Vaisakha Puranam 16th Chapter in Telugu : వైశాఖ మాస వ్రత ఫలం వలన శూన్యమైన యమలోకం గురించి, యముని పరాజయం గురించి శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుకు వివరించిన వైనాన్ని వైశాఖ పురాణం పదహారవ అధ్యాయంలో తెలుసుకుందాం.
నరకాన్ని సందర్శించిన నారదుడు
కీర్తిమంతుడు తన రాజ్యంలో ప్రజలందరూ వైశాఖ వ్రతం తప్పకుండా ఆచరించేలా కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు. దీనితో అందరూ వైశాఖ వ్రతాన్ని ఆచరించి పాపాలు పోగొట్టుకోవడంతో నరకంలో పాపులు లేక బోసిపోయింది. ఈ విషయం తెలిసి నారద మహర్షి నరకాన్ని సందర్శించాడు.
యముని ప్రశ్నించిన నారదుడు
యమలోకంలో యముని దీనస్థితిని చూసి నారదుడు "యమధర్మరాజా! ఆశ్చర్యంగా ఉంది! నరకంలో చిత్రహింసలు పడుతూ పాపులు చేసే రోదనలు వినబడడం లేదు. చిత్రగుప్తుడు పాపుల లెక్కలు చూడడం మాని ముని వలే మౌనంగా ఉన్నాడు. నరకమంతా శూన్యంగా అది. ఇందుకు కారణమేమిటి? అని ప్రశ్నిస్తాడు.
నారదునికి తన దీనస్థితి వెల్లడించిన యముడు
నారదుని మాటలకు యముడు "ఓ మహర్షి! భూలోకమున ఇక్ష్వాకు వంశానికి చెందిన కీర్తిమంతుడనే రాజు ధర్మభేరిని మ్రోగించి తన ప్రజలచే వైశాఖ వ్రతాన్ని ఆచరించేలా చూస్తున్నాడు. ఈ వ్రతం ఆచరించని వారిని శిక్షిస్తున్నాడు. ఇందుచేత భక్తితోనో, దండన వలన భయంతోనో ప్రజలందరూ వైశాఖ వ్రతాన్ని ఆచరించి పాపవిముక్తులై, పుణ్యం పొంది విష్ణులోకాన్ని చేరుతున్నారు. నరకానికి వచ్చే వారు ఎవరూలేక నరకం వెలవెలబోతోంది. దానితో నేను ఎండిన మోడు వలే మిగిలిపోయాను. నాకు పూర్వపు స్థితి రావాలంటే కీర్తిమంతునిపై దండయాత్ర చేసి, అతనిని చంపదలచాను. బ్రహ్మచే పాపులను శిక్షించే పదవిని పొందాను. కానీ ఇచ్చిన పదవికి న్యాయం చేయలేకపోతున్నాను. ఒకవేళ ఆ రాజును చంపలేకపోతే నా తదుపరి కర్తవ్యం ఏమిటో బ్రహ్మనే అడుగుతాను" అన్న యముని మాటలకు నారదుడు అలాగే కానిమ్ము" అని తన దారిన తాను పోయాడు.
భూలోకానికి బయల్దేరిన యముడు
యమధర్మరాజు తన వాహనమైన మహిషాన్ని ఎక్కి భయంకరమైన ఆకారంతో, యమదండాన్ని చేతపట్టి, భీకరులైన యాభై కోట్లమంది యమకింకరులతో కీర్తిమంతునిపై యుద్ధానికి వెళ్లెను. కీర్తిమంతుడు కూడా వచ్చింది యమధర్మరాజు అని తెలుసుకుని యుద్ధానికి సిద్ధమయ్యాడు. యమునికి కీర్తిమంతునికి హోరాహోరీగా యుద్ధం జరగసాగింది.
నశించిన యముని సైన్యం - యమ దండాన్ని ప్రయోగించిన యముడు
యముని సేవకులగు మృత్యువు, రోగము, ఇతర యమదూతలు కీర్తిమంతుని యెదిరింపలేక పారిపోయారు. యముడు ప్రయోగించి ఆయుధాలన్నీ కీర్తిమంతుని ఆయుధాల ముందు శక్తిహీనముగా మారాయి. చివరకు యముడు బ్రహ్మాస్త్రముతో మంత్రించిన తన యమదండాన్ని కీర్తిమంతునిపై ప్రయోగించగా, భయంకరమైన ఆ యమదండమును చూసి అందరూ బెదిరిపోయారు.
సుదర్శన చక్రంతో కీర్తిమంతుని కాపాడిన శ్రీహరి
అప్పుడు శ్రీహరి తన భక్తుడగు కీర్తిమంతుని రక్షణకై తన సుదర్శన చక్రమును పంపాడు. భయంకరమగు సుదర్శన చక్రము యమదండమును దానిలోని బ్రహ్మాస్త్రమును శక్తిహీనము చేసి, తిరిగి యమునిపై మరలేలా చేశాడు. దీంతో విష్ణుభక్తుడగు కీర్తిమంతుడు శ్రీహరికి నమస్కరించి, యమునికి ఆపద కలిగించవద్దని సుదర్శన చక్రాన్ని ప్రార్ధించాడు.
రాజును చేరిన సుదర్శన చక్రం
కీర్తిమంతుడు ప్రార్థింపగా సుదర్శన చక్రము యముని విడిచి దేవతలందరు చూస్తుండగా రాజు వద్దకు వచ్చి నిలిస్తుంది. తన సర్వ ప్రయత్నాలు వ్యర్ధమవటాన్ని యముడు గమనించాడు. అంతకన్నా ముఖ్యంగా కీర్తిమంతుడు సుదర్శన చక్రాన్ని ప్రార్థించి తనను రక్షించుట యమునికి అవమానభారం కలిగించింది.
బ్రహ్మ వద్దకు వెళ్లిన యముడు
అవమానభారంతో యముడు తలవంచుకుని బ్రహ్మలోకానికి వెళ్తాడు. ఆ సమయంలో బ్రహ్మ సకల దేవతలతో, దిక్పాలకులతో, ఇంద్ర వరుణ వాయు కుబేరులతో కొలువై ఉంటాడు. అవమానభారంతో తలవంచుకుని వస్తున్న యముని చూసి బ్రహ్మ సభలో అందరూ ఆశ్చర్యపోతారు. ఎప్పుడు క్షణం కూడా తీరిక లేకుండా పాపుల చిట్టాలు పరిశీలించి శిక్షించే యముడు ఇలా రావడానికి కారణమేమై ఉంటుంది? యముని చేతిలోని పాపుల చిట్టా ఇలా కొట్టివేతలతో ఉండడానికి కారణమేమిటి? అని సభలోని వారు చర్చించుకోసాగారు.
బ్రహ్మను శరణు వేడిన యముడు
సభలోని వారు ఇలా చర్చించుకుంటుండగా యముడు బ్రహ్మదేవుని పాదాలపై పడి "స్వామీ! మానవుల పాపాలను నేనే రాసి నేనే కొట్టేయాల్సిన దుర్గతి పట్టింది. నా కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించలేకపోతున్నాను. నేను కీర్తిమంతుని చేతిలో పరాభవాన్ని పొందాను." అని దుఃఖిస్తున్న యముని చూసి సభలోని వారందరూ తలోరకంగా మాట్లాడసాగారు.
యముని ఊరడించిన వాయుదేవుడు
ఆ సమయంలో వాయుదేవుడు సభలోని వారిని నిశ్శబ్ద పరచి బ్రహ్మ పాదములపై వ్రాలిన యమధర్మరాజును తన స్వహస్తాలతో పైకి లేపుతాడు. దుఃఖించుచున్న యముని ఆసనముపై కూర్చోబెట్టి ఊరడిస్తూ "ఓ యమధర్మరాజా! నిన్ను పరాభవించిన వారెవరు? నీ కర్తవ్య నిర్వహణకు అడ్డం వచ్చిన వారెవరు? ఈ పాప పట్టిక ఇలా కొట్టివేతలతో ఎందుకుంది? వివరముగ చెప్పుము?" వాయువు అడుగగా యమధర్మ రాజు తన దీనస్థితిని వివరించసాగెను.
శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుకు చెప్పిన ఈ కథను నారదుడు అంబరీష మహారాజుకు ఇక్కడవరకు చెప్పి వైశాఖ పురాణం పదహారవ అధ్యాయాన్ని ముగించాడు.
వైశాఖ పురాణం పదహారవ అధ్యాయం సమాప్తం.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
రాజ్య ప్రజలను కాపాడిన వైశాఖ ధర్మవృక్షం- వైశాఖ పురాణం 15వ అధ్యాయం కథ ఇదే
మునులకు సేవ చేసి విష్ణులోకాన్ని చేరిన హేమకాంతరాజు- వైశాఖ పురాణం 14వ అధ్యాయం కథ ఇదే!