Vaisakh Puranam 20th Chapter : పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న వైశాఖ పురాణంలో శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుతో వివరించిన వైశాఖ వ్రతమహాత్యాన్ని నారదమహర్షి అంబరీష మహారాజుతో ఏ విధంగా వివరించాడో ఈ కథనంలో తెలుసుకుందాం.
శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుల సంవాదం
శ్రుతదేవుడు "ఓ శ్రుతకీర్తిమహారాజా! వినుము. శ్రీహరికి మిక్కిలి యిష్టమైన వైశాఖమాస వ్రతమును, దాని మహిమను వెల్లడించు మరియొక కథను చెబుతాను జాగ్రత్తగా వినుము" అంటూ ఈ విధంగా చెప్పసాగెను.
పురుయశ రాజు కథ
పూర్వం పాంచాల దేశమున పురుయశుడనే రాజు కలదు. అతను పుణ్యశీలుడనే రాజు కుమారుడు. తన తండ్రి మరణానంతరం పురుయశుడు రాజయ్యాడు. పురుయశుడు ఎంతో ధర్మబద్ధంగా తన రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డలవలె కాపాడుతూ, ప్రజారంజకంగా పరిపాలిస్తుండేవాడు. తన బలపరాక్రమాలతో రాజ్యాన్ని సువిశాలంగా విస్తరించాడు. భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలతో తులతూగుతుండే పురుయశుడు కొంతకాలానికి పూర్వజన్మ కర్మవశాత్తు తన సకల సంపదలను, అపారమైన సైన్యాన్ని కోల్పోయాడు. దురదృష్ట వశాత్తు రాజ్యంలో కొన్ని సంవత్సరాలపాటు వర్షాలు కురవక కరువు కాటకాలు ఏర్పడ్డాయి.
శత్రువుల దండయాత్ర
ఎప్పుడైతే పురుయశుడు బలహీనమయ్యాడని తెలిసిందో శత్రువులు కూడబలుక్కుని పురుయశుని రాజ్యంపైకి దండెత్తి వచ్చారు. శత్రువులతో జరిగిన భీకర యుద్ధంలో పురుయశుడు రాజ్యాన్ని కోల్పోయి తన భార్య శిఖినితో కలిసి ఒక పర్వతగుహలో తలదాచుకున్నాడు.
పురుయశుని దుస్థితి
ఈ విధంగా యాభై మూడు సంవత్సరాలు గడిచాయి. పురుయశుడు తనలో తాను "నేను ఉత్తమమైన వంశంలో జన్మించాను. పెద్దలను గురువులను గౌరవించాను. ఎన్నో ధర్మ కార్యాలు, పుణ్య కార్యాలు చేశాను. కానీ నాకు ఈ దుస్థితి కలగడానికి కారణం ఏమిటో అర్ధం కావడం లేదు. ఈ విధంగా అరణ్యాలలో, పర్వత గుహలో ఇంకా ఎంత కాలం ఉండాలో కదా" అని విచారిస్తూ తన కుల గురువులైన యాజుడు, ఉపయాజకుడను గురువులను తలచుకొనెను.
ప్రత్యక్షమైన గురువులు
పురుయశుడు ఇలా తలచుకోగానే సర్వజ్ఞులైన ఆ గురువులు వెంటనే రాజు ముందు ప్రత్యక్షమవుతారు. వారిని చూసి రాజు వారిద్దరికి నమస్కరించి యధాశక్తిగా ఉపచారములు చేసి, వారిని సుఖాసీనులను గావించి దీనుడై వారి పాదములపై పడి నాకు ఇంతటి దురవస్థ కలగడానికి కారణం ఏమిటి? నేను ఈ దీనస్థితి నుండి బయటపడే తరుణోపాయం చెప్పండి" అని గురువులను దీనంగా ప్రార్ధిస్తాడు.
పురుయశుని పూర్వజన్మ
పురుయశుని ప్రార్థనలకు అతని గురువులు ఎంతో దయతో రాజు మనోవిచారం గ్రహించిరి. వారు క్షణకాలము ధ్యానమగ్నులై రాజుతో ఈ విధంగా పలికారు. "రాజా! నీ దుఃఖమునకు కారణమును వినుము. నీవు గతజన్మలో ఒక కిరాతుడువి! గత పదిజన్మలలో అత్యంత క్రౌర్యము కలిగిన కిరాతుడవు. ధర్మప్రవృత్తి కొంచెం కూడా లేకుండా దుష్టబుద్దితో ఉంటుండేవాడివి. ఒక్కనాడు కూడా శ్రీహరిని స్మరించడం కానీ, శ్రీహరి కథలను వినడం కానీ చేయలేదు. బాటసారులను దారికాచి దోచుకుంటూ క్రూరుడిలా నీచమైన జీవితాన్ని గడుపుతుండేవాడివి.
పసిపిల్లలను, మృగాలను, పక్షులను, బాటసారులను వధించుట చేత నీకు ఈ జన్మలో సంతానం కలగలేదు. ఇతరులను నిర్దయగా పీడించుటచే ఇప్పుడు నీ రాజ్యము శత్రువుల అధీనమైనది. ఇన్ని పాపములను చేసినా నీవు ఉత్తమమైన రాజ వంశమున పుట్టుటకు కారణమును వినుము.
వైశ్యుని చంపిన కిరాతుడు
నీవు గత జన్మలో గౌడ దేశంలో కిరాతుడవై ఉన్నప్పుడు ఒకానొక సమయంలో ధనవంతులగు యిద్దరు వైశ్యులు, కర్షణుడనుముని నీవు నివసించే అడవిలో ప్రయాణించుచుండిరి. నీవు వారిని అడ్డగించి బాణమును ప్రయోగించి ఒక వైశ్యుని చంపితివి. రెండవ వైశ్యుని కూడా చంపబోగా అతడు భయపడి తన వద్ద ఉన్న ధనమును ఒక పొదరింట దాచి ప్రాణరక్షణకై పారిపోయెను. కర్షణుడను ముని కూడా నీకు భయపడి ఆ అడవిలో పరుగెత్తుతూ ఎండకు, దప్పికకు అలసి మూర్ఛిల్లెను.
మునికి ఉపచారాలు చేసిన కిరాతుడు
నీవు వేసవి తాపానికి మూర్ఛిల్లిన కర్ష్ణణుని సమీపించి వాని ముఖాన చల్లని నీటిని చల్లి ఆకులతో విసరి ఆ మునికి సేవచేసి సేదతీర్చితివి. ముని కొంత తేరుకున్న తరువాత నీవు "ఓ మునీశ్వరా! భయపడకుము! నా వల్ల నీకు భయం లేదు. నీ దగ్గర ధనం లేదు కాబట్టి నేను నిన్ను ఏమి చేయను. కానీ పారిపోయిన వైశ్యుడు ధనాన్ని ఎక్కడ దాచిపెట్టాడో తెలిపితే నిన్ను వదిలేస్తాను" అని చెప్పగా ప్రాణభయంతో ఆ ముని వైశ్యుడు ధనాన్ని దాచిపెట్టిన పొదరింటిని చూపాడు.
వైశాఖ ధర్మాలు పాటించుటవల్లే రాజు జన్మ
అప్పుడు నీవు ఆ మునికి అడవి నుంచి బయటపడే మార్గాన్ని చూపించి, దగ్గరలో ఉన్న నిర్మలమైన జలతటాకాన్ని చూపించి, అతనితో "ఓ ముని! ఈ జలాన్ని తాగి సేదతీరు. ఈ ఆకులతో విసురుకొమ్ము" అంటూ మోదుగ ఆకులను మునికి ఇచ్చి అతనిని క్షేమంగా అడవి దాటించావు. దుర్మార్గుడవై కూడా మునీశ్వరునికి వైశాఖ మాసంలో జలదానం చేసి అతనికి వేసవి తాపం పోయేలా విసనకర్రలతో విసిరి సేదతీర్చావు కాబట్టి నీకు ఈ జన్మలో రాజవంశంలో జన్మించే భాగ్యం కలిగింది. కానీ గత జన్మలో చేసిన పాపాల కారణంగా సంతానం కలుగలేదు. ఐశ్వర్య హీనుడవై, రాజ్యభ్రష్టుడవై ఇలా అడవులు పట్టి తిరగాల్సిన ఖర్మ పట్టింది" అని పురుయశుని గురువులు అతని దుస్థితికి కారణాలు తెలియజేసారు.
రాజుకు తరుణోపాయం చెప్పిన గురువులు
పురుయశుని గురువులు రాజు దుస్థితిని పోగొట్టుకోడానికి ఈ విధంగా తరుణోపాయం చెప్పారు. "ఓ రాజా! నీవు పోగొట్టుకున్న నీ రాజ్యాన్ని, సంపదలు తిరిగి పొందడానికి వైశాఖ వ్రతం ఆచరించు. ఇప్పుడు వైశాఖ మాసం నడుస్తోంది. నీవు నదీస్నానం చేసి శ్రీహరిని యధాశక్తి పూజించి, వైశాఖ పురాణ శ్రవణం చేస్తే నీ గత జన్మ పాపాలన్నీ పరిహారమవుతాయి. వైశాఖ శుద్ధ తదియ రోజు ఆవును దూడతో సహా దానం చేస్తే నీ కష్టాలు తీరుతాయి. గొడుగు దానం చేస్తే పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందుతావు. భక్తిశ్రద్దలతో వైశాఖ వ్రతము ఆచరింపుము. శ్రీహరిని అర్చించి, శ్రీహరి కథలను విని యధాశక్తి దానములను చేస్తే లోకములన్నియు నీకు వశములగును. నీకు శ్రీహరి సాక్షాత్కరించును" అని రాజగురువులు రాజునకు వైశాఖ వ్రత విధానమును చెప్పి వెళ్లిపోయారు.
వైశాఖ వ్రతాన్ని ఆచరించిన పురుయశుడు
పురుయశుడు రాజ పురోహితులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించి, యధాశక్తి దానాలు చేసెను. వైశాఖవ్రత ప్రభావమున రాజు సంపదలు, బంధువులు తిరిగి అతనిని చేరెను. రాజు తన రాజ్యానికి తిరిగిపోయి శత్రువులను ఓడించి తన రాజ్యాన్ని తిరిగి పొందెను. వైశాఖవ్రత మహిమ వల్ల అయిదుమంది పుత్రసంతానాన్ని పొందెను.
పురుయశునికి శ్రీహరి సాక్షాత్కారం
రాజు, తన సంతానం కూడా జీవించి ఉన్నంతకాలం వైశాఖ వ్రతాన్ని ఆచరిస్తూ యధాశక్తి దానధర్మములను చేయుచుండిరి. ఆ రాజుకు గల నిశ్చలభక్తికి సంతసించిన శ్రీహరి ఒక వైశాఖశుద్ద తృతీయ అక్షయతృతీయనాడు ఆ రాజునకు ప్రత్యక్షమయ్యెను. చతుర్బాహుడై శంఖచక్రగదా ఖడ్గములను ధరించి పీతాంబర ధారియై వనమాలావిభూషితుడై లక్ష్మీదేవితో గరుడాదిపరివారముతో ప్రత్యక్షమైన పరమాత్మయగు అచ్యుతుని జూచి పురుయశుడు పరవశంతో కనులు మూసుకొని శ్రీహరిని ఈ విధంగా స్తుతించెను.
శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుకు ఇక్కడవరకు చెప్పిన కథను నారదుడు అంబరీష మహారాజుకు వివరిస్తూ వైశాఖ పురాణం ఇరవయ్యవ అధ్యాయాన్ని ముగించాడు.
వైశాఖ పురాణం ఇరవయ్యవ అధ్యాయం సమాప్తం.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.