెన్ (1)ను నరైన్ ఒకే ఓవర్‌లో ఔట్ చేశాడు. ఈ దశలో శశాంక్ సింగ్ (18), బార్ట్‌లెట్ (11) పోరాటంతో స్కోరు 100 దాటింది. వైభవ్ బౌలింగ్‌లో శశాంక్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. బార్ట్‌లెట్ రనౌట్ కావడంతో పంజాబ్ ఆలౌటైంది.