Shani Temples In India : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరైతే ఏలినాటి శని, శని మహాదశ, అర్దాష్టమ శని, అష్టమ శని వంటి దోషాలతో ఇబ్బందులు పడుతుంటారో వారు జీవితంలో ఒక్కసారైనా ఈ అయిదు దేవాలయాల్లో ఒక్కటైనా దర్శిస్తే చాలు శని బాధల నుంచి ఉపశమనం కలుగుతుందట! ఆ 5 దేవాలయాలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
శనిదేవుని ప్రభావం
హిందూ మత విశ్వాసాల ప్రకారం, శని దేవుడు న్యాయానికి అధిపతి. ఎవరి జాతకంలో అయితే శని దేవుని స్థానం బలంగా ఉంటుందో, శని దేవుని దృష్టి అనుకూలంగా ఉంటుందో వారు త్వరలో ధనవంతులుగా మారిపోతారు. అదే విధంగా శని దేవుని దృష్టి ప్రతికూలంగా ఉంటే మాత్రం వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదు. వారు జీవితంలో అష్టకష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరమైన రంగాల్లో నష్టాలను చవి చూడాల్సి వస్తుంది.
శని దోషాలుంటే ఏమి చేయాలి?
ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక్కసారైనా వారి జాతకం ప్రకారం ఏలినాటి శని, అర్దాష్టమ శని వంటి వాటిని ఎదుర్కోవలసి వస్తుంది. అయితే శని దేవుని ఆశీస్సులు పొందేందుకు, శని దోషం నుంచి తప్పించుకునేందుకు శనివారం రోజున ఈ శని దేవాలయాలకు వెళ్తే ప్రయోజనం ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతారు. అదేవిధంగా శని దేవుని ఆలయంలో ఆవాల నూనె, నల్ల నువ్వులు సమర్పించడం వల్ల శని దోషం నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ సందర్భంగా శని దోషం నుంచి బయటపడేందుకు అత్యంత ప్రభావవంతమైన కొన్ని శని దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శని శింగణాపూర్
శని దేవుని ప్రస్తావన వచ్చినప్పుడల్లా తప్పకుండా గుర్తొచ్చేది మహారాష్ట్రలోని శని శింగణాపూర్! ఈ ప్రసిద్ధ శని దేవాలయం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని శింగనాపూర్ గ్రామంలో ఉంది. ఈ ఆలయానికి దేశంలోని నలుమూలల నుంచి శని దేవుని అనుగ్రహం కోసం వస్తారు. ఈ ఆలయంలోని విశేషాలు ఏమిటంటే ఇక్కడ శని దేవుడిని దర్శించుకోవడం వల్ల ఒక్కరోజులో శని దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ ఊళ్లో ఏ ఇంటికీ తలుపులు ఉండవు. ఒకవేళ ఉన్నా వాటికి తాళాలే వేయరు. ఎందుకంటే న్యాయాధిపతి అయిన శనిదేవుని మహిమ వల్ల ఇక్కడ దొంగతనాలు జరగవని అక్కడ ప్రజల నమ్మకం. శని దేవుడికి భయపడి దొంగలు ఇక్కడ ఎలాంటి చెడు పనులు చేయరని చాలా మంది చెబుతారు. శని దోషం ఉన్నవారు ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల శుభ ఫలితాలు పొందవచ్చు.
శని ధామ్ ఆలయం
దేశ రాజధాని దిల్లీలోని ఛతర్‌పుర్‌లో మరో ప్రసిద్ధ శని ధామ్ దేవాలయం ఉంది. ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శని దేవుడి విగ్రహాన్ని మనం చూడొచ్చు. ఈ ఆలయంలో శని దేవుని ఆరాధించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఈ ఆలయాన్ని సందర్శిస్తే శని దోషం తొలగిపోతుందని చాలా మంది నమ్ముతారు. ఈ ఆలయ ప్రాంగణంలో పురుషులు స్నానం చేసి దేవుడికి ఆవాల నూనె సమర్పిస్తారు. ఈ దేవాలయాన్ని ఒక్కసారి దర్శిస్తే ఎలాంటి శని దోషాలైనా తొలగిపోతాయని విశ్వాసం.
కోకిలవన్ ధామ్
ఈ దేవాలయం ఉత్తరప్రదేశ్ మధుర జిల్లాలోని క్రిష్ణా నగర్‌లో ఉంది. కోసిలోని ఈ శని దేవాలయాన్ని కోకిలావనంగా పిలుస్తారు. ఈ ఆలయంలో ఏడు శనివారాలు శనీశ్వరుడికి ఆవాల నూనె సమర్పిస్తే శని దోషం తొలగిపోతుందని ప్రగాఢ నమ్మకం. పురాణాల ప్రకారం, ఈ ప్రాంతంలో శ్రీకృష్ణుడు కోకిల రూపంలో శనికి దర్శనమిచ్చినందున ఈ ఆలయాన్ని కోకిల వనం అని పిలుస్తారు.
తిరునల్లార్ దేవాలయం
తిరునల్లార్ శని దేవుని ఆలయం తమిళనాడులోని తంజావూర్ జిల్లాలో ఉంది. రెండు నదుల మధ్య ఉన్న ఈ ఆలయంలో శనితో పాటు శివుడిని కూడా పూజిస్తే శని దోషం తొలగిపోతుందని చాలా మంది నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని రాశులు మారుతూ ఉంటాడు. అలా శని దేవుని స్థానం మారినప్పుడు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
కర్ణాటక శని దేవాలయం
కర్ణాటకలోని తుమ్‌కూర్ జిల్లాలో ఈ ప్రసిద్ధ శని దేవాలయం ఉంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ శని దేవుడు తన వాహనమైన కాకిపై కూర్చుని ఉంటాడు. జాతకం ప్రకారం, శని దోషం ఉండేవారు ఈ ఆలయాన్ని దర్శించి శని దేవుని పూజిస్తే సమస్యలన్నీ దూరమవుతాయి. ఈ నమ్మకంతో శని దేవుని దర్శనం కోసం పెద్ద సంఖ్యలో ప్రజలందరూ వెళ్తుంటారు.
జాతకం ప్రకారం ఏలినాటి శనితో, శనిదోషాలతో ఇబ్బంది పడేవారు ఈ ఆలయాలలో ఏ ఒక్క ఆలయాన్ని దర్శించినా శని బాధల నుంచి ఉపశమనం కలుగుతుందని విశ్వాసం.
ఓం శనైశ్చరాయ నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం