Vaisakha Puranam 15th Chapter : పరమ పవిత్రమైన వైశాఖ పురాణంలో నారదుడు అంబరీష మహర్షితో పదిహేనవ అధ్యాయంలో శృతదేవ మహాముని బోధించిన వైశాఖ ధర్మాలు గురించి ఏ విధంగా వివరించాడో ఈ కథనంలో తెలుసుకుందాం.
శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుల సంవాదం
శ్రుతకీర్తి మహారాజు శృతదేవ మహామునితో "ఓ మహాత్మా! మీరు వివరించిన వైశాఖ ధర్మాలు చాలా ఉత్తమమైనవి. మరి ఇంతటి ఉత్తమ ధర్మాలు ఎందుకని ప్రచారంలో లేవు? కొందరు మాఘ కార్తీకమాస వ్రతాలు శ్రేష్టమని అంటారు. మరికొందరు చాతుర్మాస వ్రతాలు గొప్పవని అంటారు. వేదం ప్రతిపాదించిన ఈ వైశాఖ ధర్మాలకు ఎందుచేత రావలసినంత ప్రచారం రాలేదు? దయచేసి వివరించండి" అని అడుగగా శృతదేవ మహాముని "రాజా! వైశాఖ ధర్మములు ఎందుకు ప్రసిద్ధి కాలేదో వివరిస్తాను జాగ్రత్తగా వినుము" అంటూ ఇట్లు చెప్పసాగెను.
వైశాఖ ధర్మాలకు ఇందుకే ప్రచారం లేదు
లోకంలో జనులు ఎక్కువగా పుత్రపౌత్రుల కోసం, సంపదల కోసం, ఐహిక సుఖాల కోసం నోములు, వ్రతాలు చేస్తుంటారు. మరికొందరు స్వర్గానికి వెళ్లాలన్న కోరికతో యజ్ఞయాగాది క్రతువులు చేస్తుంటారు. అంతేకాని ఎవరుకూడా స్థిరమైన మోక్షాన్ని, విష్ణు లోకాన్ని కోరడం లేదు. శాశ్వతమైన కైవల్యాన్ని, విష్ణులోక ప్రాప్తిని అందించే వైశాఖ ధర్మాలు అందుకే ప్రసిద్ధం కాలేదు. ఇందుకు ఉదాహరణగా ఒక కథను కూడా వివరిస్తాను వినుము" అంటూ చెప్పసాగెను.
కాశీరాజు కథ
పూర్వం కాశీకి రాజైన కీర్తిమంతుడనే రాజు ఉండేవాడు. ఇతను నృగమహారాజు కుమారుడు. ఇక్ష్వాకు వంశరాజులలో ఉత్తముడు, కీర్తిశాలి. ఇంద్రియములను జయించినవాడు. కోపమంటే ఎరుగనివాడు. బ్రహ్మజ్ఞాని. ఒకనాడు కీర్తిమంతుడు వేటాడుటకై అడవికి వెళ్లెను. వేటాడి అలిసిపోయి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు.
వైశాఖ ధర్మాలు ఆచరిస్తున్న వశిష్ట మహర్షి శిష్యులు
కీర్తిమంతుడు వశిష్ట మహర్షి ఆశ్రమానికి వెళ్లినది వైశాఖ మాసం. అందుకే ఆశ్రమంలోని శిష్యులు వైశాఖమాస ధర్మములను ఆచరిస్తున్నారు. కొందరు చలివేంద్రములు ఏర్పాటు చేస్తుండగా, మరికొందరు నీడనిచ్చు చెట్లను, మరికొందరు దిగుడు బావులను, ఏర్పాటు చేయుచుండిరి. మరికొంత మంది శిష్యులు బాటసారులను చెట్ల నీడలలో కూర్చోబెట్టి విసన కర్రలతో విసురుతూ, చల్లదనాన్ని ఇచ్చే చెరకుగడలు, గంధం, పండ్లను ఇచ్చి సేదతీరుస్తున్నారు.
బాటసారులకు ఉపచారాలు
వైశాఖ మాసంలో మిట్ట మధ్యాహ్న సమయంలో గొడుగులు దానం చేస్తూ, సాయంకాలమున పానకమును, తాంబూలమును, కన్నులు చల్లబడుటకు కర్పూరమును ఇచ్చుచుండిరి. చెట్లనీడలయందు, ఇంటి ముంగిళ్లయందు మండపములలో ఇసుకను పరచి బాటసారులు కూర్చుండుటకు వీలుగా చేయుచుండిరి. చెట్ల కొమ్మలకు ఉయ్యాలలను కట్టుచుండిరి. వశిష్ట మహర్షి శిష్యులు చేస్తున్న ఈ ఉపచారాలు చూసి రాజు ఆశర్యపోయాడు.
శిష్యులను ప్రశ్నించిన రాజు
వశిష్ట మహర్షి శిష్యులు చేస్తున్న ఉపచారాలు చూసి రాజు "మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు?" అని అడుగగా అప్పుడు శిష్యులు "ఇవన్నీ వైశాఖ మాసంలో చేయాల్సిన ధర్మాలు. సకల పురుషార్ధాలను, మోక్షాన్ని ఇచ్చే ఈ ధర్మాలను మా గురువు గారైన వశిష్టుని ఆజ్ఞ మేరకు మేం చేస్తున్నాం. ఇంకా ఏవైనా సందేహాలుంటే మా గురువు గారిని అడిగితే చెప్తారు" అని వివరిస్తారు.
వశిష్టుని ఆశ్రమాన్ని సందర్శించిన రాజు
వెంటనే కాంతిమంతుడు వశిష్టుని ఆశ్రమాన్ని చేరుకుంటాడు. తన ఆశ్రమానికి విచ్చేసిన రాజుకు వశిష్ఠుడు ఎదురేగి స్వాగతం పలికి, అతిధి సత్కారాలు చేస్తాడు. అప్పుడు రాజు వశిష్టునితో "మహర్షీ! మార్గమధ్యంలో మీ శిష్యులు బాటసారులకు చేయు అతిధి సత్కారములు, ఉపచారములు నాకు చాలా ఆశ్చర్యం కలిగించాయి. మీరు మునులలో శ్రేష్ఠులు! సర్వధర్మములు తెలిసినవారు. మీకు శిష్యుడనైన నాకు దయచేసి ఈ వైశాఖ ధర్మాల గురించి వివరింపుము" అని కోరుతాడు.
వైశాఖ వ్రతమహాత్యాన్ని వివరించిన వశిష్ఠుడు
కాంతిమంతుని మాటలకు సంతోషించిన వశిష్ఠుడు "రాజా! అన్ని ధర్మాలలో కెల్లా వైశాఖ ధర్మాలు ఉత్తమమైనవి. విన్నంత మాత్రాన్నే సర్వ పాపాలు నశింపజేసే వైశాఖ ధర్మాల గురించి వివరిస్తాను వినుము" అంటూ ఇట్లు చెప్పసాగెను.
వైశాఖ మాసంలో నదీస్నానం అత్యుత్తమం. మోక్షదాయకం. వైశాఖ మాసంలో నదీస్నానం చేసి విష్ణువును పూజిస్తే శాశ్వత విష్ణులోకం ప్రాప్తిస్తుంది. అట్టివారు శ్రీహరికి ప్రీతిపాత్రులవుతారు. వైశాఖ మాసంలో స్నానం, దానం, జపం చేయని వారు ఎంతటి ఉత్తమ కులస్తులైనా, నీచ కులస్తులతో సమానం. వైశాఖ ధర్మాలు ఆచరించే వారు నీచ కులస్తులైనా ఉత్తమ కులస్థులతో సమానం.
వైశాఖ మాసంలో భక్తి పూర్వకంగా చేసే స్వల్ప కార్యమైనా విశేష ఫలం ఇస్తుంది. భక్తి లేకుండా చేసే ఎంత పెద్ద కార్యమైనా ఫలం శూన్యం. కావున రాజా! నీవును వైశాఖమాస ధర్మములను భక్తిశ్రద్ధలతో ఆచరింపుము. నీ దేశప్రజల చేతకూడా చేయింపుము. వారికిని శుభము కలుగును. వైశాఖధర్మములు ఆచరింపని వారిని కఠినంగా శిక్షింపుము" అని వశిష్ఠమహర్షి శుభకరములగు వైశాఖమాస వ్రత ధర్మములు, వాని అంతరార్థము మహారాజుకు వివరించెను. రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను.
వైశాఖ ధర్మాలు తన రాజ్యంలో తప్పనిసరి చేసిన రాజు
తన రాజ్యానికి తిరిగి వచ్చాక కాంతిమంతుడు తన రాజ్యంలో ఎనిమిది సంవత్సరాలు పైబడిన, ఎనభై సంవత్సరాల లోపు ప్రజలందరూ విధిగా వైశాఖ వ్రతధర్మాలు ఆచరించాలని ఆదేశించారు. బంధుమిత్రులైనా, భార్యాపుత్రులైన వైశాఖ ధర్మాలు పాటించకపోతే శిక్షార్హులు అని ప్రకటించారు.
కల్పవృక్షంగా మారిన వైశాఖ ధర్మవృక్షం
గ్రామాల్లో కూడా ప్రజలు వైశాఖ ధర్మాలు తప్పకుండా ఆచరించేలా చుడానికి అధికారులను నియమించాడు. ఆనాటి నుంచి వైశాఖ ధర్మవృక్షం కల్పవృక్షంగా ఆ రాజ్యప్రజలను కాపాడసాగింది. అందరు ఉత్తమమైన వైశాఖ ధర్మాలు ఆచరించి విష్ణు లోకానికి చేరుకోసాగిరి. ఇటు నరకానికి గాని, స్వర్గానికి గాని వెళ్లేవారు లేక స్వర్గనరకాలు శూన్యమయ్యాయి.
ఈ కథను ఇక్కడవరకు చెప్పి నారద మహర్షి వైశాఖ పురాణం పదిహేనవ అధ్యాయాన్ని ముగించాడు.
వైశాఖ పురాణం పదిహేనవ అధ్యాయం సమాప్తం.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.