Hanuman Jayanthi 2025 : రామభక్తులంతా హనుమాన్ జయంతి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రతి సంవత్సరమూ ఛైత్ర మాసంలోని పౌర్ణమి నాడు ఈ పండుగ జరుపుకుంటారు. మరి, 2025లో హనుమాన్ జయంతి ఏ తేదీన వచ్చింది? ఏ వారం? ఘడియలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
అష్టాదశ చిరంజీవుల్లో ఒకరు :
హనుమంతుడికి మరణం లేదని, చిరంజీవి అని పురాణోక్తి. అష్టాదశ చిరంజీవులలో హనుమంతుడు ఒకరని చెబుతారు. వ్యాస మహర్షి, అశ్వత్థామ, విభీషణుడు, బలి చక్రవర్తి, కృపాచార్యుడు, పరశురాముడు, మార్కండేయుడితోపాటు ఆంజనేయుడు మరణం లేనివాడిగా చెబుతుంటారు. అంతేకాదు ఇప్పటికీ హనుమంతుడు భూమ్మీద ఉన్నాడని భక్తులు నమ్ముతారు. హిమాలయాల్లో మంచు మనిషి రూపంలో ఉన్నాడని విశ్వసిస్తారు. అలాంటి మారుతికి ఆయన జయంతి వేళ నిష్ఠతో పూజలు చేస్తే, కష్టాలు తొలగుతాయని, హనుమాన్ శక్తి వెన్నంటి ఉంటుందని భక్తులు నమ్ముతారు.
పూజా విధానం :
హనుమాన్ జయంతి వేళ స్వామితోపాటుగా సీతారాములను సైతం పూజించడం సంప్రదాయం. మరి, ఈ పవిత్రమైన రోజున పూజావిధానం ఎలా ఉందో తెలుసుకుందాం.
హనుమాన్ జయంతి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి. చక్కగా స్నానం ఆచరించాలి.
పూజ కోసం శుభ్రమైన దుస్తులు ధరించాలి. సాధ్యమైనంత వరకు ఎర్రటి వస్త్రాలను ధరిస్తే మంచిది.
స్వామి వారికి సింధూరం, ఎర్ర రంగు పూలు, ఇంకా తులసి దళాలు సమర్పిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు.
హనుమంతుడికి కొబ్బరికాయ కొట్టిన తర్వాత చాలీసా పారాయణం చేయాలి. దీనివల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.
అనంతరం స్వామికి తమలపాకుల దండ లేదంటే "వడ మాల"ను సమర్పించాలి.
చివరగా ఆంజనేయుడికి హారతిచ్చి, శనగలు, అప్పాలు, బూందీ లడ్డూ వంటి ప్రసాదాలు సమర్పించాలి.
ముహూర్తపు ఘడియలు :
ఏప్రిల్ 12 శనివారం రోజున బ్రహ్మ ముహూర్తంలో స్వామి జయంతి ఘడిలు ప్రారంభం అవుతాయి.
శనివారం తెల్లవారుజామున 3:21 గంటలకు పౌర్ణమి తిథి ఘడియలు మొదలవుతాయి.
మర్నాడు ఆదివారం (ఏప్రిల్ 13) ఉదయం 5:51 గంటలకు పౌర్ణమి తిథి ఘడియలు ముగుస్తాయి.
హిందూ పురాణాల ప్రకారం ఆంజనేయుడు సూర్యోదయ వేళలో జన్మించాడని చెబుతారు.
ఈ సారి తిథి ఘడియలు కూడా ఉదయం వేళనే ప్రారంభం కావడం విశిష్టతగా పండితులు చెబుతున్నారు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
హనుమ పూజతో కార్యసిద్ధి, శత్రుజయం - మంగళవారం ఇలా చేస్తే కోర్కెలు నెరవేరుతాయ్!