Cristiano Ronaldo One Billion Followers : పోర్చుగల్ సాకర్ దిగ్గజ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో తాజాగా ఓ నయా రికార్డును తన పేరిట రాసుకున్నాడు. తన సోషల్ మీడియా ఖాతాలన్నింటిలో కలిపి అతడికి ఉన్న ఫాలోవర్ల సంఖ్య ఇప్పుడు ఏకంగా 100 కోట్లను దాటింది. ఇక ఈ సంతోషకరమైన విషయాన్ని రొనాల్డో తన అభిమానులతో పంచుకున్నాడు. వారికి థ్యాంక్స్ చెప్తూ ఓ స్పెషల్ పోస్టర్ షేర్ చేశాడు.
"మేం చరిత్ర సృష్టించాం. 100కోట్ల ఫాలోవర్లు! ఇది కేవలం ఓ సంఖ్య మాత్రమే కాదు. అంతకుమించిన మీ ప్రేమాభిమానాలకు ఇది నిదర్శనం. మడైరా వీధుల నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద వేదికల వరకు. నేను ఎల్లప్పుడూ నా కుటుంబంతో పాటు మీ కోసమే ఆడాను. ఇప్పుడు ఈ వంద కోట్ల మంది నా కోసం నిలబడ్డారు. నా అప్స్ అండ్ డౌన్స్‌లో, ప్రతి అడుగులోనూ మీరున్నారు. ఇది మన జర్నీ. మనమంతా కలిస్తే ఏదైనా సాధించగలమని నిరూపించాం. నాపై నమ్మకం ఉంచి. నన్ను ఎల్లప్పుడూ అండగా ఉన్నందుకు, నా జీవితంలో భాగమైనందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేనింకా బెస్ట్ పెర్ఫామెన్స్ చేయాల్సి ఉంది. మరిన్ని విజయాలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాలి" అని రొనాల్డో ఫ్యాన్స్‌ను ఉద్దేశించి పోస్ట్ పెట్టాడు.
ఆరు రోజుల్లో 50 మిలియన్లు!
Cristiano Ronaldo Youtube Channel: ఇటీవలే యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన రొనాల్డో ఆరు రోజుల్లోనే 50మిలియన్ల సబ్‌స్క్రైబర్ల మార్క్ అందుకున్నాడు. ఈ క్రమంలో అతి తక్కువ సమయంలో 50మిలియన్ల సబ్‌స్క్రైబర్ల మైలురాయి అందుకున్న యూట్యూబర్‌గా రొనాల్డో రికార్డు కొట్టాడు. కాగా, రొనాల్డో యువర్ క్రిస్టియానో (UR Cristiano) పేరుతో ఆగస్టు 21న యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాడు.
దీనికి ఊహించని రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. ఛానెల్ ప్రారంభించిన 90 నిమిషాల్లో 1మిలియన్, 12గంటలలోపే 13మిలియన్ల సబ్‌స్క్రైబర్లు అయ్యారు. దీంతో ఛానెల్ ఓపెనింగ్ రోజే రొనాల్డోకు యూట్యూబ్ నుంచి 'గోల్డెన్ ప్లే బటన్' అందింది. ఎప్పుడూ గ్రౌండ్లో అదరగొట్టే రొనాల్డో యూట్యూబ్‌లోనూ రికార్డులు సృష్టిస్తుండటం వల్ల ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఛానెల్‌కు 50.3మిలియన్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇక రొనాల్డోకు ట్విట్టర్లో 112.6మిలియన్, ఫేస్‌బుక్‌లో 170 మిలియన్, ఇన్‌స్టాగ్రామ్‌లో 636 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.
చరిత్ర సృష్టించిన రొనాల్డో- 900వ గోల్‌తో వరల్డ్ రికార్డ్ - Cristiano Ronaldo 900th Goal