Zaheer Khan And Sagarika Ghatge Welcome Baby Boy : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ తండ్రయ్యారు. ఆయన సతీమణి, నటి సాగరిక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని బుధవారం ఇన్‌స్టా వేదికగా వెల్లడిస్తూ చిన్నారి ఫొటోను పంచుకున్నారీ దంపతులు. తమ కుమారుడికి ఫతేసిన్హ్ ఖాన్ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు.
ఇన్నిరోజులు ఆ విషయాన్ని దాచి!
అయితే జహీర్ ఖాన్, సాగరిక దంపతులు ఈ విషయాన్ని ఇన్ని రోజులు ఇప్పటివరకు సీక్రెట్‌గా ఉంచారు. బుధవారం చిన్నారి ఫొటో ఇన్‌స్టాలో షేర్ చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. దీంతో ఈ జంటకు పలువురు ప్రముఖులతో పాటు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.
2016లో జరిగిన టీమ్ఇండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ వివాహ వేడుకలో తొలిసారిగా జహీర్, సాగరిక కలిసి కన్పించారు. అప్పుడే తమ ప్రేమబంధాన్ని బయట ప్రపంచానికి చెప్పారు. 2017 నవంబరులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగా షారుక్ ఖాన్ నటించిన స్పోర్ట్స్ డ్రామా 'చక్ దే ఇండియా'తో సాగరిక బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. అనంతరం పలు హిందీ, మరాఠీ సినిమాల్లో సాగరిక నటించారు. మరోవైపు, జహీర్ ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్-ఎల్ఎస్జీ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు.