Sankashtahara Chaturthi 2025 : ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున సంకటహర చతుర్థిని నిర్వహిస్తారు. దీనినే 'సంకష్టహర చతుర్థి' లేదా 'సంకష్టి చతుర్థి' అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజున విఘ్నాలు తొలగించే గణనాథుడిని నిండుమనసుతో పూజిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయని గణపతి పురాణం పేర్కొంటుంది. ఇదిలా ఉంటే చైత్ర మాసంలో ఏప్రిల్ 16వ తేదీ, బుధవారం రోజు సంకష్టహర చతుర్థి వస్తోంది. మరి, ఈ రోజు గణపతిని ఏ విధంగా పూజించాలి? ఎలాంటి విధివిధానాలు పాటిస్తే ఏడాదంతా సమస్త శుభాలు చేకూరతాయి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అలాగే, బుధవారం వినాయకుడికి ఇష్టమైన రోజు. అయితే, ఏప్రిల్ 16వ తేదీ సంకష్టహర చతుర్థి నాడు ఇవి రెండు కలిసి వస్తుండడంతో దీన్ని చాలా శక్తివంతమైనదిగా చెప్పుకోవాలంటున్నారు ప్రముఖ జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్. ముఖ్యంగా ఈ రోజు మరకత గణపతిని పూజించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను సొంతం చేసుకోవచ్చంటున్నారు. వినాయకుడికి అనేక రకాలైన విగ్రహాలు ఉంటాయి. అందులో ఆకుపచ్చ రంగు ఉండే విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని బుధవారంతో కూడిన సంకష్ట చతుర్థి రోజు పూజిస్తే సమస్త శుభాలు సిద్ధిస్తాయని చెబుతున్నారు.
ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో మరకత గణపతి ఉంటే చాలా మంచిది. ఈ విగ్రహాన్ని ప్రతిష్టించుకొని పూజించడం ద్వారా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు. బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి రోజు మరకత గణపతిని ఇంట్లో ప్రతిష్ఠించుకొని కొబ్బరి నూనెతో దీపం పెట్టి, గరిక పోచలతో పూజ చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందుతారని చెబుతున్నారు. అలాగే, ఈ పవిత్రమైన రోజు 21 జిల్లేడు ఆకుల పూజ చేసినా సంకటాలు తొలగి బ్రహ్మాండమైన శుభ ఫలితాలు సిద్ధిస్తాయని అంటున్నారు.
పెళ్లిళ్లు కుదిర్చే 'ఇడగుంజి' వినాయకుడు- ఈ క్షేత్రం ఎక్కడుందో తెలుసా?
21 జిల్లేడు ఆకుల పూజ ఎలా చేయాలంటే?
- సాయంకాలం పూట శుభ్రంగా స్నానమాచరించి ఈ పూజను నిర్వహించాలి. ఇందుకోసం పూజా మందిరంలో శుభ్రంగా కడిగిన ఒక పీటను ఏర్పాటు చేసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి.
- తర్వాత బియ్యప్పిండితో ముగ్గు వేసి దానిపై శుభ్రంగా కడిగి, గంధం బొట్లు పెట్టిన 21 జిల్లేడు ఆకులను ఉంచాలి.
- ఆ జిల్లేడు ఆకుల మధ్యలో గణపతి విగ్రహం ప్రతిష్టించుకోవాలి. మరకత గణపతి విగ్రహం లేదా మీ ఇంట్లో ఏ వినాయకుడి విగ్రహం ఉంటే దాన్ని అక్కడ ఉంచాలి.
- అనంతరం ఆ విగ్రహానికి జిల్లేడు పూల మాలను అలంకరించుకోవాలి. అలాగే, జిల్లేడు పూలతో వినాయకుడిని పూజించాలి.
- "నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః" అనే మంత్రాన్ని జపిస్తూ గణపతి పూజ చేసుకోవాలి. దీన్నే 21 జిల్లేడు ఆకుల పూజ అని అంటారు.
- ఆ తర్వాత గణపతికి ఉండ్రాళ్ల పాయసం నైవేద్యంగా సమర్పించాలి.
- సంకష్టహర చతుర్థి రోజు ఈ పూజ నిర్వహిస్తే గణపయ్య సంపూర్ణ అనుగ్రహంతో ఏడాదంతా బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కలుగుతాయంటున్నారు జ్యోతిష్య నిపుణులు మాచిరాజు. జీవితంలో అనుకున్నవన్ని లభిస్తాయని చెబుతున్నారు. అంతేకాకుండా, చేసే పనులలో సంకటాలు తొలగి విజయాలు చేకూరుతాయంటున్నారు.
- అలాగే, దేవాలయానికి వెళితే గరిక పోచలు కలిపిన నీటితో గణపతికి అభిషేకం జరిపించండి. ఇలా చేసినా చాలా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధిస్తాయంటున్నారు.

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
"కర్పూరం" చెట్టు మీ ఇంట్లో ఉందా? - ఇలా ఈజీగా పెంచుకోవచ్చు! - భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్త!
జాతకంలో గురు దోషం ఉందా? గురువారం ఇలా చేస్తే అన్ని పనుల్లో విజయం మీ వెంటే!