Hanuman Jayanthi 2025 in Telugu : రామ భక్తులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న హనుమాన్ జయంతి వచ్చేసింది. ఏప్రిల్ 12వ తేదీ శనివారం రోజున దేశ వ్యాప్తంగా హనుమాన్ జయంతి పండగను ఘనంగా జరుపుకోనున్నారు. చైత్ర పౌర్ణమి, హనుమత్ విజయోత్సవం సందర్భంగా కొన్ని విధివిధానాలు పాటించాలని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం.
చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని 'మహా చైత్రి' అనే పేరుతో పిలుస్తారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 12 శనివారం రోజున చైత్ర పౌర్ణమి వచ్చింది. మహా చైత్రి రోజున చిన్న జపం చేసినా, చిన్న దానం చేసినా కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. కాబట్టి, ఆ రోజు చేసే జపం లేదా దానం, దేవాలయ దర్శనం, స్తోత్ర పఠనం కొన్ని వేల రెట్లు శుభ ఫలితాలను కలగజేస్తుందని అన్నారు.

సముద్ర స్నానం :
చైత్ర పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేయడం చాలా శుభ ఫలితాలను అందిస్తుంది. దీనివల్ల దృష్టి దోషాలు, శత్రు బాధలు అన్ని తొలగిపోతాయి. స్నానం ఆచరించిన అనంతరం ఒక కరక్కాయ సముద్రంలో వేస్తే ఏడాదిపాటు దృష్టి దోషాలు, శత్రు బాధలు అన్ని తొలగిపోతాయని మాచిరాజు తెలిపారు.
సత్యనారాయణ స్వామి వ్రతం :
చైత్ర పౌర్ణమి రోజున రంగు రంగుల వస్త్రాలను దానం చేయడం ద్వారా నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. అదృష్టం త్వరగా కలిసి వస్తుంది. అలాగే శివపార్వతులకు ఆ రోజు కల్యాణం చేయిస్తే ఇంటికి చాలా శుభాలు కలుగుతాయి. అలా శివపార్వతుల కల్యాణం చేయించడం వీలు కాకపోతే దగ్గర్లోని ఆలయానికి వెళ్లి శివపార్వతులను దర్శనం చేసుకోవచ్చు. చైత్ర పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిది. ఎప్పుడైనా పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం చేసుకుంటే శుభం కలుగుతుంది.

ఆంజనేయ స్వామి ఆలయంలో :
కొన్ని ప్రాంతాల్లో ఈ చైత్ర పౌర్ణమిని హనుమత్ జయంతిగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా మంచి జరుగుతుంది. ఆంజనేయ స్వామి చిత్రపటానికి గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ బొట్టు పెడితే మంచిది. అలాగే ఆంజనేయ స్వామి దగ్గర జిల్లేడు వత్తులతో దీపం పెడితే శత్రు బాధలు, దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. ఐదు జిల్లేడు వత్తులు వేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. స్వామి వారిని ఎర్రటి పుష్పాలతో పూజించండి. అప్పాలు నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేయడం ద్వారా ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందవచ్చని మాచిరాజు తెలిపారు.
హనుమత్ విజయోత్సవం రోజున ఒక శ్లోకం తప్పకుండా చదవాలి.
'అసాధ్య సాధక స్వామిన్
అసాధ్యం తవకిం వద
రామదూత కృపా సింధో
మత్కార్యం సాధయ ప్రభో'.
ఈ శ్లోకం పఠిస్తే మంచిది. శ్లోకం చదువుకోలేని వారు ఆ రోజు ఒక మంత్రం జపించాలి. 'ఓం నమః హనుమంతాయ ఆవేశయ ఆవేశయ స్వాహా' అనే మంత్రం చదవాలి.
ఈ మంత్రం కలియగంలో కల్ప వృక్షం లాంటిదని మాచిరాజు చెప్పారు. హనుమత్ విజయోత్సవం సందర్భంగా ఈ విధివిధానాలు పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని మాచిరాజు తెలిపారు.
"శివుడికి ఇష్టమైన పువ్వులు ఏమిటో తెలుసా? - జిల్లేడు మాత్రం కాదు - వీటితో పూజిస్తే అష్టైశ్వర్యాలు"
మీరు ఎప్పుడైనా గమనించారా! - శివుడి తలపై చంద్రుడు ఎందుకు ఉంటాడో తెలుసా?