Kanya Sankramanam Pooja Vidhanam In Telugu : సూర్యుడు ప్రతినెలా ఒక్కో రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు. సూర్యుడు భాద్రపద మాసంలో కన్య రాశిలోకి ప్రవేశించనున్న శుభ సందర్భాన్ని కన్యా సంక్రమణం అంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, కన్యా సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజు దానధర్మాలు, జపం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఆ విశేషాలేమిటో ఇప్పుడు చూద్దాం.
కన్యా సంక్రమణం ఎప్పుడు?
తెలుగు పంచాంగం ప్రకారం ఈ నెల 16వ తేదీ సోమవారం రాత్రి 7:43 నిమిషాలకు సూర్యుడు సింహ రాశి నుంచి కన్య రాశిలోకి ప్రవేశించనున్నాడు.
పరమ పవిత్రం నదీ స్నానం
కన్యా సంక్రమణం సందర్భంగా భక్తులు శరీర శుద్ధి కోసం, మనఃశుద్ధి కోసం, జన్మాంతర పాపాలను తొలగించడానికి పవిత్ర జలాల్లో స్నానం చేయడం సంప్రదాయం. అంతేకాదు ఈ రోజు చిన్నపాటి చెరువులోనైనా స్నానం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుందని శాస్త్రవచనం.
కన్యా సంక్రమణం విశిష్టత
కన్యా సంక్రమణం ఎంతో విశిష్టమైనది. ఈ పవిత్రమైన రోజున సూర్యభగవానుడిని పూజించడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని చాలా మంది నమ్మకం. ఈ రోజు పూర్వీకులకు పిండ ప్రదానం చేసి, తర్పణం, శ్రాద్ధం వంటి ఆచారాలు నిర్వహిస్తే పితృదేవతలకు సద్గతులు కలుగుతాయని నమ్మకం.
కన్యా సంక్రమణం రోజు ఏ పూజలు చేయాలి?
కన్యా సంక్రమణం రోజు ధార్మిక కార్యాలు, పూజలు, జపం చేయడం వల్ల పుణ్య ఫలాలు దక్కుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో సూర్యుడు బలహీనంగా ఉంటే వృత్తి పరంగా అనేక సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కన్యా సంక్రమణం రోజు చేసే స్నాన దాన జపాల వల్ల జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది. సమస్యలు తగ్గుముఖం పడతాయి.
ఈ దానాలు శ్రేష్టం
కన్యా సంక్రమణం రోజు ఎర్రటి దుస్తులు, నెయ్యి, బెల్లం, గోధుమలు, రాగి మొదలైన వాటిని దానం చేయడం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహంతో కుటుంబ శ్రేయస్సు కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రానున్న కన్యా సంక్రమణం రోజు మనం కూడా శాస్త్రంలో సూచించిన ఆచారాలను పాటిద్దాం. అవరోధాలను తొలగించుకుందాం. శుభం భూయాత్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
వామన అవతారానికి ఉన్న ప్రత్యేకతే వేరు! విష్ణుమూర్తి అసలెందుకు స్వీకరించారు? - Vamana Jayanti 2024