Solar Eclipse 2025 Visible In India : కొత్త ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం ఈ నెల 29వ తేదీన ఏర్పడనుంది. అయితే ఈ సూర్యగ్రహణం ఏయే ప్రాంతాల్లో కనిపిస్తుంది? సూర్యగ్రహణం సందర్భంగా గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ గ్రహణం వలన ఏర్పడనున్న శుభ అశుభ ఫలితాలను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
గ్రహణ కాలంలో జాగ్రత్తలు అవసరమా?
ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం మార్చి 29న ఏర్పడనుంది. సాధారణంగా గ్రహణం అనగానే అనేక సందేహాలు తలెత్తుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణకాలంలో చేయాల్సిన పరిహారాలు ఏంటి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు గ్రహణకాలంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమేనా! విజ్ఞానవేత్తలు ఏమి చెబుతున్నారు? ఈ ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రహణం ఎప్పుడు?
ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం మార్చి 29వ తేదీ శనివారం రోజున సంభవించనుంది. ఈ సూర్యగ్రహణం మార్చి 29న భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:16 గంటలకు ముగుస్తుంది. ఇది పాల్గుణ మాసం కృష్ణ పక్ష అమావాస్య రోజున సంభవించే పాక్షిక సూర్యగ్రహణం.
సూర్యగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా?
అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదని జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అనవసరమైన భయాందోళనలు గురి కావడం కానీ, అపోహలు, వదంతులు నమ్మవద్దని వారు సూచిస్తున్నారు.
ఇలా చేస్తే మంచిది!
ఏది ఏమైనా 29వ తేదీ శనివారం, అమావాస్య కలిసి వచ్చిన రోజు కాబట్టి ఈ రోజు శివారాధన చేయడం, శనిదేవుని తైలాభిషేకాలు చేయించుకోవడం, బ్రాహ్మణులకు నువ్వులు దానం చేయడం వంటివి చేయడం వలన గ్రహదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
పితృదేవతల ప్రీతి కోసం ఇలా చేద్దాం
అంతేకాదు అమావాస్య రోజు చేసే అన్నదానంతో పితృదేవతలు ప్రీతి చెందుతారని శాస్త్రం చెబుతోంది. అందుకే శనివారంతో కూడిన అమావాస్య కాబట్టి పితృదేవతలకు తర్పణాలు విడిచి ఆపై అన్నదానం చేయడం వలన పితృదేవతల అనుగ్రహంతో వంశాభివృద్ధి కలుగుతుంది.
ఈ పరిహారంతో ఐశ్వర్యప్రాప్తి
అలాగే ఈ రోజు కాకికి అన్నం పెట్టడం, నల్ల చీమలకు పంచదార వేయడం, రావి చెట్టుకింద ఆవనూనెతో దీపం పెట్టడం వలన ఆర్ధిక సమస్యలు అప్పుల బాధలు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. కాబట్టి గ్రహణం విషయంలో ఎలాంటి సందేహాలు, అపోహలు పెట్టుకోకుండా, వదంతులు నమ్మకుండా నిత్యపూజలు, దైవారాధనతో ప్రశాంతంగా ఉందాం.శుభం భూయాత్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.