Sankashtahara Chaturthi April 2025 : చేపట్టిన పనుల్లో తరచూ అవరోధాలతో విసిగి పోయారా! ముఖ్యమైన పనులు ఎంతకూ పూర్తి కావడం లేదా! క్లిష్టమైన పనులు కూడా సునాయాసంగా పూర్తి కావాలంటే ఏమి చేయాలో తెలుసా! సంకటాలను పోగొట్టే సంకష్ట గణపతి పూజ ఏ రోజు చేయాలి? సంకష్ట గణపతి పూజను ఎలా చేయాలి? తదితర వివరాల కోసం ఈ కథనం పూర్తిగా చదవండి.
విఘ్న వినాయకుడు
గణపతిని ప్రార్థిస్తే చేపట్టిన పనుల్లో విఘ్నాలు తొలగిపోతాయని విశ్వాసం. ముఖ్యంగా సంకష్ట చతుర్థి రోజు గణపతిని పూజిస్తే అసాధ్యం అనుకున్న పనులు కూడా అవలీలగా పూర్తవుతాయని శాస్త్రవచనం. వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణంలో సంకష్టగణపతి పూజను గురించిన ప్రస్తావన ఉంది. అసలు గణపతికి చవితి తిథికి ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం.
చవితి ప్రీతి గణపతి
ఒక నెలలో వచ్చే 30 తిథులలో గణపతికి చవితి తిథి అంటే ఎంతో ప్రీతి. ప్రతి నెలలో రెండుసార్లు చవితి తిథి వస్తుంది. అమావాస్య తరువాత వచ్చే చవితిని వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్ట చవితి అని అంటారు. వరద చతుర్థి రోజున చేసే వ్రతాన్ని వరద చతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకటహర చతుర్థి వ్రతం అంటారు. సంకటాలను అంటే కష్టాలను పోగొడుతుంది కాబట్టి ఈ వ్రతానికి సంకష్టహర చతుర్థి అనే పేరు కూడా ఉంది.
ఈ నెల సంకష్టహర చతుర్థి ఎప్పుడు?
ఏప్రిల్ 16వ తేదీ బుధవారం మధ్యాహ్నం 12:28 నిమిషాలకు చవితి తిథి మొదలై మరుసటి రోజు అంటే ఏప్రిల్ 17వ తేదీ గురువారం మధ్యాహ్నం 2:01 నిమిషాల వరకు ఉంది. సాధారణంగా మనం అన్ని పండుగలు సూర్యోదయం తిథిని అనుసరించి జరుపుకుంటే, సంకష్టహర చతుర్థి మాత్రం రాత్రి చవితి తిథి ఉన్న సమయంలో జరుపుకుంటాం. కాబట్టి ఏప్రిల్ 16వ తేదీ బుధవారం రోజునే సంకష్టహర చతుర్థి జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈసారి సంకష్ట చతుర్థి వినాయకునికి ప్రీతికరమైన బుధవారం రావడం మరింత విశేషమని పండితులు చెబుతున్నారు.
సంకష్టహర చతుర్థి పూజా విధానం
సంకష్ట గణపతి పూజ ఏ మాసంలో అయినా బహుళ చవితి నాడు మొదలు పెట్టాలి. సూర్యోదయానికి ముందే నిద్ర లేచి అభ్యంగన స్నానం చేసి మన మనసులో ఉన్న కోరికను ఆ స్వామికి చెప్పుకొని ఈ రోజు సంకష్ట గణపతి వ్రతం చేస్తాను అని సంకల్పించుకోవాలి.
గణనాథునికి ముడుపుల మూట
సంకష్టహర చతుర్థి వ్రతం చేసుకునే వారు సూర్యోదయంతోనే నిద్ర లేచి, తలారా స్నానం చేసి పూజామందిరాన్ని శుభ్రం చేసుకుని ముందుగా విఘ్నేశ్వర బియ్యం కట్టుకోవాలి. ఎరుపు రంగు వస్త్రంలో అయిదు పిడికిళ్లు బియ్యం వేసి ఒక తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ ఉంచి మన మనసులోని కోరికను చెప్పి విఘ్నేశ్వర బియ్యాన్ని ముడుపు మూట కట్టి ఉంచుకోవాలి. ఈ ముడుపు మూటను గణపతి ఎదురుగా ఉంచి ధూపదీపాలతో పూజించి, సంకటనాశన గణేశ స్తోత్రం చదువుకొని స్వామికి కొబ్బరికాయ, అరటిపండ్లు నివేదించి నిత్య పూజాదికాలు ముగించుకోవాలి. రోజంతా ఉపవాసం ఉండాలి.
గణపతి ఆలయ సందర్శన
ఇంట్లో లఘు పూజ పూర్తి అయ్యాక సమీపంలోని గణపతి ఆలయాన్ని సందర్శించి గణపతి హోమాన్ని చేయించుకుంటే మంచిది. వీలు కాని వారు స్వామికి గరిక పూజ అయినా చేయించవచ్చు.
గణపతికి చంద్రోదయ పూజ
సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి, తిరిగి స్నానం చేసి శుచియై ఇంట్లోని గణపతి ప్రతిమకు పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత గణపతి అష్టోత్తర శతనామ పూజ చేయాలి. గణపతికి ప్రీతిపాత్రమైన ఉండ్రాళ్లు, కుడుములు, బెల్లం, కొబ్బరికాయ, అరటిపండ్లు వంటి నైవేద్యాలను సమర్పించాలి. చివరగా మంత్రపుష్పం చదువుకొని స్వామి సమక్షంలో గుంజిళ్లు తీయాలి. వినాయకునికి కర్పూర నీరాజనం ఇచ్చి సంకటాలను పోగొట్టమని వేడుకోవాలి. ఇలా పూజ శాస్త్రోక్తంగా పూర్తి చేసుకున్న తర్వాత సంకష్ట గణపతి వ్రత కథను చదువుకోవాలి.
దేవాలయంలో గణపతి వ్రతం
ఇంట్లో నియమ నిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరించలేని వారు వినాయకుని ఆలయంలో ప్రతి బహుళ చవితి రోజు జరిగే సంకష్ట గణపతి వ్రత పూజను జరిపించుకుంటే కష్టాలు తొలగిపోతాయి.
చంద్ర దర్శనం-వ్రతం సమాప్తం
ఇంట్లో చేసుకున్నా దేవాలయంలో చేసుకున్నా పూజ పూర్తి అయిన తరువాత తప్పనిసరిగా చంద్ర దర్శనం చేసుకొని శిరస్సున అక్షింతలు వేసుకోవాలి. అప్పుడే ఈ వ్రత ఫలం దక్కుతుంది.
సంకష్ట గణపతి వ్రతాన్ని ఎన్ని నెలలు చేయాలి?
సంకష్ట గణపతి వ్రతాన్ని మన సమయానుకూలంగా 3, 5, 11 లేదా 21 నెలలపాటు ఆచరించవచ్చు. నియమనిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే సత్వర ఫలితాలు పొందవచ్చు. ఎన్ని నెలలు అనుకుంటే అన్ని నెలలు పూర్తయ్యాక ముడుపు కట్టిన బియ్యాన్ని రవ్వ పట్టించి ఆ రవ్వతో ఉండ్రాళ్లు చేసి వినాయకునికి నైవేద్యం పెట్టి వాటిని ప్రసాదంగా అందరికీ పంచిపెట్టాలి. - ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.