Hanuman Jayanti 2025 : శ్రీరామనవమి తరువాత సరిగ్గా ఆరు రోజులకు హనుమద్ విజయోత్సవం, హనుమజ్జయంతిని జరుపుకుంటాం. ఈ సందర్భంగా హనుమంతుని జన్మ విశేషాలు గురించి, హనుమత్ విజయోత్సవం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
హనుమమంతుని జనన గాథలు
హనుమంతుని జననం గురించి శ్రీ రామాయణం, శివపురాణం వంటి గ్రంథాలలో ఎన్నో కథలు ఉన్నాయి.
కంబ రామాయణ గాథ- పుంజికస్థలకు బృహస్పతి శాపం
ఒకసారి ఇంద్రలోకంలో పుంజికస్థల అనే అప్సరస దేవగురువైన బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగాలు చేయసాగింది. ఎంతో అసందర్భంగా, వికారంగా ఉన్న ఆమె హావభావాలకు బృహస్పతి ఆగ్రహించి పుంజికస్థలను భూలోకంలో వానర కాంతగా జన్మించమని శపించాడట!
శాపానికి ఉపశమనం
బృహస్పతి శాపానికి భయపడిపోయిన పుంజికస్థల తన తప్పిదాన్ని మన్నించి శాపానికి ఉపశమనం చెప్పమని బృహస్పతిని పరిపరివిధాలుగా ప్రార్థించింది. అప్పుడు బృహస్పతి సంతసించి పుంజికస్థల భూలోకంలో హనుమంతునికి జన్మ ఇచ్చిన తర్వాత తిరిగి ఇంద్రలోకానికి రాగలదని శాపానికి ఉపశమనం చెబుతాడు.
పుంజికస్థల వానరకాంతగా జననం
బృహస్పతి శాపానుసారం పుంజికస్థల భూలోకంలో అంజనాదేవి పేరుతో వానర కాంతగా జన్మిస్తుంది. యుక్త వయసు వచ్చాక కేసరి అనే అందమైన వానరాన్ని ప్రేమించి పెళ్లాడుతుంది.
ఆంజనేయ స్వామి జననం
అంజనాదేవి, కేసరి దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వారు మంచి సంతానం కోసం ప్రతి నిత్యం భక్తితో శివుని ఆరాధించేవారు. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనాదేవికి అనుగ్రహిస్తాడు. కాలక్రమంలో అంజనాదేవి గర్భవతియై శివాంశ సంభూతుడైన "శ్రీ ఆంజనేయస్వామి"కి పంపా క్షేత్ర కిష్కింధా నగరాన జన్మనిస్తుంది.
కేసరి నందనుడు
హనుమంతుడు కేసరికి జన్మించినందున హనుమంతుని కేసరి నందనుడని పిలుస్తారు.
వాయుపుత్ర హనుమాన్
వాయుదేవుడు అంజనాదేవికి శివాంశ సంభూత పండును అనుగ్రహించడం ద్వారా హనుమంతుడు జన్మించాడు కాబట్టి హనుమంతుని వాయుపుత్రుడు అని కూడా పిలుస్తారు.
ఘనంగా హనుమజ్జయంతి
శ్రీరామనవమి తర్వాత చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున సంప్రదాయం ప్రకారం హనుమంతుని ఉపాసకులు ఘనంగా హనుమజ్జయంతి పండుగ జరుపుకుంటారు. శ్రీరామనవమితో పాటు హనుమజ్జయంతి కూడా సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం మన ఆచారం. ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీ శనివారం చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు హనుమజ్జయంతిగా జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు.
హనుమజ్జయంతి ఇలా జరుపుకోవాలి
హనుమజ్జయంతి రోజు సూర్యోదయంతోనే స్నానం చేసి శుచియై హనుమంతుని విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఈ రోజు పసుపు లేదా సింధూరం రంగు వస్త్రాలు ధరించాలి. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి. హనుమంతునికి సింధూరంతో అలంకారం చేయాలి. హనుమంతునికి వడపప్పు, పానకం, కొబ్బరికాయలు, అరటిపండ్లు, పులిహోర వంటి ప్రసాదాలు నివేదించాలి. కర్పూర నీరాజనాలు సమర్పించి నమస్కరించుకోవాలి.
ఆలయాల్లో ఇలా!
హనుమజ్జయంతి రోజు సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయంలో హనుమంతునికి ఆకుపూజ చేయించి వడమాల సమర్పిస్తే హనుమంతుని అనుగ్రహంతో కార్యసిద్ధి, శత్రుజయం కలుగుతాయని విశ్వాసం.
భక్తి ప్రధానం
ఆంజనేయస్వామి పూజలో భక్తి ప్రధానం. ఆంజనేయుడు రామభక్తుడు. అందుకే హనుమను పూజించేటప్పుడు కూడా భక్తి ప్రధానం. భక్తితో మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేసినా స్వామి అనుగ్రహిస్తాడు. భక్తి లేకుండా ఎంత పెద్ద పూజలు చేసిన వ్యర్థమే! శ్రీరాముని పట్ల హనుమంతునికి ఉన్న భక్తి ప్రపత్తులు వల్లనే ఆంజనేయుడు శ్రీరామునికి నమ్మిన బంటు అయ్యాడు. ఆంజనేయ తత్వం నుంచి మనం గ్రహించవలసినది కూడా ఇదే!
మనం కూడా హనుమజ్జయంతి పండుగను జరుపుకుందాం హనుమంతుని అనుగ్రహంతో అభీష్ట సిద్ధి, కార్య సిద్ధిని పొందుదాం.
జై శ్రీరామ్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.