అయోధ్య రామయ్యకు సూర్యతిలకం- ఎప్పుడు? ఎక్కడ? ఎలా చూడాలి?
శ్రీరామనవమికి ముస్తాబవుతున్న అయోధ్య- బాల రామయ్యకు సూర్య తిలకం

Published : March 27, 2025 at 6:00 AM IST
Sri Rama Navami Preparations 2025 : తెలుగు నూతన సంవత్సరంలో ఉగాది తర్వాత రానున్న ముఖ్యమైన పండుగ శ్రీరామనవమి. శ్రీరామనవమి పండుగ దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా జరుపుకుంటారు. దక్షిణాదిన భద్రాచలం, ఒంటిమిట్ట క్షేత్రాలు ఇప్పటికే శ్రీరామనవమికి సిద్ధమవుతున్నాయి. అటు ఉత్తరాదిన రామజన్మ భూమి అయోధ్యలో శ్రీరామా నవమికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీరామనవమి ఎప్పుడు? అయోధ్యలో శ్రీరామనవమి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఆ విశేషాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
శ్రీరామనవమి ఎప్పుడు?
తెలుగు పంచాంగం ప్రకారం చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరామనవమి జరుపుకుంటాం. ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం, చైత్ర శుద్ధ నవమి, శ్రీరాముని జన్మ నక్షత్రం పునర్వసు కలిసి వచ్చాయి కాబట్టి ఈ రోజునే శ్రీరామనవమిగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. సాధారణంగా ఆరోజు అభిజిత్ లగ్నంలో అనగా సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా రామజన్మభూమి అయోధ్యలో సూర్యతిలకం ఎప్పుడు జరుగనుంది? శ్రీరామనవమికి జరుగుతున్న ఏర్పాట్లు గురించి తెలుసుకుందాం.
ఆధ్యాత్మిక వాతావరణంలో!
మార్చి 29 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు వసంత నవరాత్రి వేడుకల సందర్భంగా అయోధ్యలో రామ కథ నిర్వహించనున్నారు. అలాగే శ్రీరామనవమి వేడుకలను భక్తులు భక్తితో ఆధ్యాత్మిక వాతావరణంలో జరుపుకోవడానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అభిజిత్ లగ్నంలో అభిషేకం
చైత్రశుద్ధ నవమి హిందువులకు చాలా పవిత్రమైనది. ఈ రోజున, లోక రక్షకుడు శ్రీ మహా విష్ణువు శ్రీ రాముడిగా అవతరించాడు. ఇది విష్ణువు ఏడో అవతారంగా భావిస్తారు. దీనినే రామ నవమి అంటారు. అయోధ్యలో బాల రామయ్యకు శ్రీ రామ నవమి రోజున అభిషేకం సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్నారు.
బాల రామయ్యకు సూర్య తిలకం
పవిత్రమైన శ్రీరామనవమి రోజు సరిగ్గా అభిజిత్ లగ్నంలో అయోధ్యలో సూర్యనారాయణుడు తన కిరణాలతో బాల రామయ్యకు తిలకం దిద్దనున్నాడు. ఈ సందర్భంగా సూర్యకిరణాలు బాల రామయ్య నుదిటిపై 4 నిమిషాలు పడనున్నాయి. ఈ అపూర్వ దృశ్యాన్ని వీక్షించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో అయోధ్యకు చేరుకోనున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు ఈ అపురూప దృశ్యాన్ని టెలివిజన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. భక్తులందరూ తమ తమ ఇళ్ల నుంచే ఈ అద్భుతాన్ని వీక్షించవచ్చు.
సూర్య తిలకం విశిష్టత
దశరధ రాజు తనయుడు శ్రీ రాముడు సూర్యవంశీయుడు. ఇక్ష్వాకు వంశ కుల దైవం ప్రత్యక్ష దైవం సూర్య నారాయణుడు. చైత్ర మాసం శుక్ల పక్షం 9వ రోజు మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముడు జన్మించాడని విశ్వాసం. సనాతన ధర్మంలో సూర్యుడిని శక్తికి మూలంగా, గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. సూర్యుడు తన కిరణాలతో శ్రీరామునికి తిలకం దిద్దడంతో రామునిలోని దైవత్వం మేల్కొంటుందని విశ్వాసం.
ఈ సందర్భంగా అయోధ్యలో వాల్మీకి రామాయణం, రామచరితమానస పారాయణలు, దుర్గా సప్తశతి విశేషంగా జరుగుతాయి. అలాగే 1 లక్ష మంత్రాలతో విశేష నైవేద్యాలు సమర్పిస్తారు. శ్రీరామనవమి సందర్భంగా జరుగనున్న ఈ విశేష కార్యక్రమాలను మనం కూడా కనులారా వీక్షిద్దాం. శ్రీరాముని అనుగ్రహానికి పాత్రులవుదాం. జై శ్రీరామ్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

