గుమ్మానికి, వాహనాలకు నిమ్మ - మిరపకాయలు ఎందుకు కడతారు?
- దిష్టి మాత్రమే కాదు మరికొన్ని కారణాలున్నాయి! - అవేంటో మీకు తెలుసా?

Published : September 27, 2025 at 11:06 AM IST
Why People hang Lemon Mirchi : హిందువుల్లో మెజారిటీ జనం కొత్త వాహనం కొనుగోలు చేసినా, ఇంకా దుకాణం ఓపెన్ చేసినా తప్పకుండా పూజ చేయిస్తారు. ఆ తర్వాత ఒక తాడుకి నిమ్మకాయ, కొన్ని మిరపకాయలు కట్టి వాహనం ముందు భాగంలో, దుకాణం గుమ్మం దగ్గర వేలాడదీస్తారు. వీరిలో కొందరు ఆ తర్వాత ఇది పాటించకపోయినా, చాలా మంది దుకాణాదారులు తప్పకుండా ప్రతీ వారం వీటిని ఏర్పాటు చేసుకుంటారు. కానీ, ఇలా ఎందుకు చేస్తారో మాత్రం చాలా మందికి తెలియదు. ఇదొక ఆచారం, విశ్వాసంగా కొందరు భావిస్తారు. కానీ, నమ్మకమే కాదు.. ఇందులో శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి! ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
దిష్టి కోణం :
ఈ నిమ్మకాయ, మిరపకాయలు వేలాడదీయడానికి ఏకైక కారణం నర దిష్టి తగలకుండా చూడడమేనని దాదాపుగా అందరూ భావిస్తారు. ఉత్తర భారతంలో ఈ ఆచారాన్ని మరింత ఎక్కువగా పాటిస్తారు. ఇది దేశమంతటా వేల ఏళ్లుగా అనుసరిస్తున్న పద్ధతి. అందుకే ప్రతి రోజూ ఉదయాన్నే రోడ్డు పక్కన ఉండే షాపుల వెంట ఈ నిమ్మకాయ-మిర్చీ దండలు పట్టుకొని తిరుగుతుంటారు కొందరు. దుకాణాదారులు వీటిని కొనుగోలు చేసి, గుమ్మం ముందు వేలాడదీస్తారు. తద్వారా మంచి జరుగుతుందని భావిస్తారు.
జ్యోతిష్యం ప్రకారం :
మెజారిటీ హిందువులు జ్యోతిష్యాన్ని విశ్వసిస్తారు. ఇంకా తప్పకుండా పాటిస్తారు. జ్యోతిష్యం ప్రకారం శని గ్రహం వక్రమార్గంలో ఉన్నప్పుడు సమస్యలు, అడ్డంకులు ఏర్పడుతాయని నమ్ముతారు. అందుకే చాలామంది మంగళవారం లేదా శనివారం రోజున ఈ నిమ్మకాయ-మిరపకాయల దండలు కడతారు. తద్వారా నరదిష్టి నుంచి రక్షణ లభిస్తుందని భావిస్తారు. నెగెటివ్ ఎనర్జీని ఈ నిమ్మకాయ, మిరపకాయలు ఆకర్షించి, వాటిలో బంధిస్తాయని నమ్మకం. అలా చెడు శక్తి నిక్షిప్తమైన దండను వారం బయట పారేయడం ద్వారా ఆ దుష్ప్రభావాన్ని వదిలించుకున్నట్టు భావిస్తారు.
ఇంట్లో స్వస్తిక్ గుర్తు ఎక్కడ ఉండాలి? - దానివల్ల ఉపయోగమేంటి?
సైంటిఫిక్ రీజన్ కూడా :
కేవలం పురాతన విశ్వాసం, జ్యోతిష్య శాస్త్ర నమ్మకం మాత్రమే కాకుండా, ఈ దండకు సైంటిఫిక్ రీజన్ కూడా ఉందని చెబుతారు. నిమ్మకాయలో సిట్రిక్ ఆమ్లం ఉంటుందని తెలిసిందే. అదే విధంగా మిరపకాయలో క్యాప్సైసిన్ ఉంటుంది. ఇవి రెండూ సహజంగానే కీటకాలను వెళ్లగొట్టే స్వభావం కలిగి ఉంటాయి. ఇప్పుడంటే ఏవేవో స్ప్రేలు వాడుతుంటారు. ఇంకా పెర్ఫ్యూమ్స్ వినియోగిస్తుంటారు. కానీ, పాతకాలంలో ఇలాంటివి అందుబాటులో లేనప్పుడు.. మెజారిటీ జనం వీటినే వినియోగించేవారు. నిమ్మకాయ, మిరపకాయ నుంచి విడుదలయ్యే స్మెల్ వల్ల ఈగ వంటి చిన్న చిన్న కీటకాలు దూరంగా ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో వీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణం వల్ల కూడా నిమ్మ, మిర్చి దండలను ఉపయోగిస్తుంటారు.
వారసత్వంగా :
ఇలాంటి చాలా విషయాలు తర్వాతి తరాలకు వారసత్వంగా సంక్రమిస్తుంటాయి. అయితే చాలా మంది ఆయా పద్ధతులను పాటిస్తుంటారుగానీ, దాని వెనకున్న అసలైన కారణాలను తెలుసుకోవడానికి మాత్రం ఆసక్తి చూపించరు.

