IND Vs ENG First Test : ఇంగ్లాండ్, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో 90/2తో నాలుగు రోజు ఆటను ప్రారంభించిన టీమ్ఇండియా 364 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో (6 పరుగులు) కలుపుకొని మొత్తం 369 పరుగులను సాధించింది. ప్రత్యర్థికి టార్గెట్‌ను నిర్దేశించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన ఇంగ్లాండ్ ఆట ముగిసేసరికి 21/0 స్కోరుతో నిలిచింది. అయితే ఇంగ్లాండ్ విజయానికి ఇంకా 350 పరుగులు అవసరం. కానీ ఇంకో రోజు ఆట మిగిలి ఉండటంతో మ్యాచ్ ఫలితం తేలే అవకాశాలే ఎక్కువ. బౌలర్లు సమష్టిగా రాణించడంపైనే టీమ్ఇండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
కేఎల్ రాహుల్ (137; 247 బంతుల్లో 18 ఫోర్లు), రిషభ్ పంత్ (118; 140 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీలు బాదారు. దీంతో నాలుగో రోజు రెండో సెషన్ ముగిసేసరికి భారత్ 298/4తో నిలిచి భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ, తొలి ఇన్నింగ్స్ మాదిరిగానే చివర్లలో వరుసగా వికెట్లు కోల్పోయింది. పలువురు ప్రేయర్లు నిరాశపరచడంతో 31 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు చేజార్చుకుని తక్కువ స్కోరుకే ఆలౌటైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 3, జోష్ టంగ్ 3, బషీర్ 2 క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్ ఒక్కో వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 471, ఇంగ్లాండ్ 465 పరుగులకు ఆలౌట్ అయ్యాయి.
అయితే ఇంగ్లాండ్‌లో తొలి భారత బ్యాటర్‌గా!
తొలి టెస్ట్లోని తొలి ఇన్నింగ్స్‌లో 146 బంతుల్లో సెంచరీ చేసిన పంత్ , రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదరగొట్టాడు. 130 బంతుల్లోనే భారీ స్కోరు అందుకున్నాడు. అయితే ఇంగ్లాండ్‌లో ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా పంత్ ఇప్పుడు అరుదైన ఘనత సాధించాడు. ఒకే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకం బాదిన రెండో వికెట్‌కీపర్‌గా నిలిచాడు.