Chahal Dhanashree Divorce : భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారు. ముంబయిలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసినట్లు చాహల్ తరఫు న్యాయవాది నితిన్ కుమార్ గుప్తా వెల్లడించారు. విడాకుల పిటిషన్ విచారణ కోసం చాహల్, ధనశ్రీ గురువారం కోర్టుకు వచ్చారు.
అయితే విడాకులు కోరుతూ ఈ జంట ఫిబ్రవరి 05న ఫ్యామిలీ కోర్ట్‌ను ఆశ్రయించింది. తాము పరస్పర అంగీకారంతో విడిపోతున్నందు వల్ల 6 నెలల కూలింగ్ పీరియడ్‌ను మినహాయించాలని కోర్టును కోరింది. దీనిని ఫ్యామిలీ కోర్టు తిరస్కరించింది. దీంతో ఈ జంట బాంబే హై కోర్టును ఆశ్రయించగా, పరస్పర అంగీకారం ఉన్నప్పుడు విరామ గడువు అవసరం లేదని ఇటీవల రద్దు చేసింది. విడాకుల పిటిషన్‌పై గురువారం నాటికి నిర్ణయం తీసుకోవాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన కోర్టు చాహల్, ధనశ్రీకి విడాకులు మంజూరు చేసింది.
రూ.5కోట్లు భరణం?
అలాగే ధన శ్రీకి భరణం కింద రూ.4.75 కోట్లు ఇవ్వడానికి చాహల్ అంగీకరించినట్లు సమాచారం. ఈ మొత్తంలో చాహల్ ఇప్పటికే రూ. 2.37 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. కూలింగ్ పీరియడ్ పిటిషన్‌ను తోసిపుచ్చినందున భరణం కింద చెల్లించాల్సిన మిగతా మొత్తాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవడం లేదని పేర్కొంది.
చాహల్, ధనశ్రీ వివాహం 2020లో జరిగింది. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ఈ జంట గతంలో పెట్టిన పోస్టులు అభిమానులను గందరగోళానికి గురిచేశాయి. సామాజిక మాధ్యమాల్లో వీరిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, ధనశ్రీ తన పేరు నుంచి చాహల్ పదాన్ని తొలగించడం వల్ల వీరు విడిపోతున్నారని వార్తలొచ్చాయి. తాజాగా వారిద్దరికి విడాకులు మంజూరయ్యాయి.
Chahal IPL 2025 : కాగా, మార్చి 21నుంచి చాహల్ ఐపీఎల్ టోర్నమెంట్లో బిజీగా ఉండనున్నాడు. ఈ సీజన్లో చాహల్ పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీకి ఆడనున్నాడు. గతేడాది జరిగిన మెగావేలంలో పంజాబ్ రూ.18 కోట్ల భారీ ధరకు చాహల్‌ను కొనుగోలు చేసింది.