Vaisakha Puranam 27th Chapter In Telugu : పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న వైశాఖ పురాణంలో భాగంగా శ్రుతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుకు వైశాఖ మాసంలో వచ్చే పుణ్యతిథులను గురించి, కలిధర్మములు, పితృవిముక్తి గురించి వివరించిన విధానాన్ని నారద అంబరీషుల సంవాదం ద్వారా ఈ కథనంలో తెలుసుకుందాం.
శ్రుతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుల సంవాదం
శ్రుతకీర్తి మహారాజు శ్రుతదేవ మహామునితో "ఓ మహాముని! వైశాఖ మాసంలో ఉత్తమమైన తిధుల గురించి, చేయాల్సిన దానాల గురించి వివరంగా తెలియజేయమని ప్రార్ధించగా శ్రుతదేవుడు ఈ విధంగా చెప్పసాగెను.
శ్రుతదేవుడు బోధించిన వైశాఖ ధర్మాలు
శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజుతో "ఓ రాజా! వైశాఖ మాసంలో ముప్ఫయి రోజులు పుణ్యతిథులే! కానీ ఏకాదశి రోజు చేసే పుణ్యకార్యాలు కోటిరెట్ల అధికఫలాన్ని ఇస్తాయి. వైశాఖ ఏకాదశి నాడు చేసే నదీస్నానం, దానము, తపము, హోమము, దేవతార్చన, సత్కర్మలు, హరికథా శ్రవణము వలన సర్వపుణ్య కార్యములు చేసిన ఫలం లభించును.
ఏకాదశి మహత్యం
వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశి రోజు పితృదేవత ప్రీత్యర్ధం తర్పణాలు, పిండప్రదానాలు, శ్రాద్ధ కర్మలు చేసినవారు గయలో కోటిమార్లు పిండప్రదానము చేసిన పుణ్యఫలము కల్గును. ఇందుకు సంబంధించి సావర్ణిమనువు భూమిని పరిపాలించు సమయంలో నరకలోకమున పితృదేవతలకు చెందిన పెద్దలు చెప్పిన కథ ఒకటి చెబుతాను జాగ్రత్తగా వినుము" అనుట ఇట్లు చెప్పసాగెను.
ధర్మవర్ణుని కథ
ముప్ఫయి కలియుగాలు గడిచిన తర్వాత ముప్పదియొకటవ కలియుగమున ప్రధమపాదమున ప్రజలందరును వర్ణధర్మములను విడిచి పాపకార్యముల పట్ల ఆసక్తితో ఉండిరి. ఆ సమయంలో నర్తదేశమున ధర్మవర్ణుడను బ్రాహ్మణుడు ఉండెను. ఈ బ్రాహ్మణుడు సదాచార పరాయణుడు. పాపభూయిష్టమైన ఆ ప్రాంతంలో ఉండలేక మౌనవ్రతం పాటిస్తూ పుష్కర క్షేత్రములో మునులు ఆచరిస్తున్న సత్రయాగము చూడటానికి వెళ్లెను. ఆ సమయంలో మునులు అక్కడ ధర్మ ప్రసంగాలు చేస్తుండిరి.
యుగధర్మాలు బోధిస్తున్న మునులు
మునులు తమ ప్రసంగంలో ఈ విధంగా చెప్పసాగిరి. కృతయుగమున సంవత్సర కాలం నియమనిష్ఠలతో చేసిన వచ్చే పుణ్యము త్రేతాయుగమున ఒక మాసము చేసిన వచ్చును. ద్వాపర యుగమున ఒక పక్షము చేసిననంతటి పుణ్యము వచ్చును. కాని దానికి పదిరెట్ల పుణ్యము కలియుగమున శ్రీమహావిష్ణువును స్మరించిన వచ్చును. కావున కలియుగమున చేసిన పుణ్యము కోటిగుణితము. దయాపుణ్యములు, దానధర్మములులేని యీ కలియుగమున శ్రీహరిని ఒక్కమారు స్మరించి, దానం చేసినచో కరువు కాలమున అన్నదానమును చేసిన వానివలె పుణ్యలోకములకు పోవుదురు" అని కలి ప్రభావమును గురించి చెప్పసాగిరి.
నారదుని వింత ప్రవర్తన
ఆ సమయమున నారదుడు కలి పురుషుని ప్రభావంతో చిత్రమైన ప్రవర్తనతో అక్కడకు వచ్చెను. నారదుడు ఒక చేతితో తన నాలుకను, మరొక చేతితో తన అంగాన్ని పట్టుకుని చిత్రంగా ప్రవర్తించసాగెను. అప్పుడు అక్కడున్న మునులు "నువ్వు ఇలా వింతగా ప్రవర్తించడానికి కారణమేమిటని అడుగగా నారదుడు మునులతో "మీ మాటలను బట్టి స్వల్పమైన ధర్మాలతో అఖండమైన పుణ్యం సంపాదించగల కలియుగం వచ్చినదని అందుకు సూచనగా నేను ఇలా ప్రవర్తిస్తున్నాను.
నారదుడు చెప్పిన కలియుగ ధర్మాలు
కలియుగంలో మానవుడు నాలుకను అదుపులో పెట్టుకోవడం కష్టం అంటే తిండి మీద ఆసక్తి, ఇంకా మాటను అదుపులో పెట్టుకోలేని బలహీనతకు లొంగి ఉంటాడు. ఇంకా కలియుగంలో మానవుడు కామోపభోగాల పట్ల ఎక్కువగా ఆసక్తి కలిగిఉంటారు. అందుకు సుచంగానే నేను నాలుకను, అంగాన్ని పట్టుకుని ఇలా వింతగా ప్రవర్తిస్తున్నాను. ఈ కలియుగంలో మానవులు ఈ రెండింటిని అదుపులో ఉంచుకుంటే పరమాత్మయగు శ్రీహరి దయ సాధ్యం" అని నారదుడు మునులకు చెబుతాడు.
నారదుని మాటలు విని మునులందరూ కలియుగధర్మాలు పాటించడానికి విధ ప్రదేశాలకు వెళ్లిపోయారు. ధర్మవర్ణుడును భూమిని విడిచి మరొక చోటికి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి అతనికి కలియుగంలో భూలోకం ఎలా ఉందో చూడాలనిపించి దండకమండలాలు ధరించి భూలోకానికి వచ్చాడు.
పాపభూయిష్టమైన భూలోకం
ధర్మవర్ణుడు భూలోకానికి వచ్చేసరికి భూలోకంలో కలిప్రభావం తీవ్రంగా ఉంది. ప్రజలంతా ధర్మాచరణ విడిచిపెట్టారు. బ్రాహ్మణులు వేదధర్మములను విడిచి పెట్టగా శూద్రులు సన్యాసులైరి. భార్య భర్తను, శిష్యుడు గురువును, సేవకుడు యజమానిని, పుత్రుడు తండ్రిని ద్వేషించుచుండిరి. భూతప్రేత పిశాచాలనే పూజించుచుండిరి. అందరును సంభోగాభిలాష కలిగి, అందుకోసంప్రాణాలు విడిచి పెట్టడానికి కూడా సిద్ధపడే వారయ్యారు. జనులు తప్పుడు సాక్ష్యములను చెప్పువారు, మోసగించు స్వభావము కలవారై ఉండిరి. ఉత్తములకు, మంచివారికి గౌరవం దొరకడం లేదు. డబ్బే ప్రధానంగా అందరూ జీవిస్తున్నారు. ఇతరులను నిందించడం, తమను తాము పొగడుకోవడం అధికమయ్యెను. అందరును వేశ్యాసక్తులై సజ్జనులను అవమానిస్తూ, పాపాత్ములను గౌరవిస్తుండసాగిరి.
ధర్మవర్ణుని భయపెట్టిన కలి విపరీతాలు
కలి ప్రభావముతో భూలోకంలో కన్యలు గర్భవతులు అవుచుండగా, వివాహితులు సంతానం లేక దుఃఖిస్తున్నారు. పితృ దేవతలకు శ్రాద్ధ తర్పణాలు జరగడం లేదు. ధర్మవర్ణుడు భూలోకముననున్న కలియుగ విధానమును చూచి మిక్కిలి భయపడెను. పాపము చేయుట వలన జరుగుతున్న వంశనాశము గమనించి ఇంకో ద్వీపానికి వెళ్లెను. చివరకు అన్ని ద్వీపములను చూచి పితృలోకమునకు వెళ్లెను.
పితృలోకంలో దయనీయమైన పరిస్థితులు
పితృలోకానికి చేరుకున్న ధర్మవర్ణుడు అక్కడ పితృదేవతలను దయనీయమైన స్థితిలో చూస్తాడు. వారు అనేక కష్టాలు పడడం చూసి ధర్మవర్ణుడు వారిలో కొందరిని "అయ్యా! మీరెవరు? ఏ వంశం వారు? మీకు ఇంతటి దుర్గతి ఎలా పట్టింది? అని ప్రశ్నిస్తాడు. అప్పుడు వారు "అయ్యా! మేము శ్రీవత్స గోత్రీయులం భూలోకంలో మా వంశంలో సంతానం లేదు. అందుకే మాకు పిండప్రదానాలు చేసే వారు ఎవరూ లేరు. మేము చేసిన పాపాల కారణంగా మా వంశంలో సంతానం లేకుండా పోయింది. వంశము క్షీణించింది. అందుకే ఈ పాపకూపంలో పడి కొట్టుకుంటున్నాము. మా వంశంలో ధర్మవర్ణుడను కీర్తిశాలి ఒక్కడే మిగిలి ఉన్నాడు. అతడు విరక్తితో వివాహం చేసుకోనందున మా వంశం అంతరించే ప్రమాదముంది. అదే కనుక జరిగితే ఇప్పుడు ఈ గడ్డిపోచ ఆధారంతో అగాధంలో పడకుండా ఆగిఉన్న మేము త్వరలో ఈ అగాధంలో పడి కొట్టుకుపోతాం. కాబట్టి నాయనా! నీవు భూలోకానికి వెళ్లి ధర్మవర్ణుని కలిసి గృహస్థ జీవితము అవలంబించి, సంతతిని పొంది వంశవృద్దిని చేసి మమ్ము నూతిలోపడకుండ రక్షింపుమని చెప్పుము. పున్నామ నరకం నుంచి తప్పించే పుత్రులను ఎక్కువగా కనమని చెప్పు. వారిలో ఒకరైన గయా మొదలైన పుణ్యక్షేత్రాల్లో శ్రాద్ధకర్మలు నిర్వహిస్తే మాకు ఈ నరకబాధలు తప్పుతాయని చెప్పు" అని పితృదేవతలు వచ్చినది తమ వంశస్తుడు ధర్మవర్ణుడే అని తెలియక అతనితో ఇవన్నీ చెబుతారు.
పశ్చాత్తాపం పొందిన ధర్మవర్ణుడు
పితృదేవతల మాటలు విని ధర్మవర్ణుడు దుఃఖంతో "మీరు చెబుతున్న ఆ ధర్మవర్ణుడను నేనే! మీకు ఇంత దుఃఖం కలగడానికి కారణం నేనే! గతంలో నారదుడు కలియుగంలో పురుషుడు అంగాన్ని నిగ్రహించుకోలేడని చెప్పిన మాటలు విని, కామోపభోగాలను నిగ్రహించడానికి వివాహం చేసుకోలేదు. పాపాత్ములు నివసించే చోట ఉండకూడదని ద్వీపాలు పట్టి తిరుగుతూ ఇక్కడకు వచ్చాను. నా కారణంగా మీరు ఇన్ని బాధలు పడుతుంటే కష్టంగా ఉంది. వెంటనే నేను భూలోకానికి వెళ్లి వివాహం చేసుకుని, సంతానాన్ని పొంది, వంశాన్ని వృద్ధి చేసి మీకు సద్గతులు కల్పిస్తాను" అని ధర్మవర్ణుడు చెప్పిన మాటలతో పితృదేవతలకు ఉపశమనం కలుగుతుంది.
కలి ప్రభావం నుంచి తప్పించుకునే ఉపాయం చెప్పిన పితృదేవతలు
పితృదేవతలు ధర్మవర్ణునితో "నాయనా! శ్రీహరి స్వరూపమగు సాలగ్రామశిలగాని, భారతము గాని ఇంటిలో ఉంచుకున్నవారిని కలి బాధింపడు. వైశాఖవ్రతము, మాఘస్నాన వ్రతము, కార్తీకదీపదానము పాటించువారిని కలి పీడించడు. త్వరగా భూలోకమునకు పొమ్ము. ప్రస్తుతము వైశాఖమాసము గడచుచున్నది. ఈ నెలలోని ముప్పది తిధులును పుణ్యప్రదములే! ఈ మాసంలో పితృదేవతలకు శ్రాద్ధ తర్పణాలు, పిండప్రదానాలు చేయుము. చల్లని నీటితో నిండిన జలపాత్రను దానం చేయుము. వివాహం చేసుకుని పురుషార్ధములను పొంది, సంతానాన్ని పొంది, అందరినీ సంతోష పెట్టి అటు తర్వాత మునివై ద్వీప సంచారం చేయుము" అని పితృదేవతలు ధర్మవర్ణునికి చెప్పారు.
పితృదేవతలకు సద్గతులు కల్పించిన ధరవర్ణుడు
పితృదేవతల ఆజ్ఞ మేరకు ధరవర్ణుడు భూలోకానికి వచ్చి వారు చెప్పినట్లుగా శ్రాద్ధ, తర్పణ, పిండప్రదానం కార్యక్రమాలు నిర్వహించెను. వివాహం చేసుకుని ఉత్తమ సంతానాన్ని పొందెను. దానితో పితృదేవతలకు నరకబాధలు తప్పినవి. వైశాఖ ధర్మాలు లోకప్రసిద్ధి చేసిన ధరవర్ణుడు తుదకు తపస్సు చేసుకోడానికి గంధమాదన పర్వతం చేరుకున్నాడు. శ్రుతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుకు వివరించిన ఈ కథను నారదుడు అంబరీషునికి చెబుతూ వైశాఖ పురాణం ఇరవై ఏడో అధ్యాయాన్ని ముగించాడు. వైశాఖ పురాణం ఇరవై ఏడో అధ్యాయం సమాప్తం.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.