ICC Champions Trophy Winners List : ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఎడిషన్ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనుంది. పాకిస్థాన్, యూఏఈ ఆతిథ్యం ఇస్తున్నాయి. చివరిసారిగా 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. చాలా ఏళ్లకు జరుగుతున్న టోర్నీ గెలవడానికి 8 టీమ్‌లు పోటీ పడుతున్నాయి.
ఇప్పటి వరకు 8 ఛాంపియన్స్ ట్రోఫీలు ముగిశాయి. అందులో భారత్ రెండు గెలిచింది. ఈ సారి రోహిత్ శర్మ నేతృత్వంలో కప్పు గెలిస్తే భారత్ ఖాతాలో మూడో టైటిల్ చేరుతుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలు ఏ జట్టు గెలిచింది, ఎవరు కెప్టెన్‌లుగా వ్యవహరించారో ఇప్పుడు తెలుసుకుందాం.
1998 ఛాంపియన్స్ ట్రోఫీ
మొదటి ఛాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ నాకౌట్‌గా పిలిచారు. ఇది బంగ్లాదేశ్‌లో జరిగింది. హాన్సీ క్రోంజే నేతృత్వంలోని దక్షిణాఫ్రికా టైటిల్ గెలిచింది. ఫైనల్లో వెస్టిండీస్‌ను ఓడించింది.
2000 ఛాంపియన్స్ ట్రోఫీ
2000లో కెన్యాలో జరిగిన ఫైనల్‌లో భారత్‌ను ఓడించి న్యూజిలాండ్ తొలి ఐసీసీ టోర్నమెంట్‌ను గెలుచుకుంది. అప్పుడు కివీస్ టీమ్ కెప్టెన్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్ వ్యవహరించాడు.
2002 ఛాంపియన్స్ ట్రోఫీ
ఈ ఎడిషన్ శ్రీలంకలో జరిగింది. స్పష్టమైన విజేత తేలకుండా ముగిసింది. ఎందుకంటే భారత్, శ్రీలంక మధ్య జరిగిన ఫైనల్ వర్షం కారణంగా రెండు సార్లు వాష్ అవుట్ అయింది. దీంతో రెండు జట్లు ట్రోఫీని పంచుకున్నాయి. భారత్ కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ, శ్రీలంక కెప్టెన్‌గా సనత్ జయసూర్య ఉన్నారు.
2004 ఛాంపియన్స్ ట్రోఫీ
ఈ టోర్నమెంట్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇచ్చింది. బ్రియాన్ లారా కెప్టెన్సీలో వెస్టిండీస్ ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి టైటిల్ గెలుచుకుంది.
2006 ఛాంపియన్స్ ట్రోఫీ
2006లో రికీ పాంటింగ్ నాయకత్వంలో ఆస్ట్రేలియా ట్రోఫీ దక్కించుకుంది. ఫైనల్లో వెస్టిండీస్‌ను ఓడించింది. ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇచ్చింది.
2009 ఛాంపియన్స్ ట్రోఫీ
వరుసగా రెండోసారి ఆస్ట్రేలియా రికీ పాంటింగ్ కెప్టెన్సీలో టైటిల్ నెగ్గింది. దక్షిణాఫ్రికాలో జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించింది.
2013 ఛాంపియన్స్ ట్రోఫీ
2013లో ఎంఎస్ ధోని నాయకత్వంలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను భారత్ ఓడించింది.
2017 ఛాంపియన్స్ ట్రోఫీ
ఇంగ్లండ్, వేల్స్ వేదికగా జరిగిన 2017 ఎడిషన్ ఫైనల్‌లో పాకిస్థాన్ భారత్‌ను ఓడించి క్రికెట్ ప్రపంచానికి షాకిచ్చింది. సర్ఫరాజ్ అహ్మద్ నేతృత్వంలోని పాక్ ట్రోఫీ గెలిచింది.
ఛాంపియన్స్ ట్రోఫీకి అంతా సెట్! - టోర్నీలో ఆడనున్న 8 జట్ల ప్లేయర్లు వీరే
6000 పరుగులు, 600 వికెట్లు - క్రికెట్ హిస్టరీలో గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్లు వీళ్లే!