Mesha Sankranthi 2025 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొత్తం 12 రాశులు ఉన్నాయి. ఇందులో సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో సంచరిస్తే ఆ రాశి సంక్రమణంగా వ్యవహరిస్తారు. సూర్యుడు మీన రాశి నుంచి మేష రాశిలోకి ప్రవేశించడాన్ని మేష సంక్రమణం అంటారు. ఈ సందర్భంగా మేష సంక్రమణం ఎప్పుడు జరుగనుంది? ఆ రోజు పాటించాల్సిన పరిహారాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
మేష సంక్రమణం ఎప్పుడు?
శ్రీ విశ్వావసు నామ సంవత్సర చైత్ర పౌర్ణమి తరువాత వచ్చే పాడ్యమి రోజు, ఆదివారం తెల్లవారుఝామున అంటే తెల్లవారితే సోమవారం అనగా తేది ఏప్రిల్ 13వ తేదీ రాత్రి, 14వ తేదీ తెల్లవారుజామున 3-23 గంటలకు సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశిస్తున్నాడు.
రెండు పండుగలు ఒకే రోజు
రాశులలో మొదటి రాశి అయిన మేష రాశిలోకి సూర్య భగవానుడు ప్రవేశించిన పవిత్రమైన రోజును కొన్ని ప్రాంతాలలో నూతన సంవత్సరానికి ఆరంభ సూచికగా భావిస్తారు. ఈ పవిత్రమైన రోజును తమిళనాడులో 'పుతందు' అని, కేరళలో 'విషు' అని, ఒడిశాలో 'పనా' అనే పేరిట పండుగలు జరుపుకుంటారు. బెంగాలీలో సౌర నూతన సంవత్సరాన్ని పోయిలా బైశాఖిగా జరుపుకుంటారు.
మేష సంక్రాంతి విశిష్టత
హిందూ పురాణాల ప్రకారం, మేష సంక్రాంతి రోజున పవిత్రమైన నదుల్లో స్నానం చేసి, పూజలు, ప్రార్థనలు చేయడాన్ని శుభప్రదంగా భావిస్తారు.
మేష సంక్రాంతి పూజా విధానం
మేష సంక్రాంతి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. పవిత్రమైన నదిలో పుణ్య స్నానం ఆచరించాలి. నదీస్నానం చేసే అవకాశం లేని వారు స్నానం చేసే నీటిలో పుణ్య నదులను ఆవాహన చేసుకొని స్నానం చేయాలి. సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఇష్ట దైవాన్ని ప్రార్థించాలి. ఈ పవిత్రమైన రోజున హవనం, హోమం నిర్వహించడం వలన ఆరోగ్య ఐశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. ముఖ్యంగా కొత్త విషయాలు, కొత్త లక్ష్యాలతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించేందుకు మేష సంక్రాంతి అత్యంత పవిత్రమైనదని విశ్వాసం.
మేష సంక్రమణ రోజు ఈ పరిహారాలు తప్పకుండా పాటించాలి
- మేష సంక్రాంతి రోజున ఒక రాగి పాత్రలో నీరు తీసుకుని అందులో ఎర్రని పువ్వులు వేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి.
- బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్రదానం చేయాలి. ముఖ్యంగా ఈ రోజు గోధుమలు దానం చేయడం మంచిది.
- గోమాతకు గోధుమ పిండితో చేసిన చపాతీలు ఆహారంగా సమర్పించాలి.
- అలాగే ఈ రోజు పితృదేవతలకు తర్పణాలు వదలడం వలన పితృ దోషాలు తొలగిపోతాయని విశ్వాసం.
శుభం భూయాత్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.