Vaisakh Puranam 19th Chapter : పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న వైశాఖ పురాణం పంతొమ్మిదవ అధ్యాయంలో శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుకు వివరించిన వైశాఖ వ్రతమహాత్యాన్ని నారద అంబరీషుల సంవాదం ద్వారా ఈ కథనంలో తెలుసుకుందాం.
నారద అంబరీషుల సంవాదం
నారదుడు అంబరీషునితో "ఓ రాజా! శృతదేవమహాముని శ్రుతకీర్తి మహారాజుకు తెలియజేసిన వైశాఖ ధర్మముల గురించి వారి సంవాదం ద్వారా వినిపిస్తాను జాగ్రత్తగా వినుము" అంటూ ఇలా చెప్పసాగెను.
శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుల సంవాదం
శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుతో "ఓ రాజా! పూర్వజనం పుణ్యం ఉంటేనే శ్రీహరి కథల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలుగుతుంది. ఇలాంటి ఆసక్తి కలిగిన నీవు భాగ్యశాలివి. అందుకే వైశాఖ ధర్మాల గురించి నీకు ఇంకను చెప్పాలన్న కోరిక కలుగుతోంది "వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ఉండగా సూర్యోదయానే నదీస్నానం చేసి, శ్రీహరిని పూజించి, వైశాఖ పురాణ శ్రవణం చేసి, యధాశక్తి దానధర్మాలు చేసినవారు విష్ణులోకాన్ని చేరుతారు. వైశాఖ పురాణం ఎవరైనా చెబుతున్నప్పుడు శ్రద్ధగా వినకుండా ఇతర విషయాలపై మనసు లగ్నం చేసేవారు మూర్ఖులు. ఎన్ని జన్మలైనా వారి పాపాలు పోవు. రౌరవాది నరకాలు పొంది పిశాచమై తిరుగుతుంటారు. అందుకు ఉదాహరణగా ఈ ప్రశస్తమైన కథను చెబుతున్నాను. జాగ్రత్తగా వినుము. ఈ కథ జాగ్రత్తగా విన్నవారికి పాపాలు నశించి, పవిత్రతను, ధర్మాసక్తిని కలిగించును కాబట్టి జాగ్రత్తగా వినుము" అంటూ ఇట్లు చెప్పసాగెను.
దుర్వాసుని శిష్యుల కథ
పూర్వము గోదావరి తీరమున బ్రహ్మేశ్వరమను పుణ్యక్షేత్రము కలదు. అచట దుర్వాస మహాముని శిష్యులు సత్యనిష్ఠుడు, తపోనిష్టుడు అనేవారు ఉండేవారు. వారు మహాజ్ఞానులు. సర్వసంగపరిత్యాగులు. ఉపనిషత్తల సారాన్ని గ్రహించినవారు. వారు భిక్షాన్నమును మాత్రమే భుజించే పుణ్యశాలురు.
శ్రీహరి కథలపై ఆసక్తి గల సత్యనిష్టుడు
వీరివురిలో సత్యనిష్ఠునికి శ్రీహరి కథలంటే అమితమైన ఆసక్తి. ఎవరైన శ్రీహరి కథలు చెప్పేవారుంటే తన నిత్యకర్మలు కూడా మానివేసి ఆ కథలు భక్తిశ్రద్ధలతో వింటుండేవాడు. ఒకవేళ శ్రీహరి కథలు చెప్పేవారు ఎవరూ లేకపోతే తానే అందరినీ కూర్చోబెట్టి శ్రీహరి కథలు తన్మయత్వంతో చెబుతుండేవారు. ఎల్లప్పుడూ శ్రీహరికి ప్రీతి కలిగించే పనులే చేస్తుండేవాడు. క్రమం తప్పకుండా వైశాఖ వ్రతాన్ని ఆచరిస్తూ, వైశాఖ ధర్మాలు పాటిస్తుండేవాడు. అలా అతను ఎప్పడూ శ్రీహరి కథలను వింటూ, శ్రీహరిని స్మరిస్తూ సంసారం బంధాలపై వ్యామోహం లేకుండా ఉండేవాడు.
పూజాదికాలలో మునిగిపోయిన కర్మనిష్ఠుడు
రెండవ శిష్యుడు కర్మనిష్ఠుడు మాత్రం ఎప్పుడు పూజాదికాలలో మునిగితేలుతుండేవాడు. తీర్ధాలలో స్నానం చేయడం ఇతనికి ఇష్టం. ఎవరైనా శ్రీహరి కథలు చెబుతున్నా, అవి వింటే తన పూజలకు భంగమని భావించి దూరంగా వెళ్లిపోతుండేవాడు. ప్రతిరోజూ స్నానజపాలు పూర్తి చేసుకుని తన ఇంటిపనులలో నిమగ్నమయ్యేవాడు. ఇలా ఎంతకాలం గడిచినా కర్మనిష్ఠునికి కర్మానుష్ఠానము తప్ప శ్రీహరి కథాశ్రవణము పట్ల ఆసక్తి కలుగలేదు.
పిశాచమైన కర్మనిష్ఠుడు
కొంతకాలం గడిచాక కర్మనిష్ఠుడు మరణిస్తాడు. ఆ తరువాత వాడు పిశాచమై జమ్మిచెట్టుపై నివసించుచుండెను. ఆకలి దప్పికలతో బాధపడుతూ ఆ జమ్మిచెట్టుపై కొన్ని వేల సంవత్సరాలు అలాగే పడివుండెను. కొంతకాలానికి సత్యనిష్ఠుడు పనిమీద పొరుగూరికి వెళ్తూ పిశాచమున్న జమ్మిచెట్టు దగ్గరకు వచ్చాడు. జమ్మిచెట్టుపై ఉన్న పిశాచం సత్యనిష్ఠుని చూసి శరణాగతి కోరుతుంది. అప్పుడు సత్యనిష్టుడు పిశాచంతో దాని బాధకు కారణం ఏమిటని అడుగుతాడు.
తన దుర్గతికి కారణం చెప్పిన కర్మనిష్ఠుడు
అప్పుడు పిశాచం సత్యనిష్ఠునితో "నేను గతజన్మలో దుర్వాసమహాముని శిష్యుడను. నా పేరు కర్మనిష్ఠుడు. నేను పూజలు, జపాలు చేసానే కానీ ఏనాడూ శ్రీహరి కథలంటే ఆసక్తి చూపలేదు. వైశాఖ వ్రతాన్ని ఆచరించలేదు. వైశాఖ ధర్మాలు పాటించలేదు. అందుకే నేను ఈ పిశాచజన్మ ఎత్తి ఈ కష్టాలు అనుభవిస్తున్నాను. నా కష్టాలు పోయే తరుణోపాయం చెప్పండి" అని దీనంగా ప్రార్ధించింది.
వైశాఖ వ్రతం ఫలాన్ని ధారపోసిన సత్యనిష్టుడు
పిశాచం మాటలు విన్న సత్యనిష్టుడు ఎంతో దయతో తాను రెండు గడియలకాలము వైశాఖ పురాణ శ్రవణము చేసిన ఫలమును ఆ పిశాచానికి సమంత్రకంగా ధారపోసాడు.
విష్ణులోకాన్ని చేరిన కర్మనిష్ఠుడు
సత్యనిష్టుడు ధారపోసిన వైశాఖ పురాణ శ్రవణ ఫలం మహిమ వల్ల కర్మనిష్ఠుని పాపములు తొలగెను. వాని పిశాచరూపము పోయి దివ్య దేహము కలిగెను. అప్పుడు కర్మనిష్ఠుడు సత్యనిష్ఠునికి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపి శ్రీహరి పంపిన దివ్యవిమానము ఎక్కి శ్రీహరి సాన్నిధ్యమునకు పోయెను. సత్యనిష్ఠుడును వైశాఖమాస మహాత్మ్య మహిమకు విస్మయపడుచు తన గమ్యాన్ని చేరెను.
శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుల సంవాదం
శృతదేవ మహాముని "ఓ శ్రుతకీర్తి మహారాజా! శ్రీహరి కథల ప్రసంగము, శ్రవణము, ప్రశస్తము. వాటి మహిమ అనంతం. శ్రీహరి కథాప్రసంగము గంగాప్రవాహము కంటే పవిత్రమైనది." అని శృతదేవ మహాముని వివరించిన శ్రీహరి కథాశ్రవణ మహత్యాన్ని అంబరీషునికి వివరిస్తూ నారదుడు వైశాఖ పురాణం పంతొమ్మిదవ అధ్యాయాన్ని ముగించాడు.
వైశాఖ పురాణం పంతొమ్మిదవ అధ్యాయం సమాప్తం.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.