Ganesh Vahan Mushak Story : హిందూ పురాణాల ప్రకారం ప్రతి దేవునికి ఏదో ఒక వాహనం ఉంటుంది. పరమశివునికి నంది, దుర్గాదేవికి సింహం, విష్ణువు వాహనం గరుడుడు, సుబ్రహ్మణ్య స్వామికి నెమలి, సరస్వతీ దేవికి హంస ఇలా ఒక్కో దేవునికి ఒక్కో వాహనం ఉంటుంది. ఇక గణాధిపతి అయిన వినాయకుని వాహనం మాత్రం ఎలుక. బొజ్జ గణపయ్యను అంత చిన్న ఎలుక వినాయకుని ఎలా మోయగలదు అనే సందేహం అందరికీ ఉంటుంది. ఈ కథనంలో అసలు వినాయకుని వాహనంగా ఎలుక ఎలా మారింది? అనే ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం.
ఇంద్రసభలో క్రౌంచుని పరిహాసాలు
ఒకసారి స్వర్గాధిపతి ఇంద్రుడు ముఖ్యమైన వారితో కొలువు తీరాడు. ఆనాటి ఇంద్రసభలో దేవతలు కొన్ని ఆంతరంగిక విషయాలను గురించి చర్చిస్తూ ఇంద్రుని సభలో సమావేశమయ్యారు. వారిలో గంధర్వులు, అప్సరసలు వంటి వారు కూడా ఉన్నారు. ఒకపక్క తీవ్రమైన చర్చ జరుగుతూ, ఉద్రిక్త వాతావరణం అలముకున్న సమయంలో క్రౌంచుడు అనే గంధర్వుడు సమావేశానికి భంగం కలిగించేలా అనుచితంగా ప్రవర్తించాడు. ముఖ్యమైన చర్చలో పాల్గొనకుండా ఈ గంధర్వుడు అప్సరసలతో పరాచకాలాడుతూ సభకు అంతరాయాన్ని కలిగించాడు.
ఇంద్రుని శాపం
గంధర్వుని ప్రవర్తన మార్చుకోమని దేవతలు హెచ్చరించినా క్రౌంచుడు నిర్లక్ష్యం చేసి ఇంద్రునికి కోపం తెప్పించాడు. ఆగ్రహించిన ఇంద్రుడు, అతనిని తక్షణమే ఎలుకగా మారమని శపించాడు. గంధర్వుడు క్షమాభిక్ష కోరినా, ఫలితం దక్కలేదు.
శాపవశాత్తూ భూమిపై పడిన ఎలుక
ఎలుకగా మారిన తర్వాత కూడా, అతను దేవ లోకాలన్నీ తిరుగుతూ, అందరికీ విసుగు తెప్పించాడు. క్రౌంచుని ప్రవర్తనతో విసిగిపోయిన ఇంద్రుడు, అతనిని దేవ లోకం నుంచి కూడా తరిమెయ్యమని ద్వార పాలకులకు పురమాయించాడు. ద్వార పాలకులు ఇంద్రుని ఆదేశం మేరకు ఎలుకను భూమిపైకి విసిరివేశారు.
పరాశరుని ఆశ్రమానికి చేరిక
భూమిపై పడిన ఈ మూషికం పరాశరుని ఆశ్రమానికి చేరుకుంది. ఈ మూషికం ఇక్కడ కూడా తన దుడుకు చర్యలకు స్వస్థి పలకలేదు. పరాశరుని ఆశ్రమంలో ధాన్యాలు, ఆహార పదార్థాలు, వస్త్రాలు, అక్కడ నివసించే ఋషులు ఉపయోగించే వస్తువులను తునాతునకలు చేసేవాడు లేదా తినేవాడు. ఒకసారి ఈ ఆశ్రమానికి వినాయకుడు విచ్చేస్తాడు. ఈ ఎలుక చివరికి ఆశ్రమానికి విచ్చేసిన వినాయకుని సంబంధించిన వస్తువులను కూడా వదలలేదు.
వినాయకుని తరుణోపాయం కోరిన ఋషులు
ఋషులందరికి ఈ ఎలుకను పట్టడం తలకు మించిన భారంగా మారిన తరుణంలో, విసిగిపోయిన పరాశరుడు అతనిని వదిలించుకోవడానికి ఒక మార్గం సూచించమని వినాయకుని అడిగాడు. పరాశరుని కోరిక మన్నించిన వినాయకుడు తక్షణమే చర్యకు పూనుకున్నాడు.
క్రౌంచునిపై వినాయకుని దాడి
వినాయకుడు తన ఆయుధమైన పాశాన్ని మూషికంపై ప్రయోగించగా, ఆ పాశం క్రౌంచుని మెడకు చుట్టుకుని వినాయకుడి పాదాల వద్దకు తీసుకువచ్చింది. క్రౌంచుడు వినాయకుని కాళ్ళ వద్ద పడి భయంతో వెంటనే క్షమించమని వినాయకుడిని అడిగాడు. వినాయకుడు దయార్ద్ర హృదయంతో క్రౌంచుడిని క్షమించి, మరలా పొరపాటు చేయకూడదని హెచ్చరించాడు. మూషికం వినాయకుని ఆదేశాలను పాటించటానికి ఒప్పుకుంది.
శాపవిమోచనం కోసం వినాయకుని ప్రార్ధించిన క్రౌంచుడు
క్రౌంచుడు తనకు శాపవిమోచనం కలిగించి మరలా గంధర్వునిగా మార్చమని వేడుకున్నాడు. క్రౌంచుని శాపానికి కారణాన్ని గ్రహించిన వినాయకుడు, ఇంద్రుని శాపం తొలగిపోయేది కాదని గ్రహించి మధ్యేమార్గంగా ఇంకో ఉపాయాన్ని క్రౌంచునికి చెబుతాడు.
క్రౌంచునికి వరమిచ్చిన వినాయకుడు
ఏ శుభకార్యమైనా, నోములైనా, వ్రతాలైనా ముందుగా ఆదిదేవుడు వినాయకుని పూజించడం ఆనవాయితీ. ఇంద్రుడు ఇచ్చిన శాపాన్ని తొలగించడం సాధ్యం కాదు కాబట్టి వినాయకుని వాహనంగా మూషికం కూడా వినాయకునితో పాటు తొలి పూజలందుకునే వరాన్ని క్రౌంచుడికి ప్రసాదించాడు. ఈ కారణంగానే గంధర్వుడైన క్రౌంచుడు వినాయకునికి వాహనంగా మారాడు.
ఎలుక వినాయకుని ఎలా మోయగలదు?
ఇప్పుడు వినాయకునికి మరొక సమస్య ఏర్పడింది. క్రౌంచుడు ఎలుకగా ఉన్న కారణాన వినాయకుడి శరీర బరువును మోయలేడు. కాబట్టి క్రౌంచుడు వినాయకుని తేలికగా మారమని కోరాడు. వినాయకుడు క్రౌంచుని కోరిక మన్నించి, తాను ఎలుకను అధిరోహించిన సమయంలో క్రౌంచుడు తన బరువుని మోయగలిగేలా వరాన్ని ప్రసాదించాడు. ఈ విధంగా మూషికంగా మారిన క్రౌంచుడు వినాయకునికి వాహనంగా మారి గణపతితో పాటు తొలి పూజలందుకుంటున్నాడు.
ఓం శ్రీ గణాధిపతయే నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
పెళ్లిళ్లు కుదిర్చే 'ఇడగుంజి' వినాయకుడు- ఈ క్షేత్రం ఎక్కడుందో తెలుసా?
ఏటా పెరిగే గణపతి - చెవిలో కోరికలు చెబితే చాలు - అనుకున్నది జరగడం ఖాయం!