Champions Trophy India jersey : ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఐసీసీ నిర్దేశించిన డ్రెస్ కోడ్‌ను పాటిస్తుందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్ పేరును టీమ్ఇండియా ఆటగాళ్ల జెర్సీపై వేసుకోవడానికి బీసీసీఐ అభ్యంతరం చెప్పిందనే ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు.
'జెర్సీపై పేరు ఉంటుంది'
'ఛాంపియన్స్ ట్రోఫీలో డ్రెస్ కోడ్ సహా ఐసీసీ ప్రతి నియమాన్ని బీసీసీఐ పాటిస్తుంది. టోర్నమెంట్ లోగో, ఆతిథ్య జట్టు (పాకిస్థాన్) పేరును టీమ్ఇండియా ఆటగాళ్లు తమ జెర్సీలపై వేసుకుంటారు. డ్రెస్ కోడ్‌కు సంబంధించి ఇతర జట్లు ఏమి చేసినా, బీసీసీఐ మాత్రం నిబంధనలు పాటిస్తుంది. అయితే లాహోర్‌లో జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్, అధికారిక ఫొటో షూట్ సహా టోర్నీ ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొనడానికి భారత కెప్టెన్ రోహిత్ శర్మ వెళ్తాడో? లేదో? ఇంకా నిర్ణయించలేదు' అని సైకియా తెలిపారు.
టీమ్ఇండియా ఆటగాళ్ల జెర్సీల మీద ఆతిథ్య దేశం (పాకిస్థాన్) పేరు ఉండడంపై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. పాకిస్థాన్ పేరును భారత జట్టు తమ జెర్సీలపై వేసుకోదని బీసీసీఐ తేల్చి చెప్పినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ స్పందించి ఈ ప్రచారానికి తెరదించింది. ఐసీసీ నియమాలను బీసీసీఐ పాటిస్తుందని స్పష్టం చేసింది. తమ ఆటగాళ్లు జెర్సీపై ఆతిథ్య దేశం పేరును వేసుకుంటారని తెలిపింది.
దాయాది దేశం పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం అవ్వనుంది. ఈ టోర్నీలో భారత్ తమ మ్యాచ్‌లను తటస్థ వేదిక దుబాయ్‌లో ఆడనుంది. ఒకవేళ భారత్ సెమీ ఫైనల్, ఫైనల్‌కు చేరుకుంటే ఈ మ్యాచ్‌లు కూడా దుబాయ్‌లోనే జరుగుతాయి.
లీగ్ మ్యాచ్‌లు
ఈ టోర్నీలో భారత్ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌ను ఢీ కొట్టనుంది. ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌పై ప్రేక్షకులకు తీవ్ర ఆసక్తి ఉంది. మార్చి 2న కివీస్‌తో గ్రూప్ దశలో చివరి మ్యాచ్ ఆడనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, గిల్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, పాండ్య, అక్షర్ పటేల్, పంత్, జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, షమీ, అర్ష్ దీప్ సింగ్
'BCCI అతడి ఫైల్ క్లోజ్ చేసింది- ఇక ఆ స్టార్ ప్లేయర్ ఖేల్ ఖతం!'- మేనేజ్మెంట్పై ఆరోపణలు
'క్రికెట్లోనూ రాజకీయాలు!'- BCCIపై PCB ఆరోపణలు- రోహిత్ కోసమే అదంతా!