Hanuman Chalisa Significance : మే 22 వ తేదీ గురువారం వైశాఖ బహుళ దశమి హనుమజ్జయంతి జరుపుకోనున్నాం. ఈ సందర్భంగా హనుమంతుని ఆరాధనలో ప్రత్యేక స్థానమున్న హనుమాన్ చాలీసా విశిష్టతను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
ఏది చదివితే గ్రహ పీడలతో సతమతమయ్యేవారు ఉపశమనం పొందుతారో, అనారోగ్యంతో బాధపడే వారికి స్వస్థత చేకూరుతుందో, దుష్ట శక్తుల కోరల నుంచి విముక్తి పొందుతారో అదే శ్రీ హనుమాన్ చాలీసా! హనుమాన్ చాలీసా పఠనం ఎంతటి మహిమ కలదో ఇప్పుడు తెలుసుకుందాం.
రామభక్త హనుమాన్!
హిందూ పురాణాల ప్రకారం హనుమంతుడు గొప్ప రామ భక్తుడు. ఆంజనేయుని కంటే గొప్ప భక్తుడు ఈ లోకంలో ఎవరూ లేరని అంటారు. శ్రీరాముని అనుగ్రహం కావాలనుకునే వారు ఆంజనేయ స్వామిని కొలవాలంట! మరి ఆ హనుమయ్య శ్రీరామా అని అన్నవారికి దాసుడవుతాడంట! ఇదే శ్రీరామునికి, హనుమంతునికి మధ్య ఉన్న అవినాభావ సంబంధం. ఇక ఇద్దరినీ కలిపి పూజించే వారికి ఈ లోకంలో తిరుగే ఉండదు.
జై చిరంజీవ! జగదేక వీర!
పవన పుత్ర హనుమాన్ నేటికీ చిరంజీవిగా భూమిపై తిరుగుతున్నాడన్నది కాదనలేని సత్యం. ఎక్కడెక్కడ శ్రీరాముని కీర్తనలు, కథలు, భజనలు జరుగుతాయో అక్కడక్కడ హనుమంతుడు సూక్ష్మ రూపంలో ఉంటాడంట! అలాంటి చిరంజీవి అయిన హనుమంతుని ఆరాధిస్తే ఇంట్లో సుఖం, శాంతి, ఐశ్వర్యం, ధైర్యం, విజయం, అభయం, ఆయువు, ఆరోగ్యం ఇలా అన్నీ సమకూరుతాయి.
సానుకూల శక్తికి సంకేతం హనుమాన్ చాలీసా
'జై హనుమాన జ్ఞాన గుణసాగర' అంటూ మొదలయ్యే హనుమాన్ చాలీసా పఠించే వారికి జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోగల మనో నిబ్బరం వస్తుంది. హనుమాన్ చాలీసా చదివే వారికి సానుకూల దృక్పధం ఎక్కువగా ఉంటుంది. గొప్ప గొప్ప మానసిక శాస్త్రవేత్తలు కూడా సానుకూల ఆలోచనలు ఉంటేనే జీవితంలో అభివృద్ధి చెందుతారు అని చెబుతారు కదా!
- హనుమాన్ చాలీసా చదివితే జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
- హనుమాన్ చాలీసా రోజుకు ఒక్కసారి పఠిస్తే చాలు దుష్ట శక్తుల నుంచి విముక్తి లభిస్తుందని పెద్దలు అంటారు.
- హనుమాన్ చాలీసా పఠిస్తే రోగాలు నశించి పోతాయి, పీడలు హరించిపోతాయి.
- హనుమాన్ చాలీసా పఠనం వలన సంకటాలు తొలగిపోయి, సకల కార్య సిద్ధి కలుగుతుంది.
- హనుమాన్ చాలీసా పఠించే వ్యక్తికి బలం, తెలివి, మేధస్సు పెరుగుతుంది. అన్ని దుఃఖాలన్నీ దూరమవుతాయి.
- గ్రహ పీడల వలన కానీ, దుష్ట శక్తుల వలన కానీ కలిగే శోకాలను నివారించే అద్భుతమైన శక్తి కలది హనుమాన్ చాలీసా!
- శనివారం హనుమాన్ చాలీసా పఠించి, ఆంజనేయస్వామిని ప్రార్ధిస్తే గ్రహచార రీత్యా ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఉన్న వాళ్లకు శని బాధల నుంచి ఉపశమనం ఉంటుంది.
- తీవ్ర రోగాలతో, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారు హనుమాన్ చాలీసా నిత్యం పఠించడం అలవాటు చేసుకుంటే అది సంజీవని లాగా పనిచేసి ఆయువు, ఆరోగ్యం కలిగి తీరుతాయని శాస్త్ర వచనం.
- పూర్వజన్మ కృత పాప ఫలితంగా దారిద్య్రం అనుభవించే వారు హనుమాన్ చాలీసా నిత్య పారాయణతో అష్టైశ్వర్యాలను పొందుతారు.
ఇలా ఒకటేమిటి భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పఠిస్తే మనం ఏది కోరుకుంటే అది ఆ ఆంజనేయ స్వామి తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఈ హనుమజ్జయంతి నుంచి మనం కూడా హనుమ చాలీసా పారాయణ యజ్ఞాన్ని ప్రారంభిద్దాం. ఆ హనుమంతుని అనుగ్రహంతో సకల శుభాలు పొందుదాం. జై శ్రీరామ్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.