Vontimitta Kodanda Rama Swamy Temple : శ్రీరామనవమి రోజు ఇటు భద్రాచలం మొదలుకొని దేశవ్యాప్తంగా ఉన్న రామాలయాల్లో, ఊరు వాడా పందిళ్లల్లో సీతారాముల కల్యాణం వైభవంగా జరుగుతుంది. కానీ ఒక ఆలయంలో మాత్రం చైత్ర శుద్ధ చతుర్దశి రోజు సీతారాముల కల్యాణం జరుగుతుంది. ఆ క్షేత్రమేమిటో, ఆ విశేషాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
అధికారికంగా సీతారాముల కల్యాణం
తెలుగునాట రామాలయాలు అనేకం. ఇందులో పురాతన కాలం నుంచీ పూజలందుకునేవి కూడా వున్నాయి. వాటిలో అత్యంత పురాతనమైన ఆలయం ఒంటిమిట్ట కోదండ రామాలయం. ఆంధ్రప్రదేశ్లోని ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ప్రభుత్వ లాంఛనాలతో శ్రీ సీతారాముల కల్యాణం అధికారికంగా నిర్వహిస్తున్నారు.
రాములోరి కల్యాణం
భద్రాచలంలో శ్రీరామనవమి రోజు కల్యాణం జరిగితే ఒంటిమిట్టలో మాత్రం శ్రీరామనవమి నుంచి ఐదు రోజుల తర్వాత వచ్చే చైత్ర శుద్ధ చతుర్దశి రోజు సీతారాముల కల్యాణం జరుగుతుంది. ఈ నెల 11వ తేదీ ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాయలంలో సీతారాముల కల్యాణం జరుగుతుంది.
ఒంటిమిట్ట పేరు ఇందుకే!
ఒంటి అంటే ఒక అని అర్థం. ఒక మిట్టమీద నిర్మింపబడ్డ రామాలయం అవటంవల్ల ఈ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అని పేరు వచ్చిందని అంటారు. మరో కథనం ప్రకారం గతంలో చోర వృత్తిలో ఉన్న ఒంటుడు, మిట్టుడు అనే ఇద్దరు రామ భక్తులు ఈ ఆలయాన్ని నిర్మించారు. వారి పేరుతోనే ఈ ఆలయానికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందని అంటారు. అయితే ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత వారు తమ జీవితాలని అంతం చేసుకున్నారు. ఇప్పటికీ వారి శిలా విగ్రహాలు ఆలయ ప్రవేశ మార్గంలో చూడవచ్చు.
ఇదీ విశేషం!
ఒంటిమిట్ట క్షేత్రంలో గర్భాలయంలో ఆంజనేయస్వామి వుండరు. ఆయన్ని కలుసుకోవటానికి ముందే సీతారామ లక్ష్మణులు ఇక్కడ సంచరించారనీ, అందుకని ఆంజనేయస్వామి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠింపబడలేదని కొందరి అభిప్రాయం. వనవాస సమయంలో సీతారామ, లక్ష్మణులు ఇక్కడ సంచరిస్తూ ఉండగా సీతమ్మకి దాహం వేసింది. అప్పుడు శ్రీరామచంద్రుడు తన బాణంతో పాతాళ గంగను రప్పించాడు. ఆ తీర్థమే రామ తీర్థంగా ఇప్పటికీ అక్కడ వున్నది.
ఏక శిలా నగరం
అత్యంత పురాతనమైన ఈ ఆలయంలోని సీతారామ లక్ష్మణ విగ్రహాలు విడి విడిగా ఉన్నా ఏక రాతిలో చెక్కబడి ఉండడం విశేషం. అందుకే దీనికి ఏక శిలా నగరమనే పేరు వచ్చింది.
ఆలయ స్థల పురాణం
రామ లక్ష్మణులు చిన్న వయసులోనే కాక సీతా రామ కల్యాణం తర్వాత కూడా మృకండ మహర్షి, శృంగి మహర్షి కోరిక మీద యాగ రక్షణకి, దుష్ట శిక్షణకీ శ్రీరామ లక్ష్మణులు అంబులపొది, పిడిబాకు, కోదండం పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశారని ఒక కథనం. అందుకు సాక్షిగా ఆ మహర్షులు సీతా రామ లక్ష్మణుల విగ్రహాలను ఏక శిలలో చెక్కించారనీ, తర్వాత జాంబవంతుడు ఈ విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ చేశాడని ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది.
ఆలయ విశేషాలు
మూడు గోపురాలతో, విశాలమైన ఆవరణలో అలరారే ఈ ఆలయం ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్టి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలలో నిర్మించినట్లుగా తెలుస్తోంది.
ఆకట్టుకునే శిల్పకళా నైపుణ్యం
ఆలయంలోని మధ్య మండపంలో 32 స్తంబాలున్న రంగమంటపం వున్నది. సందర్శకులను ఆకట్టుకునే ఈ స్తంభాల మీద శిల్ప కళ చోళ, విజయనగర శిల్ప శైలిని పోలి ఉంటుంది. ఈ స్తంబాలపై రామాయణ, భారత కథలు చిత్రీకరించి ఉన్నాయి. గుడి ఎదురుగా సంజీవరాయ దేవాలయం, పక్కగా రథశాల, రథం వున్నాయి.
కవులు స్తుతించిన కోదండరాముడు
పోతన, అయ్యల రాజు రామభద్రుడు, ఉప్పు గుండూరు వేంకటకవి, వరకవి మొదలగు ఎందరో స్వామికి కవితార్చన చేసి తరించారు. అన్నమాచార్యుడు ఈ ఆలయాన్ని దర్శించి స్వామి మీద కొన్ని కీర్తనలు రచించారు.
రామ సేవలో తరించిన పెద్దలు
వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన శ్రీ వావిలకొలను సుబ్బారావు తన జీవితాన్ని కోదండరాముని సేవకు అంకితం చేసాడు. ఒంటిమిట్ట ఆలయ పునరుధ్ధరణ కోసం ఊరూరా భిక్షమెత్తి ఈ ఆలయానికి భూములు, భవనాలు, స్వామికి విలువైన ఆభరణాలు ఏర్పాటు చేశారు.
పూజోత్సవాలు
ఒంటిమిట్టలో చైత్ర శుధ్ధ నవమి నుంచి బహుళ విదియ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చైత్ర శుద్ధ చతుర్దశి రోజు జరిగే ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. అలాగే చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు రథోత్సవం కూడా ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలు వీక్షించడానికి ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.
కోదండరాముని కల్యాణం చూడడం పూర్వ జన్మ సుకృతమని శాస్త్రవచనం. ఈ నెల 11 వ తేదీ శుక్రవారం జరుగనున్న కోదండరాముని కల్యాణాన్ని ప్రత్యక్షంగా చూడలేని వారు ప్రసార మాధ్యమాలలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు.
మనం కూడా కోదండరాముని కల్యాణాన్ని వీక్షిద్దాం. సకల శుభాలు పొందుదాం.
జై శ్రీరామ్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.