Solar Eclipse 2025 Impact on Zodiac Signs: కొత్త ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం ఈ నెల 29వ తేదీన ఏర్పడనుంది. ఈ సంవత్సరం తొలి సూర్య గ్రహణం మార్చి 29వ తేదీ శనివారం రోజున సంభవించనుంది. భారత కాలమానం ప్రకారం ఈ సూర్యగ్రహణం మార్చి 29న మధ్యాహ్నం 2:20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:16 గంటలకు ముగుస్తుంది. ఇది పాల్గుణ మాసం కృష్ణ పక్ష అమావాస్య రోజున సంభవించే పాక్షిక సూర్యగ్రహణం. అయితే ద్వాదశ రాశులపై ఈ గ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది? సూర్యగ్రహణం రోజు పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మేషం(Aries): సూర్య గ్రహణ ప్రభావంతో మేష రాశి వారికి ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అలాగే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండమని సలహా ఇస్తున్నారు. అదే విధంగా వాహనాలు నడిపే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

వృషభం(Taurus): ఈ రాశి వారికి వ్యాపారం లేదా ఉద్యోగంలో చిన్న చిన్న ఎదురుదెబ్బలు తగులుతాయని, కానీ వాటిని పట్టుదల, సరైన ఆలోచనలతో అధిగమిస్తారని అంటున్నారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న వాగ్వాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

మిథునం(Gemini) : సూర్య గ్రహణం వల్ల ఈ రాశి వారికి వ్యాపారం లేదా ఉద్యోగంలో మంచి పురోగతి లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే వ్యక్తిగత అభివృద్ధికి దారితీసే కొత్త నెట్‌వర్కింగ్ అవకాశాలను పరిశీలించమని సలహా ఇస్తున్నారు. పెట్టుబడులు పెట్టే వారికి మంచి లాభాలొస్తాయి. మీ సామర్థ్యం పెరుగుతుంది. మీరు ఉన్నతాధికారులను మెప్పించే అవకాశం ఉంది. దీంతో మీరు లాభాలను ఆర్జించడంలో విజయం సాధిస్తారు.

కర్కాటకం(Cancer) : ఈ రాశి వారికి వ్యక్తిగతంగా, వృత్తి జీవితంలో అద్భుతమైన విజయాలు కలుగుతాయని అంటున్నారు. అలాగే మీరు వేరే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నా లేదా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా మంచి ఫలితాలు సాధిస్తారని చెబుతున్నారు.

సింహ రాశి(Leo) : సూర్య గ్రహణం కారణంగా సింహ రాశికి వారికి కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు, డబ్బు నష్టాలు, అస్థిరమైన ఉపాధి సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆకస్మిక నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిదని సూచిస్తున్నారు.

కన్య(Virgo): ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి సూర్య గ్రహణం ప్రభావం కొద్దిమేర ఉండే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అలాగే జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉందని, ఓపికగా, అవగాహనతో పని చేస్తే, సమస్యలను నివారించవచ్చని చెబుతున్నారు.

తుల(Libra): ఈ రాశి వారికి భార్యభర్తల మధ్య సత్సబంధాలు ఉంటాయని అంటున్నారు. అలాగే మీ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత శ్రద్ధ అవసరమని సూచిస్తున్నారు.

వృశ్చికం(Scorpio): ఈ సమయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ముఖ్యంగా ఒకరి కోసం హామీ ఇవ్వడం లేదా వేరొకరి వివాదంలో చిక్కుకోవడం ఇబ్బంది కలిగించవచ్చని చెబుతున్నారు. అలాగే ఆరోగ్యం, ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెబుతున్నారు.

ధనుస్సు(Sagittarius): ధనస్సు రాశి వారి చేసే పనిలో ఇబ్బందులు, ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ అడ్డంకులను అధిగమించడానికి ఓర్పు, సంయమనం అవసరమంటున్నారు. అనవసర వాదనల్లో కలుగజేసుకోకూడదని, ఒకవేళ మీ అభిప్రాయాన్ని చెప్పాల్సి వస్తే శాంతియుతంగా చెప్పమంటున్నారు.

మకరం(Capricorn): ఈ రాశి వారు పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని అంటున్నారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా మంచి అవకాశాలు లభించవచ్చని చెబుతున్నారు.

కుంభ రాశి(Aquarius): సూర్య గ్రహణం వల్ల ఈ రాశి వారికి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో సానుకూలత ఏర్పడుతుందని అంటున్నారు. అలాగే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లడమని, అనవసరమైన వివాదాల్లో చిక్కుకోవద్దని సలహా ఇస్తున్నారు. డబ్బుకు సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిదంటున్నారు.

మీనం(Pisces): ఈ రాశి వారు చాలా సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందని నిపుణులు అంటున్నారు. అలాగే ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అదే విధంగా ఉద్యోగులు ఆఫీసులో సమస్యలను ఎదుర్కొంటారని, ఏదైనా వివాదం కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
సూర్యగ్రహణం రోజు పాటించాల్సిన నియమాలు:
- సూర్యగ్రహణానికి రెండు గంటల ముందే ఆహారాన్ని తీసుకోవాలని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారాన్ని తీసుకోవద్దని చెబుతున్నారు.
- గ్రహణం మొదలైనప్పుడు, పూర్తైన తర్వాత స్నానం కచ్చితంగా చేయాలని చెబుతున్నారు. అలాగే వేడినీటితో స్నానం చేయకూడదని, చన్నీళ్ల స్నానం చేస్తే మంచిదంటున్నారు. రజస్వల దోషాలు ఉన్నవారు గ్రహణ సమయంలో స్నానం చేయాలని సూచిస్తున్నారు.
- పురుడు(ఎవరైనా జన్మించినప్పుడు), సూతకం(మైల)లో ఉన్నవారు కూడా స్నానం చేయాలని చెబుతున్నారు. ఈరోజున తలస్నానం చేయాలని, తలంటు స్నానం చేయొద్దని సూచిస్తున్నారు.
- గ్రహణ సమయంలో నిద్రపోతే అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. అలాగే గ్రహణం ముందు వండిన ఆహారాన్ని గ్రహణం పూర్తైన తర్వాత తినకూడదని చెబుతున్నారు. మళ్లీ వండుకుని అప్పుడు తినాలని సూచిస్తున్నారు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
మార్చి 29 శని అమావాస్య - ఇంట్లో ఈ ఒక్క "దీపం" వెలిగిస్తే భయంకరమైన శని దోషాలు తొలగిపోతాయి!