Sankashtahara Chaturthi 2025 in Telugu : బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా కొన్ని ప్రత్యేక విధివిధానాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. 'ఏప్రిల్ 16 బుధవారం సంకష్టహర చుతుర్థి వచ్చింది. బుధవారం వినాయకుడికి ఇష్టమైన రోజు. అలాగే సంకష్టహార చతుర్థి తిథి. ఈ రెండు కలిసి రావడంతో బుధవారం శక్తివంతమైన రోజుగా చెప్పుకోవచ్చు.
వినాయకుడికి అనేక విగ్రహాలుంటాయి. అయితే, ఈ రోజున మరకత గణపతిని పూజిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఆకు పచ్చ రంగులో ఉండే విగ్రహాన్ని సంకష్టహర చుతుర్థి రోజున పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ మరకత గణపతి ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో పెట్టుకుంటే చాలా మంచిది. మరకత గణపతిని పూజ గదిలో పెట్టుకుంటే పిల్లలు బ్రహ్మాండంగా చదువుతారు. మంచి ర్యాంకులు వస్తాయి. ఉద్యోగం లేని వారికి వారి అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. సంకష్టహర చతుర్థి తిథి రోజు, మరకత గణపతిని ఇంట్లో ప్రతిష్ఠించుకొని కొబ్బరి నూనెతో దీపం పెట్టి, గరిక పోచలతో పూజ చేయాలి. ఇలా చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందువచ్చు. అలాగే, ఈ పవిత్రమైన రోజు 21 జిల్లేడు ఆకుల పూజ చేస్తే కష్టాలు తొలగిపోయి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి.' అని మాచిరాజు వెల్లడించారు.
జిల్లేడు ఆకుల పూజ విధానం
- సంకష్టహర చతుర్థి తిథి రోజు సాయంకాలం పూట స్నానం చేసిన తర్వాత ఈ పూజను నిర్వహించాలి. ఇందుకోసం పూజా మందిరంలో శుభ్రంగా కడిగిన ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి. ఆపై పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి.
- అనంతరం బియ్యం పిండితో ముగ్గు వేయాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి, గంధం బొట్లు పెట్టిన 21 జిల్లేడు ఆకులను ఉంచాలి.
- ఆ జిల్లేడు ఆకుల మధ్యలో వినాయక విగ్రహం ప్రతిష్టించాలి. మరకత గణపతి విగ్రహం లేదా మీ పూజగదిలో ఏ వినాయకుడి విగ్రహం ఉంటే దాన్ని అక్కడ పెట్టాలి.
- ఇప్పుడు ఆ విగ్రహానికి జిల్లేడు పూల మాలను అలంకరించాలి. అలాగే, జిల్లేడు పూలతో గణపతిని పూజించాలి.
- "నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః" అనే మంత్రాన్ని స్మరిస్తూ వినాయక పూజ చేయాలి. దీనిని '21 జిల్లేడు ఆకుల పూజ' అని పిలుస్తారు.
- పూజ అనంతరం గణపతికి ఉండ్రాళ్ల పాయసం నైవేద్యంగా సమర్పించాలి.

బుధవారం రోజు ఈ పూజ చేస్తే వినాయకుడి సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చు. అలాగే, ఆలయానికి వెళితే అక్కడ గరిక పోచలు కలిపిన నీటితో వినాయకుడికి అభిషేకం జరిపించండి. ఇలా చేసినా చాలా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధిస్తాయని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు.
ముఖ్య గమనిక : సంకష్టహర చతుర్థి తిథి, జిల్లేడు ఆకుల పూజా విధానం వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
మీరు ఎప్పుడైనా గమనించారా! - శివుడి తలపై చంద్రుడు ఎందుకు ఉంటాడో తెలుసా?
"శివుడికి ఇష్టమైన పువ్వులు ఏమిటో తెలుసా? - జిల్లేడు మాత్రం కాదు - వీటితో పూజిస్తే అష్టైశ్వర్యాలు"