Puri Jagannath Rath Yatra 2025 : ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన అతి ప్రాచీన ధామాలలో పూరీ జగన్నాథుని ధామం ఒకటి. ఆషాఢమాసం మొదలవ్వగానే పూరీ జగన్నాథుని రథయాత్ర ప్రారంభం అవుతుంది. అయితే దానికి ముందుగా స్వామి వారి సన్నిధిలో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా జూన్ 24 జ్యేష్ఠ బహుళ చతుర్దశి రోజు స్వామివారి ఆలయంలో జే గంటలు మోగుతాయి. ఇవి మాములుగా మోగే గంటలు కావు దీని వెనుక ఉన్న అంతరార్ధం ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
పూరీ జగన్నాథుడికి అస్వస్థత
ప్రపంచ వాప్తంగా ప్రసిద్దిగాంచిన పూరీ జగన్నాథ రథయాత్ర ఆషాఢ మాసంలో జరుగుతుంది. అయితే రథయాత్రకు పదిహేను రోజుల ముందు అంటే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజు స్వామివారికి వివిధ తీర్థయాత్రల నుంచి 108 బంగారు పాత్రలతో తెచ్చిన పవిత్ర జలాలతో స్నానం చేయించే కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ స్నానఘట్టం వెంటనే స్వామికి జ్వరం వచ్చి అనారోగ్యానికి గురవుతారని విశ్వాసం. ఈ సందర్భంగా స్వామివారు పక్షం రోజుల పాటు భక్తులకు దర్శనమివ్వరు. ఈ పక్షం రోజుల పాటు జగన్నాథునికి రహస్యంగా ఆయుర్వేద చికిత్స చేస్తారు. ఈ సమయంలో రోజువారీ నైవేద్యానికి బదులుగా పాలు, పండ్లు, తేనె మాత్రమే పెడతారు.
మోగని మంగళ వాయిద్యాలు
స్వామివారు అస్వస్థతకు గురైన పదిహేను రోజుల పాటు శ్రీక్షేత్రంలో మంగళ వాయిద్యాలు మోగవు. తిరిగి జ్యేష్ఠ బహుళ చతుర్దశి నాడు ఆలయంలో జే గంటలు మోగుతాయి. ఇక ఆ రోజు నుంచి స్వామి కోలుకున్నట్లు రాజా గజపతి దివ్యసింగ్ దేవ్‌కి సమాచారం ఇస్తారు. ఆ తరువాత ఆలయంలో వేడుకలు మొదలవుతాయి. ఒక రకంగా జగన్నాథుని రథయాత్రకు నాంది కార్యక్రమంగా జరిగే ఈ జేగంటల వేడుక రథయాత్రలో ప్రధానమైనది.
జేగంటల కార్యక్రమం తర్వాత ఇక జగన్నాథుని రథయాత్ర వేడుకలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతాయి. అయితే జగన్నాథుని ఆలయంలో జరిగే ఈ జేగంటల కార్యక్రమంలో పాల్గొనడం సర్వ శుభప్రదమని విశ్వాసం.
ఈ నెల 24 వ తేదీ మంగళవారం జరుగనున్న ఈ వేడుకలో మనం కూడా పాల్గొందాం. జగన్నాథుని ఆశీస్సులతో సకల శుభాలు పొందుదాం.
ఓం శ్రీ జగన్నాధ స్వామినే నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.