Vaisakha Puranam in Telugu : పురుయశుడు చేసిన వైశాఖ వ్రతానికి సంతుష్టుడైన శ్రీహరి అతనికి శంఖచక్రగదాధారియై దర్శనమిస్తాడు. అప్పుడు పురుయశుడు పరవశంతో శ్రీహరిని ఏ విధంగా స్తుతించాడో నారద మహర్షి వివరించిన శృతదేవ మహాముని, శ్రుతకీర్తి మహారాజుల సంవాదం ద్వారా తెలుసుకుందాం.
నారదుడు అంబరీష మహారాజుల సంవాదం
నారదుడు అంబరీష మహారాజుతో శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుకు వివరించిన వైశాఖ వ్రత మహత్యాన్ని వివరించసాగాడు.
శృతదేవ మహాముని వివరించిన శ్రీహరి స్తోత్ర మహత్యం
శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుతో " ఓ రాజా! పురుయశుడు తన ఎదుట ప్రత్యక్షమైన శ్రీహరిని చూసి పరవశంతో కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారుచుండగా శ్రీహరి పవిత్ర పాదాలను కడిగి ఆ నీటిని తన శిరసుపై చల్లుకున్నాడు. విలువైన వస్త్రములు ఆభరణములు, గంధ పుష్పాదులు, పుష్పమాలలు, ధూపములు, అమృతప్రాయములగు నివేదనలు, తన శరీరము, తన ధనము, తన మనసు, తన సర్వస్వమును ఆ శ్రీహరికి సమర్పించెను. అనంతరం శ్రీహరిని పరిపరి విధాలుగా స్తుతించెను.
ప్రీతి చెందిన శ్రీహరి
పురుయశుడు చేసిన స్తుతికి శ్రీహరి ప్రీతి చెందుతాడు. పరమ ప్రసన్నంగా పురుయశుని చూస్తూ "నాయనా! నీ భక్తికి ప్రీతి చెందాను. నీకు పదివేల సంవత్సరాల ఆయుర్ధాయాన్ని ప్రసాదిస్తున్నాను. నీవు దీర్ఘాయుడవై, సకల సంపదలతో సుఖజీవనం చేసి అంత్యమున ముక్తిని పొందుతావు. ఇప్పుడు నీవు చేసిన స్తుతితో నన్ను స్తోత్రము చేసినవారికి సంతుష్టుడనై వారికి భుక్తిని, ముక్తిని ప్రసాదిస్తాను.
పురుయశునికి అనేక వరాలిచ్చిన శ్రీహరి
శ్రీహరి పురుయశునితో "ఓ భక్తాగ్రేసరా! నేను నీకు ప్రత్యక్షమైన ఈ అక్షయ తృతీయ గొప్ప శుభదినంగా మారుతుంది. ఈ రోజు ఎవరైతే నన్ను పూజిస్తారో వారికి వెలకట్టలేని సంపదలు చేకూరుతాయి. ఈ అక్షయ తృతీయ రోజు పితృదేవతలకు శ్రాద్దమును నిర్వహించినచో వారికి వంశవృద్ది, అనంతపుణ్యము కలుగుతుంది.
అక్షయ ఫలం
అక్షయ తృతీయ రోజు చేసే సత్కార్యాలు, దానాలు, పూజలు అక్షయ ఫలాన్ని ఇస్తాయి. ఈ రోజు గృహస్తుడైన బ్రాహ్మణునికి దూడతో సహా గోదానం చేసిన వారికి సకల భోగాలు కలిగి అంత్యమున ముక్తిని పొందుతారు. సమస్త పాపములను పొగొట్టు వృషభ దానమును చేసినవారికి అకాలమృత్యువేకాదు, కాలమృత్యువును కూడ పోగొట్టి దీర్గాయుర్దాయాన్ని ప్రసాదిస్తాను. వైశాఖ వ్రతమును, దానాదులను ఆచరించినవారు తపస్సులకు, మహర్షులకు సాధ్యంకాని విష్ణులోక ప్రాప్తిని పొందుతారు.
శ్రీహరి అంతర్ధానం
"ఓ పాంచాల రాజా! నీవు అరణ్యాలలో ఉన్నప్పటికినీ నీ గురువులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించి నా సాక్షాత్కారాన్ని పొందావు. నీ పట్ల ప్రీతి చెంది నేను నీకు అనేక వరాలను ఇచ్చాను" అని చెబుతూ ఆ శ్రీహరి అందరూ చూస్తుండగానే అంతర్ధానమయ్యాడు.
పురుయశునికి కైవల్యప్రాప్తి
పాంచాల రాజు పురుయశుడు కూడా శ్రీహరి అనుగ్రహానికి, శ్రీహరి ఇచ్చిన వరాలకు సంతోషించి అచిరకాలం తన బంధువులు మిత్రులు భార్య బిడ్డలతో కలిసి వైశాఖ వ్రతాన్ని ఆచరిస్తూ, తన ప్రజల చేత ఆచరింపజేస్తూ చిరకాలము సర్వసుఖభోగములను అనుభవించి తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.
శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుతో "ఓ రాజా! పురుయశుడు శ్రీహరి అనుగ్రహాన్ని పొందిన ఈ ఉత్తమమైన కథను చదివినా, విన్నా, ఎవరికైనా వినిపించినా సర్వపాపవిముక్తులై శ్రీహరి సాన్నిధ్యమును చేరుదురు" అని చెప్పాడు.
నారదుడు అంబరీష మహారాజుతో ఈ కథను ఇక్కడవరకు చెప్పి వైశాఖ పురాణం ఇరవై ఒకటో అధ్యాయాన్ని ముగించాడు.
వైశాఖ పురాణం ఇరవై ఒకటో అధ్యాయం సమాప్తం.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
వైశాఖ పురాణం 20వ అధ్యాయం- జలదానంతో రాజు జన్మ పొందిన పురుయశుడు
పిశాచిగా మారిన కర్మనిష్ఠుడు- వైశాఖ వ్రత ఫలంతో విష్ణులోకం ప్రాప్తి!