Vellala Hanuman Temple History In Telugu : శ్రీరామభక్త హనుమాన్కు దేశవ్యాప్తంగా అనేక ఆలయాలు ఉన్నప్పటికీ కొన్ని ఆలయాలు రామాయణ గాథతో ముడిపడి ఉండడం వలన ఆ ఆలయాలు ప్రత్యేకంగా నిలిచాయి. అలాంటి వాటిలో వెల్లాల హనుమాన్ ఆలయం ఒకటి. రామాయణగాధతో ముడిపడి ఉన్న ఈ ఆలయ విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
వెల్లాల హనుమాన్ ఆలయం ఎక్కడుంది?
హనుమంతుడు ఆవిర్భవించిన అతి ప్రాచీన క్షేత్రాలలో 'వెల్లాల' ఒకటి. కడప జిల్లా ప్రొద్దుటూరుకు సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఇక్కడ హనుమంతుడు సంజీవరాయుడుగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు.
ఆలయ స్థల పురాణం
శ్రీరామాయణ గాథతో ముడిపడి ఉన్న ఈ ఆలయ స్థల పురాణం గురించి వింటే ఆశ్చర్యం కలుగుతుంది. రామరావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సంజీవని కోసం హిమాలయాలకు బయలుదేరిన హనుమంతుడు మార్గమధ్యంలో సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడానికి ఇక్కడికి సమీపంలోని 'కుందూ' నది దగ్గర కొంతసేపు ఆగాడట. సూర్యునికి అర్ఘ్యం సమర్పించుకుని తిరిగి బయలు దేరే సమయంలో హనుమను ఆ ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న మహర్షులు చూసారంట!
మహర్షుల కోరిక మేరకు వెలసిన హనుమ
కుందూ నది తీరంలో హనుమను దర్శించుకున్న మహర్షులు స్వామిని అక్కడే కొంతసేపు ఉండమని అడిగారట! కానీ లక్ష్మణుని ప్రాణాలు కాపాడటం కోసం సంజీవని త్వరగా తేవాలన్న ఆతృతలో హనుమ 'వెళ్లాలి వెళ్లాలి' అంటూ తొందరపడ్డాడంట! కాలక్రమేణా హనుమ ఉచ్చరించిన 'వెళ్లాలి వెళ్లాలి' అనే మాటలే ఈ గ్రామానికి 'వెల్లాల' అనే పేరుతో స్థిరపడ్డాయని స్థానికుల కధనం. అటు తర్వాత హనుమ మహర్షుల అభ్యర్థన మేరకు ఇక్కడ వెలసినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది.
ఆలయ నిర్మాణం
సంజీవరాయ హనుమాన్కు 15వ శతాబ్దంలో 'హనుమంత మల్లు' అనే రాజు ఆలయాన్ని నిర్మించినట్టుగా స్థలపురాణం చెబుతోంది. పచ్చని ప్రకృతి శోభ మధ్య వెలసిన ఈ ఆలయ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది.
వ్యాధుల బాధలు దూరం
వెల్లాల సంజీవరాయ హనుమాన్ ఆలయంలోని హనుమంతుడిని దర్శించుకోవడం వలన, వ్యాధులు, బాధలు దూరమవుతాయనేది భక్తుల విశ్వాసం. హనుమత్ దీక్ష తీసుకున్న భక్తులు, ఈ క్షేత్రంలో దీక్ష విరమిస్తుంటారు.
పూజోత్సవాలు
వెల్లాల సంజీవరాయ హనుమాన్ ఆలయంలో నిత్యపూజలు యధావిధిగా జరుగుతాయి. ప్రతి మంగళవారం, శనివారం ప్రత్యేక పూజలు జరుగుతాయి. అలాగే శ్రీరామనవమి, హనుమత్ విజయోత్సవం, హనుమజ్జయంతి సందర్భంగా ఆలయంలో విశేష పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. మంగళవారం, శనివారం, హనుమజ్జయంతి పర్వదినాల్లో స్వామికి ఆకుపూజ, సింధురపూజ, వడమాల, అప్పాలమాల వంటివి విశేషంగా నిర్వహిస్తారు.
ఎలా చేరుకోవాలి?
కడప నుంచి ఈ ఆలయానికి చేరుకోడానికి బస్సులు కలవు. మనం కూడా వెల్లాల సంజీవరాయ హనుమాన్ ఆలయాన్ని దర్శిద్దాం ఆరోగ్య ఐశ్వర్యాలు పొందుదాం. జైశ్రీరామ్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.