Vishwakarma History In Telugu : హిందూ పురాణాల ప్రకారం ఋగ్వేదంలో, కృష్ణ యజుర్వేదంలో సృష్టి కర్తగా విశ్వకర్మను పరిగణిస్తారు. అధర్వణ వేదంలో ఆహార ప్రదాతగా పేర్కొంటారు. పురుష సూక్తంలో విరాట పురుషుడిగా కీర్తి గడించాడు. సహస్ర బాహుగా, సహస్ర చక్షుగా, సహస్ర పాదుడుగా, సహస్ర ముఖుడిగా అన్ని వేదాల్లోనూ ప్రస్తావించిన వ్యక్తి విశ్వకర్మ. విశ్వకర్మ జయంతిని ఎందుకు పండుగలా జరుపుకుంటారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రహ్మ కుమారుడే విశ్వకర్మ
త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవుని కుమారుడు విశ్వకర్మ. ఆయన వాహనాలు, ఆయుధాలతో పాటు దేవతల రాజ భవనాల సృష్టికర్త అని చాలా మంది నమ్ముతారు. శ్రీకృష్ణుడు పాలించిన పవిత్రమైన ద్వారకా నగరాన్ని కూడా విశ్వకర్మ సృష్టించాడని అంటారు.
విశ్వకర్మ జయంతి ఎప్పుడు?
Vishwakarma Puja 2024 : ప్రతి సంవత్సరం సూర్య భగవానుడు తన సొంత రాశి అయిన సింహ రాశిని వదిలి కన్యా రాశిలోకి ప్రవేశించే సమయంలో విశ్వకర్మ జయంతి పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 16 న సూర్యుడు కన్య రాశిలోకి ప్రవేశించే శుభ సమయంలో విశ్వకర్మ జయంతిని జరుపుకోవాలని పంచాంగ కర్తలు, పండితులు సూచిస్తున్నారు.
విశ్వకర్మ పూజకు శుభసమయం
సెప్టెంబర్ 16 సోమవారం సాయంత్రం 7 గంటల 42 నిమిషాలకు సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి విశ్వకర్మ పూజను సాయంత్రం 7:42 నుంచి 8:30 లోపు చేసుకోవచ్చు.
విశ్వకర్మ జయంతి వీరికి ముఖ్యం
వాస్తు శాస్త్రం, యాంత్రిక శాస్త్రం రంగంలో పనిచేసే వారికి ఈరోజు చాలా ముఖ్యమైనది. ఈరోజు ఈ రంగంలో ప్రజలు ఈ రోజు తాము చేసే పనులు విజయవంతం కావాలని, ఆ దేవుని ఆశీస్సులతో తమ కుటుంబం ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ విశ్వకర్మను పూజిస్తారు.
హస్త కళాకారుల దైవం
దైవ వడ్రంగి, దేవ శిల్పిగా భావించే విశ్వకర్మ పూజలో భాగంగా హస్తకళాకారులు తమ పనిముట్లను ఆరాధిస్తారు. ఈ పవిత్రమైన రోజు వాటిని ఏ పనికి ఉపయోగించరు. తాము క్షేమంగా ఉండాలని, తమకు నిత్యం జీవనోపాధిని కల్పించి సురక్షితంగా ఉంచాలని తాము చేపట్టిన ప్రతి ప్రయత్నంలో విజయం సాధించాలని వారు విశ్వకర్మ దేవుని ప్రార్థిస్తారు.
విశ్వకర్మ పూజ ఆచారాలు
విశ్వకర్మ జయంతి రోజున భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ పూజలు సాధారణంగా కర్మాగారాలు, కార్యాలయాలు మరియు దుకాణాలలో నిర్వహిస్తారు. పనిచేసే ప్రదేశాలు అందమైన పూలతో అలంకరిస్తారు. ఈ పవిత్రమైన రోజు విశ్వకర్మను, ఆయన వాహనం ఏనుగును పూజిస్తారు. విశ్వకర్మ విగ్రహాన్ని కూడా అందంగా అలంకరించి పూజలు నిర్వహిస్తారు. పూజల అనంతరం ప్రసాదం కూడా పంపిణీ చేస్తారు. ఈ పవిత్రమైన రోజు పూజ తర్వాత కార్యాలయాలను మూసివేస్తారు. అనంతరం అన్నదానం కూడా జరుపుతారు.
ఈ విధంగా విశ్వకర్మ జయంతిని జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ ఆచారాలను మనం స్వయంగా ఆచరించి ముందు తరాలకు పరిచయం చేయడం మన బాధ్యత. సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఓనం పండుగ ఎందుకు చేసుకుంటారు? విశిష్టత ఏంటి? సింపుల్ అండ్ క్లియర్గా మీకోసం! - Onam History