Jyeshtha Gauri Vratham 2024 : వ్యాస భగవానుడు రచించిన భవిష్య పురాణం ప్రకారం భాద్రపద మాసంలో జ్యేష్ఠ నక్షత్రం ఉన్న రోజున జ్యేష్ఠ గౌరీ పూజను చేసుకోవాలి. ఈ ఏడాది సెప్టెంబర్ 11వ తేదీ బుధవారం రోజు జ్యేష్ఠ్య గౌరీ పూజను చేసుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు.
జ్యేష్ఠ గౌరీ పూజ ఎవరు చేసుకోవాలి?
వివాహం కాని అమ్మాయిలు మంచి భర్త కోసం, అలాగే వివాహితులు దీర్ఘ సుమంగళి తనం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
జ్యేష్ఠ గౌరీ పూజ విశిష్టత
శివ పార్వతులు అనుగ్రహం కోసం చేసే జ్యేష్ఠ గౌరీ పూజ ఏ రోజైతే జ్యేష నక్షత్రం పూర్తిగా ఉంటుందో ఆ రోజు చేయాలి. గౌరీ పూజను తరచుగా గుడిలో నిర్వహిస్తారు. అయితే కొంతమంది ఇంట్లో కూడా ఈ పూజ చేస్తారు. ఈ పూజను ఎక్కువగా మహారాష్ట్రలో మరాఠీలు చేస్తారు.
మూడు రోజుల పూజ
జ్యేష్ఠ గౌరీ పూజ మూడు రోజుల పాటు చేయాల్సి ఉంటుంది. మొదటి రోజు గౌరీదేవిని ఆవాహన చేయాలంటే ఇంటికి తెచ్చుకోవాలి. రెండవ రోజు గౌరీదేవిని శాస్త్రోక్తంగా పూజించి మహా నైవేద్యాన్ని సమర్పించాలి. మూడవరోజు గౌరీ దేవి నిమజ్జనం చేయాలి. ఈ పూజలో ముఖ్యంగా 16 సంఖ్యకు ప్రాధాన్యం ఉంటుంది. అంటే 16 దీపాలు వెలిగించాలి. 16 రకాల నైవేద్యాలు సమర్పించాలి.
జ్యేష్ఠ గౌరీ పూజ విధానం
మొదటిరోజు
జ్యేష్ఠ గౌరీ చేసుకునే వారు ఉదయాన్నే నిద్రలేచి, శుచియై పూజ మందిరం శుభ్రం చేసుకొని గౌరీదేవి ప్రతిమను ఇంటికి తెచ్చుకోవాలి. కొన్ని ప్రాంతాలలో ఈ రోజు జలదేవత గంగాదేవిని పూజించే ఆచారం కూడా ఉంది.
రెండోరోజు
రెండోరోజు సూర్యోదయంతో నిద్రలేచి శుచియై శివపార్వతుల చిత్రపటాలను గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి. ఆవు నేతితో దీపారాధన చేయాలి. ముందుగా గణపతి పూజ చేసుకోవాలి. తర్వాత శివపార్వతుల చిత్రపటాలను మందారాలు, చేమంతులు, కలువ పూలతో అలంకరించుకోవాలి. గౌరీ పూజ మొదలు పెట్టే ముందు పసుపుతో గౌరీదేవిని తయారు చేయాలి. గౌరీ దేవిపై అక్షింతలు వేస్తూ అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. మహారాష్ట్ర ప్రాంతం వారు శ్రీమహాలక్ష్మినే గౌరీ దేవిగా భావించి పూజిస్తారు. గంగాజలంతో శివుని అభిషేకించాలి. పిండివంటలు, పండ్లు, కొబ్బరికాయలు నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం గౌరీదేవికి మంగళ హారతులు ఇవ్వాలి. ఒక ముత్తైదువుకు చీర, రవికె పసుపు కుంకుమలతో వాయనం ఇవ్వాలి. పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండాలి.
మూడోరోజు
మూడోరోజు గౌరీదేవికి యథాశక్తి పూజించి సమీపంలోని నదీ జలాల్లో కానీ చెరువులో కానీ నిమజ్జనం చేయాలి.
ఈ దానాలు శ్రేష్టం
ఈ రోజు వస్త్రదానం అన్నదానం, వెండితో కానీ, రాగితో కానీ, మట్టితో కానీ తయారు చేసిన ఆవుదూడలను దానం చేయాలి.
జ్యేష్ఠ గౌరీ పూజఫలం
భక్తిశ్రద్ధలతో జ్యేష్ఠ గౌరీ పూజ చేసినట్లయితే, వైవాహిక జీవితంలో ఏర్పడిన సమస్యలు తొలగిపోతాయి. అలాగే పెళ్లికాని యువతులు గౌరీ దేవి అనుగ్రహంతో మంచి భర్తను పొందుతారు.
ఓం శ్రీ సర్వమంగళా దేవ్యై నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.