Vaisakha Puranam in Telugu: వైశాఖ పురాణం ఇరవై ఆరో అధ్యాయంలో శంఖుడు కిరాతునికి రామాయణ మహాకావ్యం రచించిన వాల్మీకి జన్మ గురించి, రామనామ తారకమంత్ర రహస్యం గురించి బోధించిన సంగతులను శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుకు వివరించాడు. ఈ మహత్తరమైన విషయాలను నారద మహర్షి అంబరీష మహారాజునకు మధ్య జరిగిన సంవాదం ద్వారా ఈ కథనంలో తెలుసుకుందాం.
శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుల సంవాదం
శ్రుతదేవముని శ్రుతకీర్తిమహారాజుకు శంఖుడు కిరాతుల సంభాషణను ఈ విధంగా వివరించసాగెను. తమ ఎదురుగా ఉన్న మర్రిచెట్టు కూలి, దాని తొర్ర నుంచి వచ్చిన భయంకర సర్పము దివ్యరూపమును ధరించి తలవంచి నమస్కరించి నిలుచుటను చూచి శంఖుడు, కిరాతుడు ఇద్దరు ఆశ్చర్యపోయారు. శంఖుడు ఆ దివ్యపురుషుని చూసి 'ఓయీ! నీవెవరవు? నీకు ఈ సర్ప రూపం ఎలా కలిగింది? ఇప్పుడు సర్ప రూపం నుంచి విముక్తి ఎలా వచ్చింది? నీ వృత్తాంతం వివరంగా చెప్పమని" కోరాడు.
దివ్యపురుషుని వృత్తాంతం
శంఖుని మాటలకు దివ్యపురుషుడు అతడికి సాష్టాంగ నమస్కారం చేసి "స్వామి! నేను పూర్వం ప్రయాగ క్షేత్రంలో నివసించే బ్రాహ్మణుడను. నాపేరు రోచనుడు. కుసీదుడను ముని పుత్రుడను. మంచి రూపయౌవనాలు కలిగి ఉన్నానన్న గర్వంతో చేయరాని పనులు ఎన్నో చేశాను. మితిమీరిన బద్ధకం, అత్యాశతో చేసే వడ్డీ వ్యాపారం, జూదం, పర మహిళ సాంగత్యం అనే వ్యసనాలు నా నిత్యకృత్యాలు. బ్రాహ్మణుల నిత్య ఆచారమైన సంధ్యావందనాలను విడిచి పెట్టాను. ఎవరైనా చూస్తారని మొహమాటంతో సంధ్యావందనం చేసినట్లు నటించేవాడిని. మోసము, ఆడంబరము తప్ప నాకు పూజాదులయందు శ్రద్దలేదు. ఇట్లు కొంతకాలము గడిచెను.
వైశాఖ ధర్మాలు బోధించిన జయంతుడు
ఇదిలా ఉండగా ఒక వైశాఖ మాసమున జయంతుడను బ్రాహ్మణోత్తముడు మా ఊరికి వచ్చి, ఊరివారందరికి వైశాఖవ్రతమును, వైశాఖ ధర్మములను గురించి వివరించసాగాడు. జయంతుని ప్రభోధాలతో ఊరిలోని మహిళలు, పురుషులు, బ్రాహ్మణాది చతుర్వర్ణముల వారు దాదాపు కొన్నివేల మంది వైశాఖ వ్రతము ఆచరించసాగారు. ప్రాతఃకాల స్నానము, శ్రీహరి పూజ, కథాశ్రవణము భక్తి శ్రధ్ధలతో చేశారు. జయంతుడు చెప్పుచున్న శ్రీహరి కథలను మౌనంగా శ్రద్దాసక్తులతో విన్నారు.
శ్రీహరి కథలను పరిహసించిన రోచనుడు
నేను కూడా ఆ సభలు చూడాలన్న కోరికతో తలపాగా ధరించి విలాసమైన వేషభాషలతో, తాంబూలం నములుచు సభలోకి ప్రవేశించాను. నా ప్రవర్తనతో సభలోని వారందరికీ ఇబ్బంది కలిగించాను. నేను ఒకరి వస్త్రమును లాగుచు, మరొకరిని నిందించుచు, వేరొకరిని పరిహసిస్తూ, అటు ఇటూ తిరుగుతూ హరికథా ప్రసంగమునకు, శ్రవణమునకు ఆటంకమును కలిగించాను.
రోచనుకి సర్పజన్మ ఇందుకే
ఈ దోషం వలన రోగగ్రస్థుడనై, ఆయువు క్షీణించి మరణించితిని. నరకంలో చిరకాలం కాలకూట విషంలో, వేడి నీటిలో, సీసంలో పడి కొట్టుకుంటూ అనేకవేల సంవత్సరాలు నరకంలోనే గడిపాను. చివరకు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో జన్మించి, చివరకు భయంకరమైన సర్పంగా జన్మించి విశాలమైన ఈ మర్రిచెట్టు తొర్రలో ఆహరం లేక బాధపడుతూ పదివేల సంవత్సరములు ఉన్నాను. దైవవశాత్తు ఈ రోజు నీవు చెప్పుచున్న వైశాఖ మహిమను విని పాపములను పోగొట్టుకొని శాపవిముక్తుడనై దివ్యరూపమును పొందాను. నాకు ఇంతటి భాగ్యాన్ని కలిగించిన నీకు కృతజ్ఞుడనై ఈ విధంగా నమస్కరించితిని. స్వామీ! మీరు నాకు ఏ జన్మలో బంధువులో తెలియదు. నేను మీకెప్పుడును ఏ విధంగానూ సాయపడలేదు. స్వామీ! నాకు సదా ధర్మబుద్ది కలుగునట్లును, విష్ణుకథలను మరువకుండునట్లు అనుగ్రహింపుము." అని ఆ దివ్యపురుషుడు శంఖమునిని బహువిధములుగా ప్రార్ధిస్తూ నమస్కరించాడు.
దివ్యపురుషుని మరుసటి జన్మ తెలిపిన శంఖుడు
శంఖముని తనకు నమస్కరించిన దివ్యపురుషుని పైకి లేవదీసి తన పవిత్ర హస్తాలతో వానిని స్పృశించి వానిని మరింత పవిత్రునిగావించెను. కొంతసేపు ధ్యానంలో ఉండి, ఆ దివ్యపురుషునికి కలగబోయే మరుసటి జన్మను గురించి ఇట్లు వివరించెను. "ఓయి! నీవు వైశాఖమాస మహిమను వినడం వలన నీ పాపాలన్నీ పోయాయి. నీవు కొంతకాలం స్వర్గంలో ఉంటావు. తరువాతి జన్మలో దశార్ణదేశమున వేదశర్మయను బ్రాహ్మణుడవుగా జన్మిస్తావు. వేదశాస్త్రాలను అభ్యసించి, ధర్మ కార్యాచరణ పట్ల ఆసక్తితో, ఇంద్రియములను జయించి సదా విష్ణు కథల పట్ల ఆసక్తి కలిగినవాడవై ఉంటావు. ఆ విధంగా చిరకాలం జీవించి చివరకు శ్రీహరి పాదములను చేరుతావు. శ్రీహరి సంతసించి నీకు శుభములనిచ్చును" అని శంఖుడు దివ్యపురుషుని చూసి పలికెను.
స్వర్గానికి చేరిన దివ్యపురుషుడు
దివ్యపురుషుడు శంఖమహామునికి నమస్కరించి "శంఖమహామునీ! దయాస్వభావముగల నీ అనుగ్రహం వలన నేను ధన్యుడనైతిని. నాకు గల దుర్జన్మలు నశించినవి. నీ అనుగ్రహముచే ఉత్తమ గతిని పొందాను" అని పలికి శంఖుని ఆజ్ఞతో దివ్య విమానమెక్కి స్వర్గమునకు పోయెను.
కిరాతునికి తారకమంత్రోపదేశం
ఆనాటి సాయంత్రం శంఖమహాముని కిరాతునికి అనేక శ్రీహరి కథలను వివరించాడు. మరుసటి రోజు బ్రహ్మముహూర్తమున లేచి స్నాన సంధ్యావందనాది కార్యక్రమాలు, శ్రీహరి పూజను చేశాను. పరిశుద్దుడగు కిరాతునకు తారకమంత్రం అగు 'రామ' అను రెండక్షరముల మంత్రమును ఉపదేశించి "నాయనా! సకల వేదములకంటే మిన్నయైనది తారక మంత్రం. కావున నిత్యం రామనామాన్ని జపించు. క్రమం తప్పకుండా వైశాఖ ధర్మాలు ఆచరించు. ఇందుకు ఫలితంగా నీవు వాల్మీకుడను మునికి పుత్రుడవుగా జన్మించి వాల్మీకిగా భూలోకమున ప్రసిద్ది పొందుతావు" అని ఆశీర్వదించి శంఖుడు దక్షిణ దిక్కుగా ప్రయాణం సాగించాడు.
వాల్మీకి పుత్రుడుగా జన్మించిన కిరాతుడు
శంఖుని కొంతదూరం అనుసరించిన కిరాతుడు మునిని విడువలేక దుఃఖించెను. కొద్దిరోజులకు సేదతీరి శంఖుడు చెప్పినట్లుగా ఆ అడవిలో బాటసారుల కోసం మనోహరమైన తోటలు, విశ్రాంతి మండపాలు నిర్మించాడు. అడవిలో దొరకు వెలగ, మామిడి, పనస మున్నగు పండ్లతో బాటసారులకు సేవ చేసేవాడు. పాదుకలు, చందనము, గొడుగులు, విసనకర్రలు బాటసారులకు దానం చేశాను. ఇలా తన జీవితకాలమంతా వైశాఖ ధర్మాలు పాటిస్తూ, శంఖముని చెప్పిన రామనామమును రాత్రింబగళ్లు జపించుచు కాలాంతరమునకు మరణించి వాల్మీక మహాముని పుత్రుడై జన్మించెను.
ఎవరీ వాల్మీకుడు?
కృష్ణుడనే ముని సుదీర్ఘకాలం తపస్సు చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకు అతడిపై మట్టి పుట్టలు ఏర్పడ్డాయి. పుట్టలు కట్టిన కూడా బాహ్యస్మృతి లేకుండా తపస్సు చేశాడు కాబట్టి అతడికి వాల్మీకి అని పేరు ఏర్పడింది. సంస్కృతంలో వాల్మీకం అంటే పుట్ట. కొంతకాలానికి ఆ ముని తపస్సు మానివేసి ఒక నాట్యకత్తెను వివాహం చేసుకున్నాడు. వారికి కలిగిన సంతానమే వాల్మీకి మహర్షి. అతడే పూర్వజన్మలో శంఖుని శిష్యుడైన కిరాతుడు. అతడు రచించిన రామాయణ మహాకావ్యము మానవులకు మోక్ష సాధనమైంది.
శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుల సంవాదం
శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుతో "ఓ రాజా! చూశావుగా వైశాఖమహిమ ఎంత గొప్పదో! దుష్టుడైన కిరాతుడు శంఖుని పాదాలను సేవించి, వైశాఖ ధర్మాలు ఆచరించి వాల్మీకి మహర్షిగా జన్మించి రామాయణం వంటి మహాకావ్యాన్ని రచించాడు. పాపములను పోగొట్టి పరమానందమును కలిగించు ఈ కథను విన్నవారు, చదివినవారు, చెప్పినవారు పునర్జన్మ లేని ముక్తిని పొందుతారు" అని శృతదేవ మహాముని చెప్పిన విషయాలను నారదుడు అంబరీషునికి చెబుతూ వైశాఖ పురాణం ఇరవై ఆరవ అధ్యాయాన్ని ముగించాడు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం
వైశాఖ మాసంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? పురాణం 25వ అధ్యాయం ఇలా!
శంఖుడు వివరించిన విష్ణు మహత్యం- వైశాఖ పురాణం ఇరవై నాలుగో అధ్యాయం ఇలా!