Tumburu Theertha Mukkoti : పురాణ ప్రాశస్త్యం ప్రకారం తిరుమల శేషగిరుల్లో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉన్నాయని ప్రతీతి. ఈ తీర్థాల్లో ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య, ముక్తి ప్రదాయాన్ని కలిగించేవి ముఖ్యంగా ఏడు తీర్ధాలు. అవి స్వామివారి పుష్కరిణి, కుమారధార, తుంబుర తీర్ధం, రామకృష్ణ తీర్ధం, ఆకాశగంగ, పాపవినాశనం, పాండవ తీర్థాలు. ఈ నెల 12వ తేదీన తిరుమలలో తుంబురు తీర్థ ముక్కోటి జరుగనున్న నేపథ్యంలో ఆ తీర్ధ విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
తుంబురు తీర్థం ఎక్కడ ఉంది?
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి దాదాపుగా 12 కిలోమీటర్ల దూరంలో తుంబురు తీర్థం వెలసి ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడ ముక్కోటి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 12 వ తేదీ తుంబురు తీర్ధ ముక్కోటిని ఘనంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
తుంబురు తీర్థ ముక్కోటి అంటే?
తిరుమల గిరుల్లోని పుణ్య తీర్థాల్లో సంవత్సరానికి ఒకసారి కొన్ని పుణ్యఘడియలు ప్రవేశిస్తాయి. ఈ సందర్భంగా ఆయా తీర్థాల్లో ముక్కోటి ఉత్సవాలు నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం.
ముక్తి దాయకం తుంబుర తీర్థ స్నానం
తుంబుర తీర్ధంలో ముక్కోటి పుణ్యఘడియల్లో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగి ముక్తి కలుగుతుందని పురాణ వైశిష్ట్యం. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబురు తీర్థ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భక్తులు భావిస్తారు.
తుంబుర తీర్థం విశిష్టత
తుంబుర తీర్థానికి మరొక పేరు కూడా ఉంది. గోన తీర్థంగా పిలిచే ఈ ప్రదేశంలోనే తుంబురుడు తపస్సు చేశాడని పురాణాలు చెప్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో తుంబురు కోన కొండ రెండుగా చీలి దారి ఇచ్చినట్లు ప్రకృతి అందాలతో తుంబురు తీర్థం కనువిందు చేస్తుంది. నారదుడు స్వామివారిపై అనర్గళంగా గీతాలు పాడడంతో అలిగిన తుంబురుడు వెనక్కి తగ్గి ఈ తీర్థంలోనే కూర్చుండి పోతారని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో స్వయంగా వేంకటేశ్వర స్వామి వెళ్లి తుంబురుడిని బుజ్జగించారని, అందుకే ఆ ప్రాంతానికి తుంబుర తీర్థంగా పేరు గాంచిందని స్థల పురాణం. శ్రీవారి పరమ భక్తురాలైన తరిగొండ వెంగమాంబకు తుంబురు తీర్థంలోనే స్వామివారు సాక్షాత్కరించారని ప్రసిద్ధి.
పూర్వజన్మ సుకృతం
తుంబురు తీర్థ ముక్కోటి పర్వదినాన తిరుమల నుంచి ఉత్సవమూర్తులను మేళతాళాలతో మాడవీధులలో ఊరేగించి అనంతరం ఊరేగింపుగా తుంబుర తీర్థానికి తీసుకెళ్తారు. అక్కడ వైఖానస ఆగమ పద్ధతిలో పూజలు నిర్వహించి భక్తులకు తీర్ధప్రసాదాలు పంపిణి చేస్తారు. తీర్థ స్నానమాచరించి, స్వామివారిని దర్శించుకుని దానధర్మాలు చేస్తే ముక్తి కలుగుతుందని పురాణ వచనం. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబురు తీర్థ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భక్తులు భావిస్తారు. తుంబుర తీర్ధ ముక్కోటిలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు.
టీటీడీ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనే ఈ ముక్కోటిలో మనం కూడా పాలుపంచుకుందాం ఆ శ్రీనివాసుని అనుగ్రహానికి పాత్రులవుదాం.
ఓం నమో వేంకటేశాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.