Varalakshmi Pooja At Home : లక్ష్మీదేవి అష్టశ్వైర్య ప్రదాయిని. ఆదిలక్ష్మిగా, ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, గజ లక్ష్మిగా, సంతాన లక్ష్మిగా, వీర లక్ష్మిగా, విజయ లక్ష్మిగా, విద్యా లక్ష్మిగా నిత్యం భక్తులను అనుగ్రహిస్తుంటుంది. ఈ ఎనిమిది రూపాల ఏక స్వరూపమే వరలక్ష్మీదేవి. ఈ శ్రావణ మాసంలో శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేసి మనస్పూర్తిగా కోరికలు కోరుకుంటే.. నేరవేరతాయని భక్తులు విశ్వసిస్తారు. పరమపవిత్రమైన వరలక్ష్మీ వ్రతాన్ని ఎంతో మంది ఈ శుక్రవారం (ఆగస్టు 16న) జరుపుకోబోతున్నారు. అయితే.. ఈ సందర్భంగా వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు ఏ రంగులో ఉన్న చీర కట్టుకుంటే మంచిది? ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం పొందడానికి రోజూ ఏ విధంగా పూజ చేయాలి? అనే విషయాలను ప్రముఖ జ్యోతిష్య పండితులు "మాచిరాజు కిరణ్ కుమార్" వివరిస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం..
వరలక్ష్మీ వ్రతం రోజున మహిళలు భక్తితో ఏ రంగు చీరైనా కట్టుకోవచ్చు. అయితే.. శ్రీశుక్తంలో మొదటి శ్లోకం ప్రకారం.. లక్ష్మీదేవికి బంగారు రంగు చీర అంటే ఇష్టం. బంగారపు రంగు ఉండే చీరను ధరించి పూజ చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. అలాగే.. లక్ష్మీదేవికి ఆకుపచ్చ రంగు కూడా ఎంతో ప్రీతికరమైనది. లక్ష్మీకటాక్షం కోసం ఆకు పచ్చ రంగు చీరనైనా ధరించవచ్చు. లక్ష్మీదేవికి గులాబీ రంగు కూడా చాలా ఇష్టం. ఈ చీరను ధరించి వరలక్ష్మీ వ్రతం చేస్తే సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చని మాచిరాజు కిరణ్ కుమార్ పేర్కొన్నారు.
శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఇలా పూజించండి:
ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పద్మాపురాణంలో చెప్పిన విధంగా పూజిస్తే.. అమ్మవారి ఆశీర్వాదం లభిస్తుంది. పద్మాపురాణం ప్రకారం.. లక్ష్మీదేవి అగ్ని నుంచి జన్మించినట్లుగా చెబుతారు. అందుకే.. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం పొందడానికి ప్రతిరోజు లేదా మంగళ, శుక్రవారాల్లో ఆగ్నేయ మూలలో ఇంట్లో దీపం వెలిగిస్తుండాలి. దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. ఆగ్నేయ మూలలో పీట పెట్టి, అష్టదళ పద్మం ముగ్గు వేసి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శుభం కలుగుతుంది.
- ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఉన్నవారు రోజూ నీళ్లతో అభిషేకం చేయండి. వట్టి వేళ్ల నీళ్లలో కలిపి అభిషేకం చేస్తే ఇంకా మంచిది.
- మారేడు దళాలతో లక్ష్మీ దేవిని పూజించండి.
- వీలైతే పద్మపుష్పాలతో లక్ష్మీదేవిని ఈ శ్రావణ మాసంలో ఆరాధించండి.
- ఇలా చేస్తే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చని జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు.
Note : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఇవి కూడా చదవండి :
వరలక్ష్మీ వ్రతం రోజున ఈ బొమ్మ పూజగదిలో ఉంటే - మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది!
వరలక్ష్మీ వ్రతం నుంచి రాఖీ పౌర్ణమి దాకా - ఈ నెలలో ఎన్ని పండగలు ఉన్నాయో మీకు తెలుసా?